ధీరగళం

Sakshi interview with singer Chinmayi

సమంత నటనకు ఆమె గొంతు తోడైంది. సింగర్‌గా మంచి గాత్రం ఉంది. ‘అందాల రాక్షసి’ హీరో రాహుల్‌ రవీంద్రన్‌ భార్యగా సినిమా పరిశ్రమలో ఓ స్వరం అయింది. ఇప్పుడు అదే గొంతు.. అదే గాత్రం.. అదే స్వరం.. ‘మీటూ’ ఉద్యమానికి ఓ ధీరగళమైంది! తన అనుభవాలను చెబుతూనే.. మిగతా అమ్మాయిల్నీ ట్వీట్‌లతో అప్రమత్తం చేస్తోంది. ఆ ధీరమయి.. చిన్మయితో సాక్షి ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ.

‘వైరమ్‌’ అంటే తమిళంలో డైమండ్‌. డైమండ్‌ని పగలగొట్టడం అంత సులువు కాదు. రచయిత వైరముత్తుని తమిళనాడులో వైరమ్‌ అంటారు. తనని ఢీ కొనేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?
చిన్మయి: నా ఫ్యామిలీ నుంచి వచ్చింది. మా ఆయన (నటుడు, దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌), మా అత్తమామల నుంచి వచ్చింది. ఎప్పుడైతే ఫ్యామిలీ సపోర్ట్‌ దొరుకుతుందో అప్పుడు ఏ అమ్మాయి అయినా నోరు విప్పగలుగుతుంది.

రాహుల్‌ సపోర్ట్‌ చేయబట్టే ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారా? లేకపోతే మాట్లాడే వారు కాదా?
నేను వేరే ఎవర్ని పెళ్లి చేసుకుని ఉన్నా ఈ సంఘటనలు బయటకు వచ్చేవి కాదేమో. రాహుల్‌ లాంటి భర్త దొరకడం అదృష్టం. మా ఇంట్లో మా అమ్మవాళ్లే భయపడ్డారు. బయటికి చెప్పొద్దు అన్నారు. కానీ రాహుల్, అత్తమామలు ధైర్యం ఇచ్చారు. రాహుల్‌ నాతో ఏం చెబుతాడంటే.. ఏ పని చేసినా సరిగ్గా చేస్తున్నావా లేదా చూసుకో. ఏ నిర్ణయాన్నీ ఎమోషనల్‌గా తీసుకోకూడదు. నువ్వు అనుకున్న విషయంలో నిజాయతీ ఉంటే.. ‘గో ఎహెడ్‌’ అంటాడు.

వైరముత్తు మీద వేరే అమ్మాయిలు చేసిన ఆరోపణలను మీ ట్వీటర్‌ ద్వారా బ్రేక్‌ చేయబోతున్నాను అని ముందే ఇంట్లో చెప్పారా?
నా పెళ్లి తర్వాత ఓ పబ్లిక్‌ ఈవెంట్‌ కోసం పాడమని వైరముత్తు అడిగారు. కుదరదు అని చెప్పాను. ‘నువ్వు పాడకపోతే నాకున్న పొలిటికల్‌ కనెక్షన్స్‌తో ఆయన (ఓ రాజకీయ నాయకుడు) గురించి నువ్వు ఓ వేదిక మీద తప్పుగా మాట్లాడావు’ అని చెబుతాను అన్నారు. ‘నేను స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి నిజానిజాలు చెబుతాను. ఆయన నన్ను నమ్ముతారు  మిమ్మల్ని కాదు’ అన్నాను. రాహుల్‌కి, మా అత్తమామలకు ఈ విషయం చెప్పి, ఏడ్చాను. కానీ అప్పుడు నేను బయటకు చెప్పలేదు. ఇప్పుడు ‘మీటూ ఉద్యమం’ వల్ల ఈయన గురించి బయటకు చెప్పగలిగాను. ఇప్పటివరకూ తమిళనాడులో ఎవరికీ ఈయన గురించి మాట్లాడటానికి ధైర్యం సరిపోలేదనుకుంటాను. సంధ్యా మీనన్‌ అనే ట్వీటర్‌ అకౌంట్‌ నుంచి ఓ కథనం వచ్చింది. దాని తర్వాత నాతో కొందరు తమపై జరిగిన వేధింపులను షేర్‌ చేసుకున్నారు. ఇంతమంది ముందుకు వస్తున్నారు. నేను చెప్పకపోవడం కరెక్ట్‌ కాదనుకున్నాను. అందుకే పేరు చెప్పడానికి భయపడినవారి మెసేజ్‌లను నేను బయటపెట్టాను. నేను ఇలా ఆరోపించినందుకు కొంతమంది అసహ్యంగా మాట్లాడతారు. ఏం ఫర్వాలేదు.

ఇప్పుడు మీరు స్టార్‌ సింగర్‌. ఒకవేళ కెరీర్‌ స్టార్టింగ్‌ స్టేజ్‌లో ఉంటే ఈ ఆరోపణలు చేసేవారా?
చేసి ఉండకపోవచ్చు. నేను షేర్‌ చేసిన కొన్ని కథనాల్లో కెరీర్‌ స్టార్టింగ్‌ స్టేజ్‌లో ఉన్న ఓ సింగర్‌కి జరిగిన ఇన్సిడెంట్‌ ఉంది. తనకిలా జరిగింది అని వాళ్ల భర్తతోనే చెప్పలేకపోయింది. ఎందుకంటే  ఈ ఫీల్డ్‌ వద్దు, ఇంట్లో కూర్చోమంటాడేమో అని భయం. ఎవరో చేసే తప్పుకు నా కల చెదిరిపోవడమేంటి? అని ఆ అమ్మాయి బాధ. ఇవన్నీ ఊహించుకుని ఆ అమ్మాయి తన భర్తకు విషయం చెప్పుకోలేకపోయింది.  

‘నన్ను వేధిస్తున్నాడు’ అని అమ్మాయి చెప్పినప్పుడు ‘నీలోనే తప్పుంది’ అని కొన్నిసార్లు అమ్మాయినే నిందించడం చూస్తుంటాం..
అవును. అలాంటివి నాకూ తెలుసు. అమ్మాయిలను వేధిస్తున్నవాళ్లలో ముఖ్యంగా టీచర్స్, డాక్టర్స్, లాయర్స్, మావయ్య, అన్న, బావ ఉంటారు. ‘‘నాతో మా మామగారు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అని మా ఆయనకు చెబితే మా మామగారిని ఇంట్లోకి రావద్దని చెప్పారు’’ అని ఓ అమ్మాయి చెప్పింది. ఇంకో అమ్మాయి ఏమో ‘‘మా మామగారు ఇలా ఇబ్బంది పెడుతున్నారు అంటే నా మాట నమ్మలేదు. మా ఆయన నాకు విడాకులు ఇచ్చేశాడు’ అని చెప్పింది. సొసైటీలో అర్థం చేసుకునే అన్నలు, భర్తలు, మామలు దొరకడం చాలా రేర్‌ అయిపోయింది. కానీ అది చాలా కామన్‌ అవ్వాలి.

దీని వల్ల మీకు అవకాశాలు తగ్గుతాయంటారా?
నాకు తెలియదు. నాలుగైదు రోజులుగా మాట్లాడుతున్నాను. ప్రస్తుతానికి బిజీగా ఉన్నాను. ఫ్యూచర్‌లో ఏం జరుగుతుందో చెప్పలేం.

ఇప్పుడు సినీ పరిశ్రమలో చాలామంది మగవాళ్ల ‘డార్క్‌ సైడ్‌’ బయటకు వచ్చింది. ఈ ప్రభావంతో ఇక స్త్రీలపై వేధింపులు తగ్గుతాయంటారా?
ఆ మార్పు వస్తుందనే ఆశ ఉంది. ఒక్క చిన్మయి కాదు నాతో పాటు వచ్చేవాళ్లు చాలామంది ఉన్నారు. ఇండస్ట్రీలో దీనికి సంబంధించిన స్టెప్స్‌ తీసుకుంటున్నాం. అసోసియేషన్‌ ఏర్పాటు చేస్తున్నాం. వేధింపులతో కుంగినవాళ్లను బయటకు తీసుకువచ్చి చికిత్స చేసి మామూలు జీవితాన్ని గడిపేలా చేస్తాం.

వేధింపులు ఎదురయ్యాయని చెబితే, ‘నువ్వు అక్కడికి వెళ్లొద్దు.. ఉద్యోగం మానెయ్‌’ అనే బదులు ఎలా డీల్‌ చేయాలో నేర్పిస్తే బాగుంటుంది కదా?
ఎగ్జాట్లీ. కొన్ని నెలల క్రితం ఒక అబ్బాయి నాతో ‘మీరంతా సెలబ్రిటీస్‌. మీకు సెక్యూర్టీ ఉంటుంది. మేం కామన్‌ పీపుల్‌. మా చెల్లెల్ని ఒకడు ఈవ్‌ టీజ్‌ చేశాడు. ఆ అబ్బాయిని కొట్టాను కానీ మా చెల్లిని చదువు మానేసి, ఇంట్లోనే ఉండమన్నాను’ అన్నాడు. దెబ్బలు తిన్నవాడు కొన్ని వారాల్లో మామూలుగా తిరుగుతాడు. కానీ వాళ్ల వల్ల వీళ్ల చదువు, కలలు అన్నీ పోతున్నాయి కదా.

ఇంట్లో ఎందుకు కూర్చోవాలి? అమ్మాయికి బయట వేధింపులు ఎదురైతే, చదువు మానిపించేసి, పెళ్లి చేసేయడమేనా? అమ్మాయిలను ఓ ప్యాకేజ్‌ అనుకుంటారేమో? పుట్టింటి నుంచి ఆ ప్యాకేజీని మెట్టినింటికి పంపించేస్తే, తమ బాధ్యత తీరిపోయిందని కొందరు తల్లిదండ్రులు భావిస్తారు. అక్కడ్నుంచి అత్తింటివాళ్లు ఆ ప్యాకేజీని మోసే క్రమంలో చాలా ఆంక్షలు పెడతారు. చాలామంది అమ్మాయిలు ఇలాంటి దయనీయ స్థితిలో ఉన్నారు. ఇది మారాలి. కొందరు మగవాళ్లు ఈ మార్పుని ఆశిస్తున్నారు. ఎగ్జాంపుల్‌ మా ఆయన.

స్త్రీ ఏదైనా మాట్లాడాలన్నా, చేయాలన్నా ఒక మగాడి సహాయం ఎందుకు కోరుకోవాలి?
ఫ్యామిలీ. అదొక ధైర్యం. ఫ్యామిలీ సపోర్ట్‌ ఉంటే మనం ఏమైనా చేయొచ్చు. ఫ్యామిలీ సపోర్ట్‌ లేకుండా కూడా ఎన్నో సాధిస్తున్నారు. కాదనడంలేదు. ఫ్యామిలీ నుంచి స్త్రీకి మాత్రమే కాదు.. పురుషులకూ సపోర్ట్‌ లభిస్తుంది. రాహుల్‌ ఆర్టిస్ట్‌గా చేస్తున్నాడు. అయితే డైరెక్షన్‌ చేస్తానంటే వద్దన్నవాళ్లు ఎక్కువ. నేను సపోర్ట్‌ చేశాను. ఇప్పుడు తను నాకు అండగా నిలబడ్డాడు. స్త్రీకైనా, పురుషుడికైనా ఫ్యామిలీ సపోర్ట్‌ ఉండాలి.

బెదిరింపులు ఏమైనా వచ్చాయా?
బెదిరింపులు రాలేదు కానీ, నా మంచి కోరి కొందరు ‘జాగ్రత్త’ అన్నారు. నువ్వు రోడ్డు మీద కనిపిస్తే నీ అంతు చూస్తాం లాంటివి అయితే రాలేదు. ప్రస్తుతానికైతే భద్రంగానే ఉన్నాను అని అనుకుంటున్నాను. ఇది జరగబోతోంది అనే అనవసరపు సందేహాలు ముందే చెప్పను. ఒకవేళ జరిగితే చూసుకుందాం.

రుజువేంటి? అని అడిగే వాళ్ల గురించి?
స్కూల్‌ని తీసుకుందాం. ఒక అమ్మాయి దగ్గర టీచర్‌ మిస్‌ బిహేవ్‌ చేస్తాడు. అతను అలా చేస్తాడని ఊహిస్తుందా? పోనీ ఊహించినా స్కూల్‌ పిల్లల దగ్గర కెమెరాలు, ఫోన్‌లు ఉంటాయా? స్కూల్‌ కాకపోతే ఆఫీసుని తీసుకుందాం. అమ్మాయిలు కెమెరాలు వెంటబెట్టుకుని తిరుగుతారా? ప్రతిదానికీ రుజువు అంటే చూపించలేం కదా.

జనరల్‌గా అమ్మాయిలు లైంగిక వేధింపులకు గురైనప్పుడు కొందరు అది తమ తప్పుగా ఫీలవుతుంటారు. వాళ్లు ధైర్యంగా బయటకు చెప్పాలంటే ఏం చేయాలి?
ఒకవేళ లైంగిక దాడి జరిగితే ‘అది మీ తప్పు కాదు. శాడిస్ట్‌ మైండ్‌ ఉన్న ఒక కామాంధుడు చేసిన తప్పు, నేరం’ అని చిన్నప్పుడే పిల్లలకు చెప్పాలి. ఎందుకంటే ఏడెనిమిదేళ్ల వయసులో ఉన్నవాళ్లు  ఎలా చెప్పగలుగుతారు? మామూలుగానే చిన్నపిల్లలు పెద్దలంటే భయపడతారు. పైగా ‘ఇంట్లో చెప్పావా.. జాగ్రత్త’ అని భయపెట్టినప్పుడు ఇంకా భయపడతారు. పసి వయసులో పడిన ఈ మచ్చ వాళ్లతో పాటే పెరిగి పెద్దది అవుతుంది. పెద్దయ్యాక కూడా చెప్పలేరు.

‘మీరు మాతో ఏదైనా చెప్పొచ్చు’ అని పేరెంట్స్‌ నుంచి భరోసా దొరికితే పిల్లలు ఇంట్లో చెప్పగలుగుతారు. ఈ సందర్భంగా ఓ సంఘటన గురించి చెబుతాను. ‘మీటూ’ వల్ల చిన్నప్పుడు మా అన్నయ్య నన్ను లైంగికంగా వేధించిన విషయాన్ని ఇప్పుడు మా ఇంట్లో చెప్పాను. అప్పుడు తెలిసింది ఏంటంటే వాళ్ల అమ్మాయి (ఏడేళ్ల పాప)ని కూడా మా అన్నయ్య లైంగికంగా వేధిస్తున్నాడు’ అని ఒకరు చెబితే షాకయ్యాను.

ఇంకో  అమ్మాయిని స్వయంగా ఆమె బావే వేధించాడు. బయటకు చెబితే.. మీ అక్కయ్య దగ్గర నువ్వే నన్ను కోరుకున్నావు అని చెబుతానని బెదిరించాడట. దాంతో పాటు  మీ అక్క కాపురం పాడైపోతుంది, మా పిల్లలు ఉన్నారు అంటూ డ్రామా రుద్దుతారు. బాధితులకు ఈ లైంగిక వేధన ఒకవైపు.. ఇలాంటి యాతన మరోవైపు. పాపం.. ఎన్ని బాధలు మోస్తారు?  నేను చెబుతున్నవన్నీ సాధారణ కుటుంబాలకు చెందిన ఆడవాళ్లు పడుతున్న బాధలే.

ఆర్థిక పరిస్థితులు కూడా వేధింపులు బయటకు చెప్పకుండా నోరు నొక్కేస్తాయేమో కదా?
అది ముఖ్యమైన కారణం. ఆర్థికంగా నిలబడగల స్వాతంత్రం లేనప్పుడు ఒకవేళ చెల్లెలే స్వయంగా చెప్పినా, గొడవ చేసి భర్త వదిలేస్తాడేమో? విడాకులు అంటాడేమో? అప్పుడు ఆర్థికంగా అంతంత మాత్రమే ఉన్న పుట్టింటికి వెళ్లి వాళ్లకు భారం కావాలా? పిల్లల పరిస్థితి ఏంటి? అని ఆ అక్కే మదనపడిపోతుంది. ‘నా ఖర్మ’ అని బాధనంతా మనసులోనే దాచేసుకుని అతనితోనే ఉంటుంది. అలాంటి వాళ్లను మనం నిందించలేం కూడా. ఎందుకంటే ఆవిడ తన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది కాబట్టి. ఫైనాన్షియల్‌గా ఇతరుల మీద ఆధారపడినప్పుడు ఇలాంటివి భరించాల్సి వస్తుంది. అదే ఆ అమ్మాయి ఉద్యోగం చేస్తుంటే ఈ భయం అక్కర్లేదు కదా. అందుకే ముందు ఆడపిల్లలు తమ కాళ్ల మీద తాము నిలబడగలిగేలా తల్లిదండ్రులు చేయాలి. బాగా చదివించాలి. పెళ్లి ఎంత ముఖ్యమో అమ్మాయికి కెరీర్‌ ఉండటం కూడా అంతే ముఖ్యం.

‘ఈ ఆరోపణలు నా మీద బురద జల్లే ప్రయత్నం’ అని వైరముత్తు పేర్కొన్నారు. ఏమంటారు?
అలా అన్నారే కానీ ‘నేనలా చేయలేదు... ఇదంతా అబద్ధం’ అని ఆయన చెప్పాలి కదా. ఇలాంటివి వస్తాయి.. అలాంటివి వస్తుంటాయి అని మాట వరసకు అంటే సరిపోతుందా? ఏమీ లేనప్పుడు స్ట్రాంగ్‌గా ఖండించవచ్చు కదా. ఆడవాళ్ల కోసం ఆయన హాస్టల్స్‌ నడుపుతున్నారు. అక్కడి నుంచి ఆయన గురించి ఎక్కువగా వినిపిస్తుంటాయి. అయితే ఆయనకు ఎదురుగా నిలబడే ధైర్యం పాపం ఎవరికీ లేదు. అందుకే ఎవరూ బయటకు చెప్పరు.

పదేళ్ల క్రితం నానా పటేకర్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించిన విషయాన్ని ఇప్పుడు బయటపెడితే.. ముందే ఎందుకు చెప్పలేదు అని తనుశ్రీని కొందరు తప్పుబడుతున్నారు..
అప్పుడే ఆవిడ కంప్లయింట్‌ ఇచ్చింది.. మేమే తీసుకోలేదు అని యాక్టర్స్‌ అసోసియేషన్‌ వాళ్లు రికార్డ్‌లో చెప్పారు. సొసైటీతో వచ్చిన సమస్యేంటంటే ఎవరు పవర్‌ఫుల్లో వాళ్లకే సపోర్ట్‌ చేస్తారు కానీ ఏది కరెక్టో దానికి చేయరు. అయితే ‘మీటూ’లాంటి వాటి వల్ల ఏదైనా మార్పు వస్తుందని చిన్న ఆశ కలుగుతోంది.  నేను ఓ షోకి జడ్జిగా చేస్తున్నాను. ఒక అమ్మాయి పాట పాడుతూ ‘ఐ బిలీవ్‌ యు (నేను నిన్ను నమ్ముతున్నాను) అని చెప్పింది. ఆ మూడు పదాలు వినగానే ఎంత గొప్పగా అనిపించిందో చెప్పలేను.

ఏదైనా ఇష్యూకి కొన్ని రోజులు మాత్రమే హైప్‌ ఉంటుంది. ఆ తర్వాత అందరూ మర్చిపోతారు. ‘మీటూ’ ద్వారా వినిపిస్తున్న సమస్యలు కూడా అంతేనా?
మీరన్నట్లు ఇవాళ ఇది హాట్‌ టాపిక్‌. రేపు ఇంకోటి వెలుగులోకి వస్తే ఇది బ్యాక్‌సీట్‌ తీసుకునే అవకాశం ఉంది. కానీ దీని వల్ల ఉపయోగం ఏంటంటే.. ‘నాకు ఇలా జరిగింది అని ముందు ముందు ఎవరైనా చెబితే.. వింటారు. సైలెంట్‌గా ఉండు, ఇలాంటివి మాట్లాడొచ్చా అనరు  అనే నమ్మకం నాకుంది. ‘మనం ఏదైనా చేస్తే కచ్చితంగా బయటకు వస్తుంది’ అనే భయం మొదలవుతుంది. అప్పుడు వేధింపులు తగ్గుతాయి.

తగ్గుతాయనే ఫీలింగ్‌ చాలామందికి ఉంది. అయితే ‘నిర్భ య’ ఘటన తర్వాత ‘గ్యాంగ్‌ రేప్స్‌’ గురించి ఎక్కువ వింటున్నామేమో అనిపిస్తోంది?
ఎక్కువ అయిపోవడం కాదు. అంతకుముందు కూడా ఎక్కువ జరిగేవే. కానీ బయటకు చెప్పేవాళ్లు కాదు. ఇప్పుడు చెబుతున్నారు కాబట్టి ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. అందుకని ఎక్కువ జరుగుతున్నాయనిపిస్తోంది. నిర్భయ రిపోర్ట్‌ చేయడంవల్లే అది ఇంటర్నేషనల్‌ ఇష్యూ అయింది. రేప్‌కి గురైనవాళ్లు ధైర్యంగా చెబుతున్నారు. నేను మగాణ్ణి. స్త్రీని ఏమైనా చేస్తాను అనే వైఖరి చాలా వరకూ మారింది.

ఫైనల్లీ స్త్రీ నడక, నడత బాగుంటే మాత్రమే కాదు.... ఆమె శీలవతి అయ్యుండాల్సిందే అనే అభిప్రాయం సమాజంలో ఉండబట్టే, ఆమె పరువు తీయాలంటే మానభంగం చేయాల్సిందేనని కొందరి మగవాళ్ల ఊహ...
యాక్చువల్‌గా సమాజంలో ఈ ధోరణి ఉండడంవల్లే అత్యాచారం జరిగితే చాలామంది బయటకు చెప్పుకోవడం లేదు. ఆమె గుణం ఎంత మంచిదైనా ‘శీలవతి’ కాదని ముద్ర వేస్తారు. ‘శీలం అనేది నీ గౌరవంతో ముడిపడి ఉంది, నష్టాన్ని భయపెడితే నీకే లాస్‌’ అనే భ్రమలో ఆడవాళ్లను పడేశారు.

వ్యక్తిత్వంకన్నా ‘ఫిజికల్‌ థింగ్‌’ ఇంపార్టెన్స్‌ అన్నట్లు అయిపోయింది. పురాణాల్లో ఆ సీతమ్మకే తప్పలేదు. రావణాసురుడు ఎన్ని ఇబ్బందులు పెట్టాడు. రాముడు తన భార్యను మళ్లీ తెచ్చుకోగలిగాడు. అయితే ఏం చేశాడు? ఎవరో ఏదో అన్నారని అగ్ని పరీక్ష చేసి, తాను పునీతను అని నిరూపించుకోమన్నాడు. పాపం సీతమ్మ. ఇక మనమెంత? మంచి మార్పుని ఆశిద్దాం. మార్పు కోసం ముందడుగు వేద్దాం.

– డి.జి. భవాని

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top