
దర్శకుడు కురాడ దుర్గా నాగేశ్వర రావు (87) బుధవారం కన్ను మూశారు. హైదరాబాద్‌లోని రామాంత పూర్ రాంశంకర్ నగర్‌లోని తన స్వగృహంలో గుండెపోటుతో మృతి చెందారాయన. దర్శకుడు దాసరి నారాయణరావు దగ్గర ‘దేవుడే దిగి వస్తాడు’, ‘ఒసేయ్ రాములమ్మ’తో పాటు మరికొన్ని చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా చేశారాయన. దర్శకుడిగా నాగేశ్వర రావు తొలి సినిమా ‘విజయ’ (1978). ఆ తర్వాత ‘బొట్టు కాటుక, సుజాత, పసుపు పారాణి’ వంటి పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారాయన.
నంది అవార్డుల కమిటీలో జ్యూరీ మెంబర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ప్రముఖ నటుడు సీయస్‌ఆర్‌కు స్వయానా మేనల్లుడు. నాగేశ్వర రావుకి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. దర్శకుడు నాగేశ్వర రావు, ఇటీవల మరణించిన ప్రముఖ దర్శకుడు ఈరంకి శర్మ, సీనియర్ కో–డైరెక్టర్ రామసూరి మృతికి బుధవారం నిర్వహించిన సంతాప సభలో తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం శ్రద్ధాంజలి ఘటించింది. కాగా, నాగేశ్వర రావు అంత్యక్రియలు నేడు జరగనున్నాయి.