మూవీ షూటింగ్స్‌కు గ్రీన్‌సిగ్నల్‌ | Sakshi
Sakshi News home page

ముద్దు సీన్లకు నో : షూటింగ్స్‌కు ఓకే

Published Mon, Jun 1 2020 8:42 PM

Movie shootings Resume In Maharashtra - Sakshi

సాక్షి, ముంబై :  లాక్‌డౌన్‌ కారణంగా రెండు నెలల పాటు మూతపడ్డ సినిమా కెమెరాలు క్లిక్‌ మనిపించేందుకు సిద్ధమవుతున్నాయి. బాలీవుడ్‌ సినిమాల చిత్రీకరణకు అనుమతినిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సినీ ప్రముఖుల విజ్ఞప్తి మేరకు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సినిమాలు, సీరియల్స్‌, యాడ్‌ షూటింగ్స్‌కు అనుమతినిస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూ షూటింగ్‌ జరుపుకోవచ్చని తెలిపింది. ముద్దు సీన్లు, హగ్‌ సీన్లు వంటివి లేకుండా చిత్రీకరణ జరపుకోవాలని సూచించింది. అలాగే షూటింగ్స్ జరుపుకోవాలంటే ఆయా జిల్లాకు చెందిన కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలని.. సినిమా సెట్స్, ఎడిటింగ్ స్టూడియోల్లో ఎక్కువ మంది ఉండకుండా భౌతిక దూరం పాటించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. అయితే ఎప్పటి నుంచి ప్రారంభించాలి అనేదానిపై తేదీని ప్రకటించాల్సి ఉంది. (నమస్తే ట్రంప్‌తోనే వైరస్‌ వ్యాప్తి..!)

కాగా టాలీవుడ్‌లో సినిమా షూటింగ్స్‌కు అనుమతి కల్పించాలంటూ తెలుగు చలనచిత్ర పరిశ్రమ పెద్దలు ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరిన విషయం తెలిసిందే. దానికి ప్రభుత్వం కూడా సుముఖత వ్యక్తం చేసింది. దశలవారీగా షూటింగ్స్‌కు అనుమతినిస్తామని తెలిపింది. ఇక తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కూడా సినిమా షూటింగ్స్‌కు అనుమతులు కోరుతూ చిత్ర పరిశ్రమ పెద్దలు ప్రభుత్వాలను కోరిన విషయం తెలిసిందే. (చిరు నివాసంలో సినీ పెద్దల సమావేశం)

Advertisement
Advertisement