ఆ సినిమాతో రూ.60 కోట్లు నష్టం! | Sakshi
Sakshi News home page

ఆ సినిమాతో రూ.60 కోట్లు నష్టం!

Published Thu, Mar 30 2017 8:15 PM

ఆ సినిమాతో రూ.60 కోట్లు నష్టం!

తమిళసినిమా: విశ్వరూపం చిత్రం వ్యవహారంలో రూ. 60 కోట్లు నష్టం వచ్చిందని, అందుకు జయలలిత ప్రభుత్వం కారణం అని నటుడు కమలహాసన్‌ ఆరోపించారు. కమలహాసన్‌ నటించి, స్వీయదర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా 2013లో విడుదలకు ముందు పలు అవరోధాలను ఎదుర్కొంది.

కొన్ని సమస్యలను కోర్టు ద్వారా పరిష్కరించుకున్నా, చిత్రంలో ముస్లిం మనోభావాలను కించపరచే విధంగా ఉందంటూ అప్పటి ప్రభుత్వం చిత్రం విడుదలపై నిషేధం విధించింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సినిమా వర్గాలు తీవ్రంగా ఖండించాయి. కమల్‌ అభిమానులు ఆందోళనలు చేయడంతో ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చి విశ్వరూపం చిత్రంపై నిషేధాన్ని ఎత్తివేసింది. అప్పట్లోనే తాను దేశం విడిచి వెళ్లిపోతానని కమల్‌ ఆవేదన వ్యక్తం చేసి కంటతడి పెట్టిన విషయం తెలిసిందే.

కాగా ఇన్నాళ్లకు మళ్లీ ఆయన విశ్వరూపం సినిమా విడుదల సమయంలో జరిగిన పరిణామాలను గుర్తుచేస్తూ.. అప్పట్లో తనను అణదొక్కారని పేర్కొన్నారు. విశ్వరూపం చిత్రానికి ఎదురైన సమస్యలను కోర్టు ద్వారా పోరాడి నెగ్గానన్నారు. అయితే ప్రజలు ఆగ్రహించడంతో ప్రభుత్వం చిత్రంపై నిషేధం తొలగించిందన్నారు. అప్పటి ప్రభుత్వం కుట్ర వల్ల దాదాపు రూ. 60 కోట్లు నష్టపోయాననీ వెల్లడించారు. ఇప్పుడు విశ్వరూపం– 2కి అలాంటి సమస్యలు రావని అనుకుంటున్నానని కమలహాసన్‌ పేర్కొన్నారు. చాలా కాలం విడుదలకు వేచి ఉన్న విశ్వరూపం– 2 చిత్రానికి త్వరలో మోక్షం లభించనున్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement