కామెడీ కుటుంబానికి ఏమిటీ శాపం!

కామెడీ కుటుంబానికి ఏమిటీ శాపం!


హైదరాబాద్ : వెండితెర కమెడియన్లందరూ ఇటీవలే ఒక్కొక్కరే భౌతికంగా కనుమరుగవుతున్నారు. ఇదంతా చూస్తుంటే, తెలుగు హాస్యకుటుంబానికి శాపం తగిలిందా అనిపిస్తోందని సినీ వర్గాలు వాపోతున్నాయి. గడచిన ఏణ్ణర్ధం పైచిలుకు కాలంలో ప్రముఖ కమెడియన్ ఏ.వి.ఎస్. మొదలు ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఆహుతి ప్రసాద్ క్యాన్సర్ వ్యాధితో మరణించారు.


ఆ తరువాత ఈ ఏడాది మొదట్లో ప్రముఖ హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణ ఆకస్మికంగా కన్నుమూశారు. ఈ అక్టోబర్‌లో ‘కళ్ళు’ చిదంబరం, ఆ వెంటనే మాడా వెంకటేశ్వరరావులు మరణించారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఆ దుఃఖం నుంచి తేరుకోక ముందే ఇప్పుడు కొండవలస కన్నుమూశారు. దీంతో, తెలుగు సినీ హాస్య కుటుంబానికి ఏదో తీరని శాపం తగిలినట్లుందని సినీ ప్రముఖులు ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు.



 మా ‘కళ్ళు’ కొండవలస తొలి సినిమా!

కొండవలస లక్ష్మణరావు సినీ రంగప్రవేశం వంశీ దర్శకత్వంలోని ‘ఔను... వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’ (2002)తో జరిగిందని అందరూ అనుకుంటూ ఉంటారు. అంతటా అదే ప్రచారమూ అయింది. అయితే, ఆ సినిమా రావడానికి 14 ఏళ్ళ ముందే ఆయన తొలిసారిగా కెమేరా ముందుకొచ్చారన్న విషయం చాలామందికి తెలియదు. కొండవలస తెరంగేట్రం చేసిన ఆ సినిమాఏమిటంటే - ‘కళ్ళు’ (1988). గొల్లపూడి మారుతీరావు నాటకం ‘కళ్ళు’ ఆధారంగా ఆ సినిమా రూపొందింది. దర్శకుడిగా మారిన ప్రముఖ ఛాయాగ్రాహకుడు ఎం.వి. రఘు ఆ సినిమా కోసం ప్రధానంగా రంగస్థల కళాకారుల్ని పాత్రధారులుగా ఎంచుకున్నారు. ఎక్కువగా విశాఖ పరిసరాల్లోని వాళ్ళకు అవకాశమిచ్చారు. ‘కళ్ళు’ చిదంబరం కూడా ఆ సినిమాతో వెండితెరపై ప్రసిద్ధమైన రంగస్థల కళాకారుడే. అదే ‘కళ్ళు’ సినిమాలో ఒక రౌడీ వేషం ద్వారా కొండవలస లక్ష్మణరావు వెండితెర మీదకొచ్చారు.



‘‘ ‘కళ్ళు’ చిత్రానికి నటీనటులను సెలక్ట్ చేయడానికి నేను, అప్పట్లో కోడెరైక్టరైన ఇ.వి.వి. సత్యనారాయణ (తరువాతి కాలంలో ప్రసిద్ధ దర్శకుడయ్యారు) విశాఖ పరిసరాల్లో రంగస్థల కళాకారుల్ని చూశాం. కొండవలస ప్రతిభ గమనించి, మా సినిమాలో ఒక రౌడీ వేషం ఇచ్చాం. అదే ఆయనకు తొలి సినిమా ఛాన్స్. ఆ తరువాత చాన్నాళ్ళకు వంశీ దర్శకత్వంలోని ‘ఔను... వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’తో లేటు వయసులో ఆయన కెరీర్‌కు పెద్ద బ్రేక్ వచ్చింది. ఇప్పుడు కొండవలస ఆకస్మిక మృతితో ప్రతిభావంతుడైన కమెడియన్‌ను కోల్పాయాం’’ అని ప్రముఖ కెమేరామన్ - ‘కళ్ళు’ చిత్ర దర్శకుడు ఎం.వి. రఘు ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. మొత్తానికి, ‘కళ్ళు’తో ప్రారంభించి, ‘ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’తో కెరీర్ మలుపు తిరిగిన కొండవలస మృతి తీరనిలోటే!




 - రెంటాల జయదేవ

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top