డీడీ నంబర్‌ వన్‌

DD National becomes no. 1 TV channel across genres in BARC week 13 - Sakshi

కేబుల్‌ రాకముందు దూరదర్శన్‌  (డీడీ) ఛానలే అందరికీ వినోదం, విజ్ఞానం అందించింది. కేబుల్‌ టీవీ, స్మార్ట్‌ ఫోన్స్‌ వినియోగం ఎక్కువ కావడంతో దూరదర్శన్‌ కి ఇంతకు ముందు ఇచ్చిన ప్రాధాన్యత ఇవ్వడంలేదనే చెప్పాలి. అయితే ఈ ‘లాక్‌ డౌన్‌’ సమయంలో ‘డీడీ నేషనల్‌’ తన పూర్వ వైభవాన్ని చూస్తోంది. టీ. ఆర్‌. పీ రేటింగ్స్‌ లో అగ్రగామిగా నిలుస్తోంది. కారణం దూరదర్శన్‌ లో ఒకప్పుడు బాగా పాపులర్‌ అయిన సీరియల్స్, షోలను పునః ప్రసారం చేయడమే.
బ్రాడ్‌ కాస్ట్‌ ఆడియన్స్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌ (బార్క్‌) విడుదల చేసిన డేటా ఆధారంగా దేశంలో దూరదర్శన్‌ నంబర్‌ వన్‌ స్థానంలో ఉంది.  లాక్‌ డౌన్‌ కి ముందు వారాల్లో టాప్‌ 10లో లేకపోయినా ప్రస్తుతం  నంబర్‌ వన్‌ స్థానంలో కొనసాగడం విశేషం. మార్చి చివరి వారం (మార్చి 21–27) రేటింగ్‌ సంఖ్యతో  పోలిస్తే ఆ మరుసటి వారం (మార్చి 28– ఏప్రిల్‌ 3) దూరదర్శన్‌ వీక్షకుల సంఖ్య సుమారు 580 రెట్లు పెరిగినట్టు తెలిసింది. ‘‘రామాయణం, మహాభారతం, శక్తిమాన్, సర్కస్, బ్యోమకేష్‌ బక్షి వంటి పాపులర్‌ సీరియళ్లు,  ప్రోగ్రాములు  తిరిగి ప్రసారం కావడం దేశం మొత్తాన్ని శ్రద్ధగా టీవీలకు అతుక్కుపోయేలా చేసింది డీడీ. ముఖ్యంగా రామాయణం , మహాభారతం ప్రసారం అవుతున్న సమయాల్లో వీక్షకుల సంఖ్య భారీ స్థాయిలో పెరిగింది. అలాగే క్వారంటైన్‌ సమయాల్లో టీవీ వీక్షించే సమయం కూడా 43 శాతం వరకు పెరిగింది’’ అని బార్క్‌ సంస్థ తెలిపింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top