హిట్‌ హిట్‌ హుర్రే

hero heroin introduced to industry in telugu new year - Sakshi

సాధారణంగా బిజినెస్‌ ఇయర్‌ మార్చి టు మార్చి జరుగుతుంది. ఆ ఏడాది జరిగిన లావాదేవీలన్నీ లెక్కలేస్తుంటారు. బిజినెస్‌ ఇయర్‌ను మేం కొంచెం మార్చాం. ఉగాది టు ఉగాది చేశాం. గత ఏడాది ఉగాది నుంచి ఈ ఉగాది వరకూ ఇండస్ట్రీకు ఎంట్రీ ఇచ్చిన కొత్త టాలెంట్‌ గురించి డిస్కస్‌ చేయబోతున్నాం. ఉగాది పచ్చడిలానే సినీపరిశ్రమలో ఫలితాలు కూడా షడ్రుచుల్లా ఉంటాయి. చేదు, పులుపు, తీపి, కారంలా హిట్టు, ఫ్లాప్, యావరేజ్, డిజాస్టర్‌లు ఉంటాయి. తొలి ప్రయత్నంలోనే తీపి రుచి చూసిన హీరో, హీరోయిన్లు, దర్శకులు గురించి చర్చించుకుందాం. వాళ్లపై స్పెషల్‌ స్టోరీ.

లక్కీయారా
తొలి పరిచయంలోనే స్టేట్‌ సీయంను ప్రేమలో పడేసిన హీరోయిన్‌ కియారా అద్వానీ. అదేనండీ.. ‘భరత్‌ అనే నేను’లో సీయం భరత్‌ని ప్రేమలో పడేశారు కదా. మహేశ్‌బాబు నటించిన పొలిటికల్‌ థ్రిల్లర్‌ ‘భరత్‌ అనే నేను’తో ఇండస్ట్రీకు పరిచయం అయ్యారు బాలీవుడ్‌ బ్యూటీ కియారా. ‘భరత్‌ అనే నేను’ రిలీజ్‌ కాకముందే  ‘వినయ విధేయ రామ’ సినిమాలో రామ్‌చరణ్‌తో జోడీ కట్టే ఛాన్స్‌ కొట్టేశారు. కెరీర్‌ స్టార్టింగ్‌లోనే ఇద్దరు టాప్‌ హీరోలతో నటించే ఛాన్స్‌ కొట్టేసి లక్కీయారా అనిపించుకున్నారు. ‘భరత్‌..’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచినా, ‘వినయ..’ సినిమా అంచనాలను అందుకోలేదు. అయినా నో ప్రాబ్లమ్‌. కియారాకి అవకాశాలు కొదవ లేదు. అఖిల్‌ కొత్త చిత్రంలో కియారా నటించే అవకాశముందని తెలిసింది.

మజిలీ ఎటువైపు
హీరో రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకుడిగా మారి తెరకెక్కించిన ‘చి.ల.సౌ’తో పరిచయమయ్యారు రుహానీ శర్మ. సినిమా ఆకట్టుకుంది. రుహానీ నటన కూడా బాగుందనే అన్నారు. కానీ కొత్త సినిమాలేవీ సైన్‌ చేయలేదు. రుహానీలా హిట్‌ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చినా కూడా నెక్ట్స్‌ సినిమాను ఇంకా సైన్‌ చేయని హీరోయిన్లలో శోభితా ధూళిపాళ, ప్రియాంకా జవాల్కర్‌ ఉన్నారు. ‘గుఢచారి’ ద్వారా శోభిత, ‘టాక్సీవాలా’ ద్వారా ప్రియాంకా ఆడియన్స్‌ను ఇంప్రెస్‌ చేశారు. నెక్ట్స్‌ ఏ సినిమా చేస్తున్నారు? అంటే.. ఇంకా ప్రకటించలేదు ఈ తెలుగమ్మాయిలు. ఇక నాగచైతన్య, సమంత చేసిన  ‘మజిలీ’ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయ్యారు దివ్యాన్షాకౌశిక్‌. ఆమె నటనను మెచ్చుకున్నారు ప్రేక్షకులు. మరి.. ఈ సినిమా తర్వాత దివ్యాన్ష మజిలీ ఎటువైపో చూడాలి.

సమ్మోహిని
అదితీరావ్‌ హైదరీకి బాలీవుడ్‌లో తొమ్మిదేళ్ల కెరీర్‌ ఉంది. మణిరత్నం ‘చెలియా’ ద్వారా తెలుగు ప్రేక్షకులను ఫస్ట్‌ టైమ్‌ పలకరించారు అదితీ. మోహనకృష్ణ తెరకెక్కించిన ‘సమ్మోహనం’ ద్వారా తెలుగుకి  స్ట్రయిట్‌ ఎంట్రీ ఇచ్చారు. గ్లామర్, యాక్టింగ్‌ స్కిల్స్‌తో సమ్మోహనపరచడమే కాకుండా తన పాత్రకు సొంతంగా డబ్బింగ్‌ కూడా చెప్పుకొని మెప్పించారు. ఆ వెంటనే వరుణ్‌ తేజ్‌తో కలసి ‘అంతరిక్షం’లో ప్రయాణం చేశారు. ‘అంతరిక్ష’ ప్రయాణం అంత సులువుగా సాగలేదు. తాజాగా మరోసారి ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమాలో హీరోయిన్‌గా కనిపించనున్నారని తెలిసింది. సుధీర్‌బాబు, నానిలతో మోహనకృష్ణ ఓ మల్టీస్టారర్‌ చిత్రం తెరకెక్కిస్తున్నారు. అందులో నాని సరసన హీరోయిన్‌గా కనిపిస్తారట అదితీ.

ఒక్క హిట్‌

నిధీ అగర్వాల్‌ది స్పెషల్‌ కేస్‌. వరుస సినిమాలను సంతకం చేస్తున్నారు కానీ ఫస్ట్‌ హిట్‌ను ఇంకా టేస్ట్‌ చేయలేదీ ఈ బెంగళూర్‌ భామ. నాగచైతన్య ‘సవ్యసాచి’తో పరిచయమైన నిధీ, ఆ తర్వాత అఖిల్‌తో ‘మిస్టర్‌ మజ్ను’లో నటించారు. లేటెస్ట్‌గా రామ్‌ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’లో ఓ హీరోయిన్‌గా కనిపిస్తున్నారు. మరి.. అవకాశాలు అందుకుంటున్నట్లుగానే హిట్‌ ఎప్పుడు అందుకుంటారో చూడాలి. అది ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తోనే దక్కుతుందనే ఊహలున్నాయి.

భల్లే భల్లే పాయల్‌
గత ఏడాది ఇండస్ట్రీకు ఎంట్రీ ఇచ్చిన వాళ్లలో టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయిన వారిలో పాయల్‌ రాజ్‌పుత్‌ ఒకరు. ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాలో ఈ పంజాబీ భామ చేసిన బోల్డ్‌ రోలే అందుకు కారణం. ప్రస్తుతం వరుస సినిమాలు సైన్‌ చేసే పనిలో పడ్డారు పాయల్‌. ‘వెంకీ మామా’లో వెంకటేశ్‌ సరసన, ‘డిస్కో రాజా’లో రవితేజ సరసన, ‘మన్మథుడు 2’లో యాక్ట్‌ చేస్తున్నారు పాయల్‌. తమిళంలో ఆమె చేసిన ‘ఏంజెల్‌’ చిత్రం రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఇటీవల తెలుగులో ‘ఆర్‌డీఎక్స్‌’ అనే ఓ కొత్త చిత్రం కూడా స్టార్ట్‌ చేశారు. హాట్‌ ఎంట్రీతో ప్రస్తుతం హాట్‌ ఫేవరేట్‌ హీరోయిన్‌ అయిపోయారు పాయల్‌.

కొత్త ఐడియాలు క్లిక్‌
2018 తెలుగు సినిమా విభిన్న కథలను చూసింది. సరికొత్త ఐడియాలతో కొత్త దర్శకులు ముందుకొచ్చారు. ‘ఆర్‌ఎక్స్‌100’ లాంటి బోల్డ్‌ అటెంప్ట్‌తో అజయ్‌ భూపతి ఎంట్రీ ఇచ్చారు. బాక్సాఫీస్‌ దగ్గర కలెక్షన్లు అద్భుతంగా వచ్చాయి. ప్రస్తుతం ‘మహాసముద్రం’ అనే మల్టీస్టారర్‌ చిత్రం ప్లాన్‌ చేస్తున్నారు అజయ్‌. తక్కువ బడ్జెట్‌లోనూ బాండ్‌ తరహా చిత్రాలు తెరకెక్కించవచ్చని ‘గూఢచారి’ సినిమా ద్వారా శశికిరణ్‌ తిక్క నిరూపించారు. మహేశ్‌బాబు నిర్మాణంలో ‘మేజర్‌’ చిత్రాన్ని తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నారు శశికిరణ్‌. ‘చి. ల. సౌ’ సినిమా ద్వారా దర్శకుడిగా మారారు హీరో రాహుల్‌ రవీంద్రన్‌.

మంచి పేరు వచ్చింది. సెకండ్‌ సినిమాకే నాగార్జునను డైరెక్ట్‌ చేసే చాన్స్‌ లభించింది. నాగ్‌ సూపర్‌ హిట్‌ ‘మన్మథుడు’ సీక్వెల్‌ ‘మన్మథుడు 2’ షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్నారు రాహుల్‌. ‘నీదీ నాదీ ఒకే కథ’ అంటూ మిడిల్‌ క్లాస్‌ కథను చూపించిన వేణు ఉడుగుల ఈసారి పీరియడ్‌ ఫిల్మ్‌ చేసే ప్లాన్‌లో ఉన్నట్టు కనిపిస్తున్నారు. రానా, సాయి పల్లవి జంటగా నక్సలైట్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఓ కథను తయారు చేశారట. ‘కేరాఫ్‌ కంచెరపాలెం’తో హిట్‌ సాధించిన దర్శకుడు వెంకటేశ్‌ మహా, ‘నన్ను దోచుకుందువటే’ ఆర్‌ఎస్‌ నాయుడు, ‘టాక్సీవాలా’ రాహుల్‌ సంక్రిత్యాన్‌ తమ నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ వివరాలింకా చెప్పలేదు.

విజయ కార్తికేయం
గత ఏడాది ఎంట్రీ ఇచ్చిన హీరోల్లో కార్తికేయ బాగా మెరిశారు. ‘ఆర్‌ఎక్స్‌ 100’ బండిలానే దూసుకెళ్లారు. సినిమా సూపర్‌ సక్సెస్‌ అయింది. ఆ వెంటనే తమిళ బడా చిత్రాల నిర్మాత కలైఫులి యస్‌ థాను నిర్మాణంలో ‘హిప్పీ’ సినిమా చేస్తున్నారు. నూతన దర్శకుడు అర్జున్‌ జంధ్యాల దర్శకత్వంలో ఓ యాక్షన్‌ చిత్రంలో నటిస్తున్నారు. హీరోగా ఎంట్రీ ఇచ్చి, సంవత్సరం తిరక్కముందే విలన్‌ వేషాలకు కూడా రెడీ అయ్యారు. నాని– విక్రమ్‌ కె కుమార్‌ ‘గ్యాంగ్‌లీడర్‌’ సినిమాలో కార్తికేయ విలన్‌గా నటిస్తున్నారు.

శభాష్‌ నటేశ్‌
నిర్మాతగా హీరో సుధీర్‌బాబు తొలి ప్రయత్నం ‘నన్ను దోచుకుందువటే’. ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యారు కన్నడ నటి నభా నటేశ్‌. సినిమా సక్సెస్‌లో తన పాత్ర ఎంతో ఉందనే ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు నటనకు కూడా శభాష్‌ అనిపించుకున్నారు. ఆ హిట్‌తో వరుస సినిమాలతో బిజీ అయ్యారు నభా. రవితేజ ‘డిస్కో రాజా’లో ఓ హీరోయిన్‌గా, పూరి జగన్నాథ్‌–రామ్‌ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఇస్మార్ట్‌ శంకర్‌’లో ఓ హీరోయిన్‌గా చేస్తూ బిజీగా ఉన్నారు.

– గౌతమ్‌ మల్లాది

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top