కన్నీటిపర్యంతమైన బోనీ కపూర్‌

Boney Kapoor Breaks Down While Talking About Sridevi - Sakshi

అందాల తార శ్రీదేవి మరణించి ఇప్పటికే ఏడాది దాటినప్పటికి.. ఆమె జ్ఞాపకాలు మాత్రం అభిమానులను వదలడం లేదు. ఇక ఆమె భర్త, పిల్లల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నేటికి కూడా వారు ఈ షాక్‌ నుంచి ఇంకా కోలుకోలేదు. ఈ నేపథ్యంలో ఓ టీవీ షోకు హాజరైన బోనీ కపూర్‌.. శ్రీదేవి గురించి తల్చుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఫిల్మ్‌ ట్రేడ్‌ అనాలసిస్ట్‌ కోమల్‌ నాథ్‌ వ్యాఖ్యతగా వ్యవహరించే.. ‘ఔర్‌ ఏక్‌ కహానీ’ కార్యక్రమానికి హాజరయ్యారు బోనీ. ప్రస్తుతం ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ట్రైలర్‌ తెగ వైరలవుతోంది.

కార్యక్రమంలో భాగంగా కోమల్‌ నాథ్‌ బోనీని.. ‘మీ జీవితంలో శ్రీదేవిని మర్చిపోయిన క్షణం ఏదైనా ఉందా’ అని ప్రశ్నించారు. ఈ ప్రశ్న వినగానే ఉద్వేగానికి గురైన బోనీ.. కన్నీటిని ఆపుకుంటూ.. ‘లేదు.. ఆమెని మర్చిపోవడం అసలు సాధ్యం కాద’ని సమాధానమిచ్చారు. అంతేకాక ‘మీరు చూడ్డానికి చాలా అందంగా ఉంటారు.. మరి సినిమాల్లో ఎందుకు నటించలేద’ని కోమల్‌ నాథ్‌ ప్రశ్నించగా.. ‘ఇప్పుడు కూడా నేను చాలా పొడవుగా.. అందంగానే ఉన్నానం’టూ బోనీ సమాధానమిచ్చారు. తప్పుడు ఆర్థిక నిర్ణయాల గురించి ప్రశ్నించగా.. ‘నేను రేస్‌లకు వెళ్లి, జూదం ఆడి డబ్బులు పొగొట్టలేదు. ఈ విషయం చాలా మందికి అర్థం కాదు. ఆర్థికపరంగా కొన్ని తప్పులు జరిగాయని నాకు తెలుసు. అయితే ఇలాంటి సందర్భాల్లో కుటుంబం మద్దతు.. ముఖ్యంగా భార్య పిల్లల మద్దుతు లేకపోతే చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. అదృష్టం కొద్ది ఈ విషయంలో నా కుటుంబం నాకు పూర్తి మద్దతుగా ఉంద’ని బోనీ చెప్పుకొచ్చారు.

ఈ కార్యక్రమం ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు టాటా స్కై క్లాసిక్‌ సినిమా చానెల్‌లో ప్రసారం కానుంది. శ్రీదేవి మరణంతో బోనీ కపూర్‌ పూర్తిగా కుంగిపోయాడని చెప్పవచ్చు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆయన నలుగురు పిల్లలు బోనీకి మద్దతుగా నిలిచారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top