రైతు బతుకుపోరే ఈ చిత్రం | Sakshi
Sakshi News home page

రైతు బతుకుపోరే ఈ చిత్రం

Published Fri, Jun 22 2018 1:05 AM

Annadata Sukhibhava Platinum Disc Function - Sakshi

‘‘సమస్యల కోసం పోరాడే ప్రజల నేపథ్యాన్ని ఇతివృత్తంగా తీసుకుని 30 ఏళ్లుగా సినిమాలు తీస్తున్నా. నా ప్రతి విజయంలోనూ ప్రజా కవుల సహకారం ఉంది. 1995 నుంచి 2018 వరకు 3 లక్షల 25వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అన్నదాతల ఆత్మహత్యలు ఆపాలని నా వంతుగా చేసిన ప్రయత్నమే ‘అన్నదాత సుఖీభవ’ అని ఆర్‌.నారాయణమూర్తి అన్నారు. ఆయన నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘అన్నదాత సుఖీభవ’ చిత్రాన్ని జూలై 7న పునః విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా ‘అన్నదాత సుఖీభవ’ ప్లాటినమ్‌ డిస్క్‌ వేడుకను నిర్వహించారు. ఆర్‌.నారాయణమూర్తి మాట్లాడుతూ– ‘‘అన్నం పెట్టే రైతు బతుకుపోరే ఈ సినిమా. పాలకులు రైతుల ఆత్మహత్యల నివారణకు కృషి చేయాలి. జయతి ఘోష్, రాధాకృష్ణన్‌ కమిషన్, స్వామినాథన్‌ కమిషన్‌లను ప్రభుత్వం ఆ ప్రయత్నంలో భాగంగానే నియమించింది. డాక్టర్‌ స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసులు అమలు చేయాలి. రైతులకు, పంటలకు బీమా కల్పించాలి’’ అన్నారు. ‘‘నా దృష్టిలో జగపతిబాబు, రాఘవ, రామోజీరావు, రాఘవేంద్రరావువంటి కొందరు గొప్పవాళ్లున్నారు.

వాళ్లందరిలోని లక్షణాలు నాకు ఆర్‌. నారాయణమూర్తిగారిలో కనిపిస్తాయి. ప్రపంచం గురించి విపరీతమైన జ్ఞానం ఉంది ఆయనకు. అలాంటి వ్యక్తి సినిమాల్లో చేసింది చాలు అని భావించి, క్రియాశీలక రాజకీయాల్లోకి వెళ్లాలి. ఆయన ద్వారా ప్రజలకు మరింత లాభం చేకూరుతుంది’’ అన్నారు సంగీత దర్శకుడు కీరవాణి. ‘‘సాంస్కృతిక దండయాత్ర జరుగుతున్న తరుణమిది. ఇండియాలో 20–35 ఏళ్లున్న యువతను మరో వైపు ఈ దండయాత్ర తీసుకెళ్తోంది. రైతంటే ఎవరని ప్రశ్నించే పాలకులకు సమాధానమే ‘అన్నదాత సుఖీభవ’’ అన్నారు ప్రజా గాయకుడు గద్దర్‌. ఈ కార్యక్రమంలో అందెశ్రీ, గోరటి వెంకన్న, జయరాజ్, రాజేంద్రకుమార్, సుద్దాల అశోక్‌ తేజ, మాధవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement