'అమీ తుమీ' మూవీ రివ్యూ




టైటిల్ : అమీ తుమీ

జానర్ : కామెడీ ఎంటర్టైనర్

తారాగణం : అడవిశేష్, అవసరాల శ్రీనివాస్,  వెన్నెల కిశోర్, ఈషా, అదితి మైకల్, తనికెళ్ల భరణి

సంగీతం : మణిశర్మ

దర్శకత్వం : మోహనకృష్ణ ఇంద్రగంటి

నిర్మాత : కె.సి. నరసింహారావు



జంధ్యాల తరువాత తెలుగు వెండితెరపై అలాంటి ఆరోగ్యకరమైన కామెడీ పండిస్తున్న అతి కొద్ది మంది దర్శకుల్లో మోహనకృష్ణ ఇంద్రగంటి ఒకరు. మధ్యలో జెంటిల్మేన్ లాంటి సీరియస్ సినిమా చేసినా మరోసారి తన మార్క్ హెల్దీ కామెడీతో ఆడియన్స్కు కితకితలు పెట్టేందుకు అమీ తుమీతో రెడీ అయ్యారు.


అడవి శేష్, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిశోర్లు కీలక పాత్రల్లో నటించిన అమీ తుమీ మోహనకృష్ణ గత చిత్రాల మాదిరిగా ఆకట్టుకుందా..? సీరియస్ స్టైలిష్ రోల్స్ చేసే అడవి శేష్ కామెడీ పండించాడా..? కామెడీ చేసే వెన్నెల కిశోర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రకు ఎంత వరకు సూట్ అయ్యాడు..? అవసరాల శ్రీనివాస్ మరోసారి తన టైమింగ్తో ఆకట్టుకున్నాడా..?



కథ :

అమీ తుమీ మూడు జంటల ప్రేమకథ. సినిమా మొదలవ్వటానికి ముందే ప్రేమలో ఉన్న అనంత్(అడవి శేష్), దీపిక(ఈషా)ల పెళ్లికి దీపిక తండ్రి జనార్థన్(తనికెళ్ల భరణి) ఒప్పుకోడు, తాను చూసిన శ్రీ చిలిపి( వెన్నెల కిశోర్)నే పెళ్లి చేసుకోవాలని చెప్పి దీపికను గదిలో బంధిస్తాడు. అంతేకాదు తనకు వ్యాపారంలో నమ్మకద్రోహం చేసిన గంగాధర్ కూతురు మాయ(అదితి మైకల్)ను తన కొడుకు విజయ్(అవసరాల శ్రీనివాస్) ప్రేమిస్తున్నాడని తెలిసి కొడుకుని ఇంట్లో నుంచి బయటకు పంపేస్తాడు.


గదిలో ఉన్న దీపిక, పనిమనిషి కుమారి(శ్యామల) సాయంతో తప్పించుకొని పారిపోతుంది. అదే సమయంలో గంగాధర్ కూతురు.. మాయ కూడా ఆస్తి కోసం సవతి తల్లి పెట్టే బాధలు భరించలేక ఇల్లు వదిలి బయటకు వచ్చేస్తుంది. తరువాత వీరిద్దరు తమ ప్రేమను ఎలా గెలిపించుకున్నారు..? దీపిక ను చేసుకోవడానికి వచ్చిన పెళ్లి కొడుకు శ్రీ చిలిపి ఏమయ్యాడు..? అన్నదే మిగతా కథ.



నటీనటులు :

హీరోలుగా అడవి శేష్, అవసరాల శ్రీనివాస్ కనిపించినా.. సినిమా అంతా వెన్నెల కిశోర్ షోలా నడిచింది. తన బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్తో ఆడియన్స్ను కడుపుబ్బా నవ్వించాడు కిశోర్. తాను సీరియస్ గా ఉంటూనే కామెడీ చేసి బ్రహ్మానందం లాంటి సీనియర్లను గుర్తు చేశాడు. సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ తనికెళ్ల భరణి, తన మార్క్ తెలంగాణ యాసలో కితకితలు పెట్టాడు. కూతురి ప్రేమను కాదని తన స్వార్థం కోసం తనకు నచ్చిన వాడికే ఇచ్చి పెళ్లి చేయాలనే క్రూరమైన తండ్రి పాత్రలో కూడా మంచి కామెడీ పండించాడు. అడవి శేష్, వెన్నెల కిశోర్, ఈషా, అదితి మైకేల్, కేదార్ శంకర్లు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.



సాంకేతిక నిపుణులు :

దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ మరోసారి తనదైన హాస్య కథతో అలరించాడు. హాస్యం అంటే డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌, పేరడీలే అనుకుంటున్న సమయంలో కుటుంబసమేతంగా చూడదగ్గ ఆరోగ్యకరమైన హాస్య కథా చిత్రాలతో అలరిస్తున్న మోహన కృష్ణ, మరోసారి అదే తరహా ప్రేమ కథలతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా డైలాగ్స్ ఈ సినిమా స్థాయిని పెంచాయి.


తెలంగాణ యాసలో తనికెళ్ల భరణి, ఇంగ్లీష్, తెలుగు కలిపి వెన్నెల కిశోర్ చెప్పిన డైలాగ్స్కు థియేటర్లో విజిల్స్ పడతాయి. మణిశర్మ మ్యూజిక్ సినిమాకు మరో ఎసెట్. సాధారణ సన్నివేశాలతో కూడా మణి తన మ్యూజిక్ మరింత ఫన్నీగా మార్చేశాడు. పిజీ విందా సినిమాటోగ్రఫి, మార్తాండ్ కె వెంటేష్ ఎడిటింగ్ సినిమాను రిచ్గా ప్రెజంట్ చేశాయి.



అమీ తుమీ.. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఆరోగ్యకరమైన కామెడీ ఎంటర్టైనర్.



- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top