‘జై సింహా’ మూవీ రివ్యూ

Balakrishna Jai Simha Movie Review - Sakshi

టైటిల్ : జై సింహా
జానర్ : ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌
తారాగణం : నందమూరి బాలకృష్ణ, నయనతార, నటాషా దోషి, హరిప్రియ, ప్రకాష్‌ రాజ్, అశుతోష్ రాణా
సంగీతం : చిరంతన్‌ భట్‌
దర్శకత్వం : కేయస్‌ రవికుమార్‌
నిర్మాత : సి. కళ్యాణ్‌

సంక్రాంతి బరిలో తిరుగులేని రికార్డ్‌ ఉన్న నందమూరి బాలకృష్ణ, ఈ ఏడాది జై సింహాగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార, నటాషా దోషి, హరిప్రియలు హీరోయిన్లుగా నటించారు. బాలయ్యకు కలిసొచ్చే సంక్రాంతి సీజన్ తో పాటు బాలయ్యకు లక్కీ సెంటిమెంట్స్ అయిన టైటిల్ లో సింహా, హీరోయిన్ గా నయనతారలను కూడా రిపీట్ చేసిన ఈ సినిమా మరోసారి బాలయ్యను సంక్రాంతి హీరోగా నిలబెట్టిందా..? చాలా కాలం తరువాత స్ట్రయిట్ తెలుగు సినిమా చేసిన కేయస్ రవికుమార్ ఏ మేరకు ఆకట్టుకున్నాడు..?

కథ :
నరసింహం(బాలకృష్ణ) ఏడాది వయసున్న కొడుకుతో బతుకుతెరువు కోసం తమిళనాడులోని కుంభకోణం చేరుకుంటాడు. అక్కడ ఓ గుడి ధర‍్మకర్త మురళీ కృష్ణ (మురళీమోహన్) ఇంట్లో డ్రైవర్‌గా పనిలోచేరతాడు. అక్కడి లోకల్ రౌడీ కనియప్పన్‌ (కాళకేయ ప్రభాకర్) తమ్ముడికి మురళీ కృష్ణ కూతురు కారణంగా యాక్సిడెంట్ అవుతుంది. మురళీ కృష్ణ కోసం ఆ నేరాన్ని తన మీద వేసుకొని కనియప్పన్ చేతిలో దెబ్బలో తింటాడు నరసింహం. అదే సమయంలో కొత్తగా వచ్చిన ఏసీపీతోనూ నరసింహానికి గొడవ అవుతుంది. ఈ గొడవల్లో తన కొడుకుకు ఏమన్నా అవుతుందన్న భయంతో ఊరొదిలి వెళ్లిపోవాలనుకుంటాడు. (సాక్షి రివ్యూస్‌)కానీ అదే సమయంలో తన కొడుకు లాగే ఉండే మరో అబ్బాయిని కనియప్పన్ మనుషులు కిడ్నాప్ చేయటంతో తన కొడుకే అనుకొని ఆ అబ్బాయి కాపాడతాడు. అసలు కనియప్పన్ మనుషులు కిడ్నాప్ చేసిన బాబు ఎవరు..? ఆ బాబు నరసింహం కొడుకులాగే ఎందుకు ఉన్నాడు..? నరసింహం భార్య ఏమైంది..? కొత్తగా వచ్చిన ఏసీపీకి నరసింహానికి సంబంధం ఏంటి..? అన్నదే మిగతా కథ.


నటీనటులు :
నందమూరి బాలకృష్ణ అంటేనే మాస్ యాక్షన్. జై సింహాతో మరోసారి తన ఇమేజ్ తగ్గ క్యారెక్టర్ తో అభిమానులను అలరించాడు బాలకృష్ణ. తన మార్క్ పంచ్ డైలాగ్ లు, మాస్ ఎలిమెంట్స్ తో అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చాడు. అదే సమయంలో ఎమోషనల్, సెంటిమెంట్ సీన్స్ తోనూ ఆకట్టుకున్నాడు. అమ్మకుట్టి పాటలో బాలయ్య డాన్స్‌లు అభిమానులను ఖుషీ చేస్తాయి. బాలయ్య జోడిగా నయనతార మరోసారి సూపర్బ్ అనిపించింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే సెంటిమెంట్ సీన్స్ లో నయనతార నటన కంటతడిపెట్టిస్తుంది. (సాక్షి రివ్యూస్‌)నటషా దోషి, హరిప్రియల పాత్రల నిడివి చాలా తక్కువ.. కనిపించిన కాసేపు నటనతో పాటు, గ్లామర్‌ తోనూ మెప్పించారు. విలక్షణ నటుడు ప్రకాష్‌ రాజ్ కీలక పాత్రలో తన మార్క్ చూపించాడు. విలన్‌లుగా కాళకేయ ప్రభాకర్, అశుతోష్ రానాలు ఆకట్టుకున్నారు. ఇటీవల వెండితెర మీద పెద్దగా కనిపించని సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం ఈ సినిమాతో తిరిగి సత్తా చాటుతాడని భావించారు. కానీ మరోసారి బ్రహ్మీ కామెడీ ఆశించిన స్థాయిలో అలరించలేదు.


విశ్లేషణ :
దర్శకుడు కేయస్ రవికుమార్ బాలయ్య ఇమేజ్ తగ్గ మాస్ క్యారెక్టర్ తో అభిమానులను అలరించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా బాలకృష్ణ నుంచి అభిమానుల ఆశించే డైలాగ్స్, సీన్స్ తో సినిమాను పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ గా మలిచాడు. సంక్రాంతి పండుగ సీజన్ లో రిలీజ్ అవుతుండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాను కూడా జోడించి ఆకట్టుకున్నాడు. ఏ మాత్రం ప్రయోగాల జోలికి వెళ్లకుండా రొటీన్ ఫార్ములాతో సినిమా తెరకెక్కించిన దర్శకుడు అభిమానులను సంతృప్తి పరిచినా.. కొత్తదనాన్ని ఆశిం‍చే ఆడియన్స్‌ను మాత్రం ఆ స్థాయిలో అలరించలేకపోయాడు.(సాక్షి రివ్యూస్‌) ఎం.రత్నం డైలాగ్స్ సినిమాకు ప్లస్ పాయింట్, బాలయ్య పవర్ కు తగ్గ పంచ్ డైలాగ్స్ తో అభిమానులతో విజిల్స్ వేయించాడు రత్నం. చిరంతన్ భట్ సంగీతం బాగుంది. గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి హిస్టారికల్ సినిమా తరువాత బాలయ్యతో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ చేసిన చిరంతన్ మరోసారి మంచి మ్యూజిక్‌తో మెప్పించాడు. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. అక్కడక్కడ కథనం నెమ్మదించి విసిగిస్తుంది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.


ప్లస్ పాయింట్స్ :
బాలకృష్ణ నటన
ఎమోషనల్ సీన్స్

మైనస్ పాయింట్స్ :
అక్కడక్కడా నెమ్మదించిన కథనం

- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top