అందుకే చిన్న పాత్ర అయినా చేశా!

kajal aggarwal interview about ranarangam - Sakshi

‘‘ఏ సినిమాకైనా చాలా కష్టపడి పనిచేస్తా. నా పాత్రకి 100శాతం న్యాయం చేస్తా. కానీ, ఫలితం అనేది మన చేతుల్లో ఉండదు. అది ప్రేక్షకులు నిర్ణయించాలి. ఇటీవల వచ్చిన ‘సీత’ సినిమా సరిగ్గా ఆడలేదంటే ఎన్నో కారణాలుండొచ్చు. అయితే ఆ సినిమా చేసినందుకు చాలా గర్వపడుతున్నా.. ఎటువంటి అసంతృప్తి లేదు’’ అన్నారు కాజల్‌ అగర్వాల్‌. శర్వానంద్‌ హీరోగా, కాజల్‌ అగర్వాల్, కళ్యాణీ ప్రియదర్శన్‌ హీరోయిన్లుగా సుధీర్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రణరంగం’. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా కాజల్‌ అగర్వాల్‌ చెప్పిన విశేషాలు.

► ‘రణరంగం’ సినిమాలో డాక్టర్‌గా చేశా. ఈ చిత్రంలో నాది పెద్ద పాత్ర కాదు కానీ, చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కథ గ్రిప్పింగ్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. కథని ముందుకు తీసుకెళ్లే పాత్ర నాది.. అందుకే చిన్నదైనా చేశా. ‘సీత’ సినిమాకి మెంటల్‌గా, ఫిజికల్‌గా బాగా కష్టపడ్డా. ‘రణరంగం’ చాలా ఉపశమనం ఇచ్చింది. శర్వానంద్‌ మంచి సహనటుడు. సుధీర్‌ వర్మ చక్కని ప్రతిభ ఉన్న దర్శకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ వంటి మంచి బ్యానర్‌లో ‘రణరంగం’ సినిమా చేసినందుకు హ్యాపీగా ఉంది.

► సాయంత్రం 6 గంటలకు షూటింగ్‌కి ప్యాకప్‌ చెప్పాక షూటింగ్స్, సినిమా విషయాల గురించి మాట్లాడను. పుస్తకాలు చదువుతాను.. యోగా, వ్యాయామాలు చేస్తా. ‘అ’ తర్వాత ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో నేను నటించనున్న సినిమాని నేను నిర్మించడం లేదు. నవంబర్‌లో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. ఈ చిత్రంలో నా పాత్ర చాలెంజింగ్‌గా ఉంటుంది.

► హిందీ ‘క్వీన్‌’ సినిమాని దక్షిణాదిలో రీమేక్‌ చేశారు. తెలుగు, కన్నడ, మలయాళంలో ఎటువంటి సెన్సార్‌ కట్స్‌ లేవు. కానీ, తమిళ్‌లో మాత్రం అభ్యంతరాలు చెప్పారు. దీనిపై యూనిట్‌ సెన్సార్‌ రివైజింగ్‌ కమిటీకి వెళ్లింది.

► నేను ఇండస్రీకి వచ్చి 12ఏళ్లయింది. ఇప్పటికి తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో 50కి పైగా సినిమాలు చేశా. ఈ మైలురాయిని త్వరగా చేరుకున్నాననిపిస్తోంది. హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా బబ్లీగా ఉండే పాత్రలు చేశా. కానీ, ఇప్పుడు బాధ్యతగా భావిస్తున్నా. ఆ మధ్య మేకప్‌లేని ఫొటోలు పోస్ట్‌ చేశాను. అయితే గ్లామర్‌ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మేకప్‌ అవసరమే. కానీ, వ్యక్తిగత జీవితంలో మేకప్‌ అవసరం లేదు.. మహిళలందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకొని, తాము ఎలా ఉన్నా కాన్ఫిడెంట్‌గా ఉండాలి.

► చిరంజీవి సార్‌తో కొరటాల శివ దర్శకత్వం వహించనున్న చిత్రం కోసం నన్నెవరూ సంప్రదించలేదు. మళ్లీ చాన్స్‌  వస్తే హ్యాపీగా చేస్తా. తేజగారి దర్శకత్వంలో 3 సినిమాలు చేశా. మళ్లీ అవకాశమొచ్చినా నటిస్తా. ‘భారతీయుడు 2’లో నాది పవర్‌ఫుల్‌ పాత్ర.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top