సందీప్‌ సిఫారసు చేశారు కానీ.. | Lavanya tripati about sandeep kishan | Sakshi
Sakshi News home page

సందీప్‌ సిఫారసు చేశారు కానీ..

May 2 2017 3:57 AM | Updated on Sep 5 2017 10:08 AM

సందీప్‌ సిఫారసు చేశారు కానీ..

సందీప్‌ సిఫారసు చేశారు కానీ..

మాయవన్‌ చిత్రానికి నటుడు సందీప్‌ కిషనే నన్ను సిఫారసు చేశారు కానీ..

మాయవన్‌ చిత్రానికి నటుడు సందీప్‌ కిషనే నన్ను సిఫారసు చేశారు కానీ.. అంటోంది నటి లావణ్య త్రిపాఠి. ఇంతకీ ఈ జాణ చెప్పొచ్చేదేమిటీ? ఆ కథాకమామీçషు ఏమిటో ఒక లుక్కేద్దాం. మిస్‌ ఉత్తరాఖండ్‌ అయిన ఈ అందగత్తె అందాల రాక్షసినంటూ టాలీవుడ్‌లో అడుగుపెట్టి తొలి చిత్రంతోనే సక్సెస్‌ అందుకుంది. ఇంకేముందీ అక్కడ అవకాశాలను బాగానే సంపాదించుకుంటోంది. యువ హీరోలతో పాటు, నాగార్జున వంటి సీనియర్‌హీరోతోనూ సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంలో నటించి లక్కీ నాయకిగా రాణిస్తోంది. ఇక కోలీవుడ్‌కు మూడేళ్ల క్రితమే బ్రహ్మన్‌ చిత్రం ద్వారా దిగుమతి అయినా ఆ తరువాత ఇక్కడ మళ్లీ కనిపించలేదు. తాజాగా మాయవన్‌ చిత్రంతో మరోసారి కోలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరిక్షించుకోవడానికి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా లావణ్యతో చిన్న భేటీ

ప్ర: ఒక్క చిత్రంతోనే కోలీవుడ్‌కు దూరం అయ్యారే?
జ: నేను తమిళంలో నటించి మూడేళ్లు అయిన విషయం నిజమే. అయితే తెలుగులో నటించిన తొలి చిత్రం అందాల రాక్షసి మంచి విజయం సాధించడంతో అక్కడ వరుసగా అవకాశాలు వస్తున్నాయి. తమిళంలో సరైన అవకాశాలు రాకపోవడం కూడా ఇంత గ్యాప్‌ రావడానికి కారణం. తెలుగులో బిజీగా ఉండటం వల్ల నేనూ తమిళ చిత్రాల అవకాశాల కోసం ప్రయత్నించలేదు.

ప్ర: తమిళంలో నటించిన తొలి చిత్రం విజయం సాధించకపోవడం వల్లే మీకు తదుపరి అవకాశాలు రాలేదని భావిస్తున్నారా?
జ: అదీ ఒక కారణం కావచ్చు. నా తొలి తెలుగు చిత్రం విజయం అక్కడ నన్ను బిజీ నాయకిని చేసింది. బ్రహ్మన్‌ చిత్రం సక్సెస్‌ అయితే తమిళంలో మరిన్ని అవకాశాలు వచ్చేవి అనుకుంటా. అయితే ఇప్పటికీ బ్రహ్మన్‌ నాకు నచ్చిన చిత్రం. అలాంటి చిత్రం  సక్సెస్‌ కాకపోవడానికి కారణం ఏమిటో నాకిప్పటికీ అర్థం కాలేదు.

ప్ర: మీరు మళ్లీ కోలీవుడ్‌కు రావడానికీ, మాయవన్‌లో నటించడానికి నటుడు సందీప్‌ కిషన్‌ సిఫారసు చేశారటగా?
జ: నిజమే. ఆ విషయం చెప్పడానికి సంకోచించను. మాయవన్‌ చిత్ర దర్శక నిర్మాత సీవీ.కుమార్‌ ఈ చిత్రం కోసం మీకు తెలిసిన నటి ఎవరైనా ఉంటే చెప్పమని సందీప్‌ను అడిగారట. మంచి నటనానుభవం కలిగి ఉండాలి. కోలీవుడ్‌కు బాగా తెలిసిన నటి కారాదు అని కూడా చెప్పారట. దీంతో సందీప్‌ కిషన్‌ నా పేరు సిఫారసు చేశారు. మా ఇద్దరి మేజర్‌ ఒక్కరే కావడంతో ఆయన నన్ను సిఫారసు చేశారు. ఆ తరువాత మాయవన్‌ చిత్ర కాస్టింగ్‌ డైరెక్టర్‌ నన్ను ఆడిషన్‌ చేసి సెలెక్ట్‌ చేశారు. అంతే కానీ సందీప్‌ కిషన్‌ నేను ఈ చిత్రంలో నటించి తీరాలని పట్టు పట్టలే దు. దర్శకుడికి నా గురించి చెప్పారు. అందుకు సందీప్‌కు కృతజ్ఞతలు.

ప్ర: సందీప్‌కిషన్‌ ఇటీవల వేరే నటితో కలిసి నటించిన చిత్రం మంచి విజయాన్ని సాధించినా, ఆమెను కాక మిమ్మల్ని సిఫారసు  చేయడానికి కారణం?
జ: ఈ ప్రశ్న మీరు ఆయన్నే అడగాలి. అయితే మీరు అనుకుంటున్నట్లు వేరే కారణం ఏమీ లేదు. సందీప్‌కిషన్, నేనూ మంచి స్నేహితులం మాత్రమే.

ప్ర: నటిగా తెలుగులో రంగప్రవేశం చేసి ఏడేళ్లు అయినా ఇంకా నెంబర్‌వన్‌ హీరోయిన్‌ కాలేదే?
జ: ఈ నెంబర్‌వన్, టూ స్థానాలపై నాకు నమ్మకం లేదు. తెలుగులో వరుణ్‌తేజ్, నాగార్జున, నాని, అల్లుశిరీష్‌ వంటి హీరోలతో నటించాను. చేసింది తక్కువ చిత్రాలైనా అన్నీ విజయం సాధించాయి. వచ్చిన అవకాశాలన్నీ అంగీకరించి చిత్రాల సంఖ్యను పెంచుకోవడం వల్ల ఏం ప్రయోజనం. మంచి కథా పాత్రలను ఎంచుకుని అన్ని వర్గాల ప్రేక్షకులకు సంతృప్తి కలిగించాలన్నదే నా భావన.

ప్ర: ఎలాంటి పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నారు?
జ: ఇంత సడన్‌గా అడిగితే ఏం చెప్పను. బాహుబలి చిత్రంలో అనుష్క, చంద్రముఖి చిత్రంలో జ్యోతిక, శ్రీరామరాజ్యం చిత్రంలో నయనతార నటించిన పాత్రల తరహాలో వైవిధ్యభరిత పాత్రల్లో నటించాలన్న ఆశ ఉంది.

ప్ర: సరే. పెళ్లి విషయం ఏమిటీ?
జ: జీవితంలో పెళ్లి చాలా ముఖ్యమైన అంశం. అందుకు మానసికంగా సిద్ధం కావాలి. సరైన జోడీ వెతుక్కోవాలి. అందరిని ఆహ్వానించి ఒక వేడుకలా వివాహతంతు నిర్వహించాలి. అన్నిటికీ మించి భర్తగా వచ్చే వ్యక్తి నన్ను సంతోషంగా చూసుకోవాలి. ఇన్ని రకాలుగా ఆలోచించాలి. అందుకే మరో ఐదేళ్ల తరువాత పెళ్లి గురించి ఆలోచిస్తాను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement