వెళ్లగానే రెడ్‌ కార్పెట్‌ వేస్తారనుకోను

Mohan Krishna Indraganti interview about Sammohanam - Sakshi

మోహనకృష్ణ ఇంద్రగంటి

‘‘నేను హీరోని దృష్టిలో పెట్టుకుని కథ తయారు చేయను. కథ పూర్తయ్యాక హీరోగా ఎవరు సరిపోతారా అని ఆలోచిస్తాను’’ అని దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి అన్నారు. సుధీర్‌బాబు, అదితీరావు హైదరీ జంటగా ఆయన దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మించిన ‘సమ్మోహనం’ ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇంద్రగంటి పంచుకున్న విశేషాలు...

► స్టార్‌ హీరోలకు కథలు చెబుతున్నా. వారి మైండ్‌సెట్‌ తెలుసుకోకుండా రిజెక్ట్‌ చేస్తున్నారనుకోవడంలో అర్థం లేదు. వాళ్లను కలవగానే నాకు రెడ్‌ కార్పెట్‌ వేస్తారనుకోను. స్టార్స్‌తో సినిమా చేస్తే ఆ మజా వేరు. ఎక్కువమందికి రీచ్‌ అవుతుంది.

► ఈ చిత్రంలో నరేశ్‌గారిది సుధీర్‌ తండ్రి పాత్ర. సినిమా గొప్ప కళ అనే భావనలో ఉంటాడు నరేశ్‌. చిన్న పిల్లల ఇల్లస్ట్రేటర్‌ పాత్ర సుధీర్‌ది. తనకు సినిమా వాళ్లంటే పెద్దగా ఇష్టం ఉండదు. వీరి మధ్య జరిగే సంఘర్షణలో అమ్మాయి పాత్ర ఎలా ఎంటర్‌ అయ్యిందన్నదే కథ. నరేశ్‌గారి పాత్రకు తొలుత రావు రమేశ్, తనికెళ్ల భరణిగార్లను అనుకున్నా. సుధీర్‌ పాత్రకు ముందు విజయ్‌ దేవరకొండ, నానీని అనుకున్నా.

► సినిమా గురించి తృణీకార భావనతో (గడ్డిపోచలాగా తీసిపడేయడం) మాట్లాడేవారు చాలామంది ఉన్నారు. ఇందులో  సినిమా రంగం గురించి చెడుగా చూపించలేదు. ఎందుకంటే ఇక్కడ ఎంతోమంది గొప్పవారు ఉన్నారు. ఈ చిత్రం చూశాక ఇండస్ట్రీలో మంచి వారున్నారనే ఆలోచన రావాలి.  

► ఈ చిత్రంలో హీరో, హీరోయిన్‌ కలుసుకునే బ్యాక్‌డ్రాప్‌ కొత్తగా ఉంటుంది. అనుహ్యమైన పరిస్థితుల్లో వారు ఎలా ప్రేమించుకున్నారు? ఎలా విడిపోయారు? మళ్లీ ఎలా కలుసుకున్నారనే దాన్ని ఎంటర్‌టైనింగ్‌ వేలో చక్కగా చెప్పాం.

► రామ్‌చరణ్‌లాంటి హీరో ‘రంగస్థలం’లో చెవిటివాడి పాత్రలో మెప్పించడం గొప్ప విషయం. ‘మహానటి’లో స్టార్‌ హీరోలు లేకున్నా గొప్ప విజయం అందుకుంది. ప్రేక్షకులు కొత్తదనం కోసం ఎదురు చూస్తున్నారు. వారిని చేరుకోవడానికి మనమే ఆలస్యం చేస్తున్నాం.

► ఆడవాళ్లను చులకనగా చూపించకూడదు. హీరోయిజమ్‌ను ఎలివేట్‌ చేయాలని హీరోయిన్‌ని దద్దమ్మను చేయనక్కర్లేదు. ‘రంగస్థలం’లో సమంత, ‘మహానటి’లో కీర్తీసురేశ్‌ పాత్రలు ఎంత బావుంటాయి. మనం సినిమా సరిగ్గా తీయకుంటే అర్థం కాదు.

► వరుసగా ‘జెంటిల్‌మెన్, అమీతుమీ, సమ్మోహనం’ చిత్రాలు చేశా. కాస్త రెస్ట్‌ తీసుకుని తదుపరి సినిమాలు చేయాలనుకుంటున్నా. నెక్ట్స్‌ సినిమా కథ తయారు చేసుకోవాలంటే నాకు కనీసం ఏడాది పడుతుంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top