ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ చేసేశారు! | Sakshi
Sakshi News home page

ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ చేసేశారు!

Published Tue, Dec 15 2015 11:05 PM

ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ చేసేశారు! - Sakshi

 ముకుంద, కంచె... జస్ట్ రెండే చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోగలిగారు వరుణ్ తేజ్. ‘లోఫర్’తో స్టార్ హీరో అయిపోతాడని దర్శకుడు పూరి జగన్నాథ్ అన్నారు. ఇప్పుడు వరుణ్ డౌన్ టు ఎర్త్. మరి, స్టార్ అయ్యాక?... ‘‘వంద శాతం ఇలానే ఉంటాను. నాకు తెలిసి ఎవరూ కావాలని అలా మారిపోరు. ఒక లైమ్‌లైట్‌కొచ్చాక చుట్టూ కొంతమంది చేరతారు. వాళ్ల ప్రభావం వల్ల మారిపోతారు. ఆ ప్రభావం పడకుండా చూసుకోవాలి. ఈ ఏడాది కాలంలో నా చుట్టూ చేరినవాళ్లల్లో మంచివాళ్లూ, చెడ్డవాళ్లూ ఉన్నారు. ఎవరెలాంటివాళ్లో తెలుసుకుని జాగ్రత్తపడతా’’ అని వరుణ్ తేజ్ అన్నారు. మరిన్ని విశేషాలు వరుణ్‌తో ‘సాక్షి’ జరిపిన
 ప్రత్యేక ఇంటర్వ్యూలో...    

 
 పెదనాన్నగారి సినిమాల్లో ‘ఛాలెంజ్’ అంటే ఇష్టం. ఎవరైనా రీమేక్ చేస్తే అందులో నటించాలని ఉంది. సలహాలు అడిగితే పెదనాన్న ఇస్తారు. మన జర్నీ మనమే సాగించాలన్నది ఆయన ఫిలాసఫీ. అదే ఫాలో అవుతా.
 
  పూరి జగన్నాథ్ ‘లోఫర్’ టైటిల్ చెప్పగానే భయం అనిపించిందా?

 కథ చెప్పేటప్పుడు టైటిల్ చెప్పలేదు. కథ నచ్చడంతో నేను టైటిల్ అడగలేదు. తర్వాత ‘లోఫర్’ అని తెలిసి, భయపడ్డా. ‘ఇడియట్’ టైటిల్ విషయంలో చాలామంది డౌట్ వ్యక్తం చేసి, ఆ తర్వాత అదే బాగుందన్నారని పూరీ అన్నారు. చేయడం మొదలుపెట్టాక ఈ టైటిలే యాప్ట్ అనిపించింది.
 
  రెండు సినిమాలతోనే యూత్, ఫ్యామిలీస్‌కి దగ్గరయ్యారు...

 మాస్ మూవీస్ వచ్చినప్పటికీ, సాఫ్ట్ లాంచ్ బాగుంటుందని ‘ముకుంద’ చేశా. చరణ్ (రామ్‌చరణ్) అన్నయ్య నాతో, ‘నాకు ‘మగధీర’ పెద్ద ఇమేజ్ తెచ్చిపెట్టింది. అది మెయిన్‌టైన్ చేయడానికి కష్టపడాల్సి వచ్చింది. నువ్వు హ్యాపీగా చిన్న చిన్నవి చేసుకుంటూ వెళితే బాగుంటుంది. బాబాయ్ అలానే చేశాడు’ అన్నాడు. నాకూ అదే మైండ్‌లో ఉంది. ‘ముకుంద’కి కొంతమంది ఫ్యాన్స్ నిరుత్సాహపడ్డారు. ఫుల్ మాస్‌గా ఉంటే బాగుంటుందనుకున్నారు. ‘లోఫర్’ ఫ్యాన్స్‌ని శాటిస్‌ఫై చేస్తుంది. ఫ్యామిలీస్‌కీ నచ్చుతుంది.
 
  అసలు ‘లోఫర్’ ఎలా మొదలైంది?
 ‘ముకుంద’ సినిమా చేస్తున్నప్పుడే సి. కల్యాణ్ మనం కలిసి సినిమా చేద్దామన్నారు. దర్శకుడెవరో చెప్పలేదు. ఆ తర్వాత పూరీ గారితో చేయబోతున్న విషయం చెప్పారు. పూరీ గారు తీసిన సినిమాల్లో నాకు ‘బద్రి’, ‘పోకిరి’ ఇష్టం. ఆయనతో సినిమా చేసినందుకు హ్యాపీగా ఉంది.
 
  ఈ సినిమాలో మిమ్మల్ని బాగా కష్టపెట్టిన విషయం?
 ‘సువ్వి సువ్వాలమ్మా...’ పాట ఎమోషనల్‌గా ఉంటుంది. ఉదయం ఫైట్ సీన్ తీసి, మధ్యాహ్నం ఆ పాటను షూట్‌చేయాలనుకున్నారు. ఫైట్ సీన్ బాగా చేశా కానీ, ఆ పాట మొదలుపెట్టగానే ఎమోషనల్ అయ్యి, చేయలేకపోయాను. ఆ రోజుకి షూటింగ్ క్యాన్సిల్ చేసి, మర్నాడు తీద్దాం అన్నారు. ఏడుస్తూ పాడే పాట అది. నేనెలా చేశానో నాకు తెలియదు కానీ, పూరీగారు మాత్రం చాలా బాగా చేశావని అభినందించారు.

  సూపర్ స్టార్ కావాలనుకుంటే పూరీ చేతిలో పడాల్సిందేనని ప్రభాస్ అన్నారు. సో.. సూపర్ స్టార్ అయినట్లేనా?
 నాకు స్టార్ అనిపించుకోవడంకన్నా ‘మంచి నటుడు’ అనిపించుకోవడం ఇష్టం. అందుకే ఒక దానికొకటి పోలిక లేని సినిమాలు చేస్తున్నాను.
 
  హైట్ మీకు ప్లస్. కానీ, ఇంత హైట్ ఉన్నవాళ్లకు డ్యాన్స్ కష్టం కదా?
 అది నిజమే. మోకాళ్లు వంచి చేసేటప్పుడు కష్టంగానే ఉంటుంది. ఒకసారి ప్రభాస్ ఏమన్నాడంటే... ‘డ్యాన్స్ అంత ఇరగదీసేం చేయక్కర్లేదు. మన బాడీకి ఏది మ్యాచ్ అవుతుందో అది అందంగా చేయాలి’ అన్నాడు. ‘నీకు ఏది వస్తే అది వంద శాతం చెయ్యాలి. రానిది బలవంతంగా చేయకూడదు’ అని సునీల్ ఓసారి అన్నాడు. సో.. మనకు ఏది వస్తే అదే చేయాలని తెలుసుకున్నాను. నాకు ఫైట్స్ చాలా ఇంట్రస్ట్. ఎక్కువ ఫోకస్ వాటి మీద పెడతా. డ్యాన్స్ చేయనని అంటే అది యారోగెంట్‌గా ఉంటుంది. ఎంతో కొంత చేయాల్సిందే. డెఫినెట్‌గా డ్యాన్స్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటాను.
 
  ముకుంద, కంచె, ఇప్పుడు లోఫర్.. ఒకదానికొకటి పోలిక లేని సినిమాలు సెలక్ట్ చేస్తున్నారు. తెలివైన ఈ డెసిషన్ మీదా? నాన్నగారిదా?
 (నవ్వుతూ) తెలివిగల అబ్బాయిని అనే కన్నా లక్కీ గై అని నా ఫీలింగ్. ఈ కథలు రావడం నా అదృష్టం. నాకు వచ్చినవాటిలో నేను ఇవే బాగుంటాయని నమ్మి, ఎంపిక చేసుకున్నాను. ప్రేక్షకాదరణ పొందడంతో హ్యాపీ.
 
  నటుడిగా ఎందులో బెటర్ అవ్వాలనుకుంటున్నారు?
 నాకు కామెడీ ఇష్టం. మా పెదనాన్న (చిరంజీవి) బాగా చేస్తారు. ఇప్పుడున్నవాళ్లల్లో కామెడీ సీన్స్‌ని ఆయనంత బాగా చేసే హీరోలు లేరని నా ఫీలింగ్. ‘నీకు మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉంది’ అని  ఫ్రెండ్స్ అంటుంటారు. కామెడీకి స్కోపున్న కథ దొరికితే చేయాలనుంది.
 
  ‘లోఫర్’లో అమ్మ పాటలో నటించినప్పుడు నిజంగానే ఏడ్చేశానన్నారు. మమ్మీ సెంటిమెంట్ ఎక్కువేమో?
 నా గైడింగ్ ఫోర్స్ మా నాన్నగారే. ఇంటికొచ్చిన తర్వాత నా విషయాలనీ మా అమ్మ పట్టించుకుంటుంది. ‘పద్మజ కన్నా బెటర్ మదర్ ఉండదు’ అని నాన్నగారు అంటుంటారు. ఇప్పుడు చెల్లెలు వైజాగ్‌లో షూటింగ్ చేస్తోంది. అమ్మ తనతో ఉంది. అమ్మ ఇంట్లో లేదంటే నాకు ఇంటికి కూడా వెళ్లబుద్ధి కాదు. అమ్మ ఇంట్లో ఉన్నా 24 గంటలూ తనతో ఉండను. షూటింగ్స్‌కి బయటికొస్తుంటాను. అమ్మ ఇంట్లో ఉంటే... నేనెక్కడ ఉన్నా నా పక్కనే ఉన్నట్లనిపిస్తుంది.
 
  మీ చెల్లెలు నీహారిక సినిమాలు చేయడం మీకిష్టమేనా?
 నా ఇష్టాయిష్టాలతో చెల్లెలి కెరీర్‌ని ముడిపెట్టలేను. మా చెల్లెలు ఏదో చేద్దామని తేలికగా తీసుకుని, సినిమాల్లోకి రాలేదు. అలా వచ్చి ఉంటే మేం ఒప్పుకునేవాళ్లం కాదు. మంచి సినిమాలు చేయాలనే పట్టుదలతో ఉంది. నీహారిక చేసిన షార్ట్ ఫిలిమ్స్ చూసి, షాకయ్యా. అంత బాగా చేసింది.

  ‘లోఫర్’ ఆడియో వేడుకలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అరవడంపై పూరి ‘అలా అరిచి ఉండాల్సింది కాద’న్నారు. మీ ఇద్దరూ ఫేస్‌బుక్‌లో పెట్టిన సెల్ఫీకి కొంతమంది లైక్స్.... కొంతమంది నెగటివ్ కామెంట్స్ చేశారు!
 నేను ఫేస్‌బుక్ ఎకౌంట్ డియాక్టివేట్ చేశా. నాకు తెలీదు. మీరు చెబుతుంటేనే తెలిసింది. కామెంట్ చేసే రైట్ వాళ్లకుంటుంది. బాబాయ్ బయట ఎక్కడా కనిపించరు కాబట్టి, ఫ్యాన్స్ అలా అరుస్తుంటారు. ఆడియో వేడుకలో ఎమోషనల్ అయ్యి అరిచారు. ప్రభాస్ పెద్దగా పట్టించుకోలేదు.
 
  ‘లోఫర్’ ఓపెనింగ్స్‌పై ఇదేమైనా ప్రభావం చూపిస్తుందా?
 ఏ ప్రేక్షకులైనా ముందు సినిమా లవర్స్. సినిమాలు చూడటం మొదలుపెట్టాక ఎవరికి నచ్చిన హీరోకి వాళ్లు అభిమానులవుతారు. ఎవరి ఫ్యాన్ అయినా వేరే హీరోల సినిమాలు చూస్తారు. ఎవరికైనా సినిమా ముఖ్యం. చూడకుండా ఉండరు. కథ బాగుంటే ఏ సినిమా అయినా హిట్ అవుతుంది.  
 
  ‘ఆరెంజ్’ ఫ్లాప్ సమయంలో మీ నాన్నగారు చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు కదా! అవన్నీ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది?
 ‘ఆరెంజ్’కు ముందు నాన్నగారు వేరు. ‘ఆరెంజ్’ తర్వాత నాన్నగారి యాటిట్యూడ్‌లో చాలా మార్పు వచ్చింది. పదిహేనేళ్ల ముందు ఎంత హ్యాపీగా ఉన్నారో, అంతకు మించిన యాక్టివ్‌గా, హ్యాపీగా ఉన్నారు.  నాన్నగారిలో నాకు నచ్చిన లక్షణం అది. ఇప్పుడు నేను హీరోగా సక్సెస్ కావడంతో ఇంకా ఆనందంగా ఉన్నారు.
                                                            - డి.జి. భవాని
 

Advertisement
Advertisement