రహస్యం హిట్‌ అవ్వాలి | Sakshi
Sakshi News home page

రహస్యం హిట్‌ అవ్వాలి

Published Sun, Nov 11 2018 5:39 AM

rahasyam movie trailer release - Sakshi

‘‘సినిమాల మీద మంచి అభిరుచి ఉన్న నిర్మాత రామసత్యనారాయణగారు. చిన్న సినిమాలు తీసి,  విజయవంతంగా విడుదల చేయటంలో ఆయనకు ఆయనే సాటి. తాజాగా ఆయన నిర్మించిన ‘రహస్యం’ సినిమా మంచి హిట్‌ అవ్వాలి’’ అని డైరెక్టర్‌ మారుతి అన్నారు. సాగర్‌ శైలేష్, శ్రీ రితిక జంటగా ‘జబర్దస్త్‌’ అప్పారావు ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘రహస్యం’. సాగర శైలేశ్‌ దర్శకత్వంలో భీమవరం టాకీస్‌ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించారు.

ఈ సినిమా రెండో ట్రైలర్‌ని మారుతి విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాని శైలేష్‌ స్టైల్‌గా తెరకెక్కించాడు. ట్రైలర్‌ చూస్తుంటే డైరెక్టర్, అతని టీమ్‌ బాగా కష్టపడ్డారని తెలుస్తోంది. దర్శకునిగా తనకు మంచి భవిష్యత్తు ఉంది’’ అన్నారు. రామసత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘నూతన దర్శకులకు మార్గదర్శి మా ఆర్జీవీగారు (రామ్‌గోపాల్‌ వర్మ). ప్రతి కొత్త డైరెక్టర్‌ తమ చిత్రాలను ఆర్జీవీగారి చేతుల మీదుగా ప్రారంభించాలని కోరుకుంటారు. సాగర్‌ శైలేష్‌ తన శక్తిని, యుక్తిని, ప్రాణాన్ని పణంగా పెట్టి ‘రహస్యం’ సినిమా తీసాడు’’ అన్నారు. సాగర్‌ శైలేష్, శ్రీ రితిక పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement