ఆ సమయంలో కోపం నషాళానికి అంటింది 'గుండు హనుమంతరావు'

ఆ సమయంలో కోపం నషాళానికి అంటింది 'గుండు హనుమంతరావు'

చూడగానే నవ్వు తెప్పించే పర్సనాలిటీ. టైమింగ్‌తో నవ్వించే సంభాషణా చాతుర్యం. అద్భుతమైన హాస్యరసపోషణ... వెరసి గుండు హనుమంతరావు. దాదాపు మూడు దశాబ్దాలుగా ప్రేక్షకులకు ఆనందాన్ని పంచుతున్న గుండు హనుమంతరావు ‘వచ్చిన పాత్రను చేసుకుపోవడమే తప్ప  స్థాయిని గురించి ఆలోచించడం నాకు తెలీదు’ అని నిర్మొహమాటంగా చెబుతున్నారు. గుండుతో జరిపిన భేటీ...

 

 ***  ప్రస్తుతం కెరీర్ ఎలా ఉంది?

 ఇక్కడ చేసుకున్న వారికి చేసుకున్నంత. ప్రస్తుతానికి బిజీగానే ఉన్నాను. ఈ ఏడాది చిన్న హీరోల సినిమాలు ఓ పన్నెండు వరకూ చేసి ఉంటాను. అలాగే టీవీ సీరియల్స్ కూడా చేస్తున్నాను. 

 

 ***  గాడ్‌ఫాదర్ లేనివాడు పరిశ్రమలో ఎదగలేడంటారు నిజమేనా? మీకెవరైనా గాడ్‌ఫాదర్ ఉన్నారా?

 ప్రత్యేకంగా గాడ్‌ఫాదర్ అంటే.. లేడనే చెప్పాలి. అయితే... నన్ను ప్రోత్సహించిన జంధ్యాల, ఎస్వీ కృష్ణారెడ్డి, సాగర్ ఇత్యాది దర్శకులందరూ నాకు గాడ్‌ఫాదర్సే. రామానాయుడుగారు నన్నెంతో ప్రోత్సహించారు. 

 

 ***  కెరీర్‌లో మరిచిపోలేని పాత్రలు...?

 అహ నా పెళ్లంట, రాజేంద్రుడు-గజేంద్రుడు, మాయలోడు, పేకాట పాపారావు, జల్సా... ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే అవుతుంది. 

 

 ***  ‘జల్సా’లో ఒకేచోటే కనిపించి... ఇప్పటికీ గుర్తుండిపోయారు. గ్రేట్ కదా?

 ఆ ఘనత త్రివిక్రమ్‌ది. తాను రాసిన డైలాగులు, కదలకుండా నవ్వించే నా కేరక్టరైజేషన్.. అందరికీ తెగ నచ్చేసింది. 

 

 ***  కామెడీలో కూడా ఇన్ని వేరియేషన్లు ఎలా చూపించగలుగుతున్నారు?

 ఆ ఘనతంతా నాదే అని నేను అనను. ఆ పాత్రల్ని తయారు చేసిన రచయితల ఘనత అది. వాటిని తీర్చిదిద్దిన దర్శకుల ఘనత అది. తర్వాతే నేను. నటుడికి అబ్జర్వేషన్ ముఖ్యం. అదే అన్నీ నేర్పుతుంది. 

 

 ***  నటునిగా మీపై ఎవరి ప్రభావం ఎక్కువ?

 సూర్యకాంతం. 

 

 ***  అదేంటి..? ఆమె నటి కదా?

 ఇక్కడ ఆడా, మగ అనేది కాదు చూడాల్సింది. ఆర్టిస్ట్ అనేవాడికి సూర్యకాంతం ఒక పాఠ్యాంశం. పాత్రలో ఆమె బిహేవ్ చేసే విధానం, నాచురాలిటీ, ఎక్స్‌ప్రెషన్స్, డెడికేషన్... ఇవన్నీ ప్రతి ఒక్కరికీ ఆదర్శాలే. 

 

 ***  ఎప్పుడూ కామెడీనేనా? ఇంకేదైనా ట్రై చేయొచ్చుకదా?

 చేయాలని నాకూ ఉంటుంది. రావాలి కదా. ఈ పాత్ర హనుమంతరావుతో చేయిస్తే బావుంటుందని దర్శక, నిర్మాతలు ఫీలవ్వాలి. 

 

 ***  ‘ఈ పాత్ర నాకు వస్తే బాగుండేదే’ అనిపించిన పాత్ర ఏదైనా ఉందా?

 ఇప్పుడొస్తున్న సినిమాల్లో లేవుగానీ, పాత సినిమాల్లో ఉండేవి. ‘మా ఇలవేల్పు’ అని.. కె.ఆర్.విజయగారు తొలిసారి అమ్మవారిగా చేసిన సినిమా అది. అందులో పద్మనాభంగారు పూజారి పాత్ర పోషించారు. కామెడీనే కాక, రకరకాల భావోద్వేగాలు పలికించే అవకాశం ఉన్న పాత్ర అది. అలాంటి పాత్ర చేయాలనేది నా కోరిక. 

 

 ***  అందరినీ నవ్వించే మీరు ఎప్పుడైనా బాధ పడ్డారా?

 ఎందుకు బాధ పడలేదూ... నేను చేసిన ‘అమృతం’ సీరియల్ పెద్ద హిట్. ఆ సీరియల్‌ని ఇష్టంగా ఫాలో అయ్యే ఓ కుర్రాడు... నా వయసును కూడా చూడకుండా.. నేను కనిపించగానే.... గట్టిగా వీపుపై చరిచి.. ‘భలే చేస్తున్నారండీ’ అన్నాడు. అంతే... కోపం నషాళానికి అంటింది. కమెడియన్లంటే... సిల్లీగా మాట్లాడుకునేవారికి, తేలిక భావంతో చూసేవారికి ఇక్కడ కొదవేలేదు. అలాంటి వాళ్లను చూస్తుంటే బాధ ముంచుకొస్తుంది. అలాగే... ఒకప్పుడు కామెడీ పాత్రలు కూడా చాలా బలంగా ఉండేవి. ఆ స్థాయిలో ఇప్పటి రచయితలు రాయలేకపోతున్నారనే బాధ కూడా ఉంది. 

 

 ***  ఇప్పటికి మొత్తం ఎన్ని సినిమాలు చేసుంటారు?

 ఓ నాలుగొందలు చేసుంటా. ఇప్పుడు సీరియల్స్ కూడా చేస్తున్నా. బుల్లితెర పుణ్యమా అని 3 సార్లు నందుల్ని కూడా అందుకున్నా. ఇక సినిమాల నుంచైతే... స్థానిక సంస్థల అవార్డులు కోకొల్లలొచ్చాయి. 

 

 ***  మీ ప్రతిభకు తగ్గ స్థానంలో మీరు లేరని చాలామంది అభిప్రాయం.  మీరేం అంటారు?

 దాని గురించి నేను ఆలోచించనండీ... వచ్చిన పాత్రను చేసుకుంటూ పోవడమే నాకు తెలిసింది.

 

 ***  ఇప్పుడొస్తున్న కుర్ర కమెడియన్లపై మీ అభిప్రాయం?

 మేమూ ఒకప్పుడు కుర్ర కమెడియన్లమేగా. ఆ రోజుల్లో పెద్దవాళ్లు మమ్మల్ని బాగానే ప్రోత్సహించారు. మేమూ అంతే. ఇప్పుడొస్తున్న కుర్రాళ్లందరూ చాలా బాగా చేస్తున్నారు. 

 

 ***  నటనేనా... మరో దిశగా ఆలోచించే అవకాశం ఉందా?

 నాకు నటన తప్ప మరో ప్రపంచం తెలీదు. ఓపిక ఉన్నంతవరకూ నటిస్తూనే ఉంటాను.

 
Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top