పూర్తయ్యేనా..?

underground drainage system not completed in karimnagar - Sakshi

ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న యూజీడీ

ఐదు డివిజన్లకే అనుసంధానం

ఎస్టీపీకి సరిపడా లేని కనెక్షన్లు

పైపులైన్‌ పనులకు గ్రహణం

నిధులు లేవనే సాకుతో తీవ్ర జాప్యం

మరో రూ.25 కోట్లు కేటాయించిన ప్రభుత్వం

కరీంనగర్‌ ప్రజలకు ఎనిమిదేళ్లుగా ప్రత్యక్ష నరకం చూపిస్తున్న అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ (యూజీడీ) అయోమయంలో పడింది. పనులు కొలిక్కి వస్తున్నాయని అధికారులు చెబుతున్నా.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు తయారైంది. రూ.76.5 కోట్ల నిధులతో 2008లో ప్రారంభమైన పనులు ఇప్పటికీ పూర్తికాలేదు. 303 కిలో మీటర్ల పైపులైన్‌ పనుల్లో 285 కిలోమీటర్లు మాత్రమే పూర్తయ్యా యి. ప్రస్తుత లెక్కల ప్రకారం 550 కిలోమీటర్ల పైపులైన్‌ వేయాల్సి ఉంది. ఇప్పటికి సగం పనులు మాత్రమే పూర్తయినట్లుగా భావిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో పనులు అసంపూర్తిగానే ఉన్నాయి.  – కరీంనగర్‌కార్పొరేషన్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌: 38 ఎంఎల్‌డీ సామర్థ్యంతో బొమ్మకల్‌ గోపాల్‌చెరువు స్థలంలో నిర్మించిన సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ (ఎస్టీపీ) పనులు పూర్తయినా దాని సామర్థ్యానికి తగ్గట్టుగా ఇళ్ల నుంచి మురుగునీటి కనెక్షన్లు ఇవ్వకపోవడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో కొద్దిసేపు నడిపించి బంద్‌ చేస్తున్నారు. కేవలం 8, 9, 18, 19, 20 డివిజన్ల నుంచి 25 వందల ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చారు. ఎస్టీపీని ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి పబ్లిక్‌ హెల్త్‌ ఆధ్వర్యంలో ఆరుగురు సిబ్బందితో నడిపిస్తున్నారు.

3,500 ఇన్‌స్పెక్షన్‌ చాంబర్లు..
ఎస్టీపీకి చేరువలో ఉన్న డివిజన్ల నుంచి యూజీడీకి కనెక్షన్లు ఇచ్చేందుకు నగరంలో 3,500 ఇన్‌స్పెక్షన్‌ చాంబర్లు నిర్మించారు. 59 వేల ఇళ్లలోంచి వచ్చే సెప్టిక్‌ ట్యాంకు పైపులను ఇన్‌స్పెక్షన్‌ చాంబర్లకు కలిపితే యూజీడీ పూర్తిస్థాయిలో ఉపయోగంలోకి వస్తుంది. నగరంలో ఇప్పటివరకు 10,600 మ్యాన్‌హోల్స్‌ నిర్మించారు. మొదటి దశలో 4 వేల ఇళ్లకు కనెక్షన్లు ఇస్తామని చెప్పినా ఆ దిశగా అధికారులు ప్రయత్నించకపోవడం గమనార్హం. ఎస్టీపీకి నడిచేందుకు సరిపడా కనెక్షన్లు లేకపోవడంతో ఎస్టీపీని నడిపించలేని పరిస్థితి ఏర్పడుతోంది. ïఎస్‌టీపీకి అతి చేరువలో ఉన్న హౌజింగ్‌బోర్డు కాలనీలో ప్రధాన పైపులైన్‌ మూడేళ్లుగా పనులు ముందు కు కదలడం లేదు. అక్కడక్కడ పనులు చేయడం వదిలేయడం కాంట్రా క్టర్‌ ఇష్టారాజ్యమే అవుతోంది. అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో పైపులైన్‌ పనులకు గ్రహణం పట్టినట్లయింది.

ముందుకు కదలని మురుగు..
ఇటీవల కనెక్షన్లు ఇచ్చిన 2500 ఇళ్ల నుంచి ఎస్టీపీకి వెళ్లాల్సిన మురుగు తరచూ పైపులైన్‌ జామ్‌ అవుతుండడంతో మురుగు ఇళ్లలోకే వస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎస్టీపీ పూర్తిస్థాయిలో నడవకపోవడం వల్లే ఈ పరిస్థితులు ఏర్పడుతున్నటుŠల్‌ తెలుస్తోంది. డ్రెయినేజీల్లో నిలుస్తున్న మురుగుతో దోమలు తయారై ప్రాణాంతక విషజ్వరాలు సోకుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. యూజీడీ నిర్వహణపై అధికారులు శ్రద్ధ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

ఆలస్యంగా నిధులు మంజూరు..
2014, ఆగస్టు 5న కరీంనగర్‌కు వచ్చిన సీఎం కేసీఆర్‌ యూజీడీ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు ఖర్చుపెట్టిన రూ.76.5 కోట్లకు అదనంగా మరో రూ.50 కోట్లు ఇచ్చేందుకు హామీ ఇచ్చారు. ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదు. ఆ తర్వాత మంత్రి కేటీఆర్‌ రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. మంజూరైన రూ.25 కోట్లకు సంబంధించి ఈ నెల 8న మున్సిపల్‌ కార్యాలయంలో చాంబర్ల నిర్మాణానికి శంకుస్థాపన సైతం చేశారు. ఇళ్లలోంచి మురుగునీటి కనెక్షన్లు ఇచ్చి యూజీడీని పూర్తి స్థాయిలో నిర్వహించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అయితే.. ఈ పనులు పూర్తిచేసి యూజీడీని ఉపయోగంలోకి తీసుకువస్తారా.. మళ్లీ మొదటికే వస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  

పనులపై అసహనం..
యూజీడీ పనులు అడ్డగోలుగా ఆలస్యం అవుతుండడం, ఇళ్లలోకి కనెక్షన్లు ఇచ్చే ప్రాంతాల్లో రోడ్లను అడ్డదిడ్డంగా పగుల గొడుతుండడంతో ప్రజలు అసహనానికి గురవుతున్నారు. ఇటీవలే పలు ప్రాంతాల్లో యూజీడీ పైపులైన్‌ పూర్తిచేసి సీసీ రోడ్డు వేసుకున్నారు. ఈ ప్రాంతాల్లో ఇళ్లలోంచి కనెక్షన్లు ఇవ్వాలంటే కొత్త రోడ్లను తవ్వక తప్పని పరిస్థితులు ఉన్నాయి. ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడిప్పుడే బాగుపడుతున్న రోడ్లను మళ్లీ తవ్వడమంటే అభివృద్ధిని పదేళ్లు వెనక్కి తీసుకుపోవడమే అవుతుంది. ఈ పరిస్థితుల్లో రోడ్లు తవ్వడంపై ప్రజలు, ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

తూతూ మంత్రంగా ప్యాచ్‌ వర్క్‌లు..
యూజీడీ కోసం తవ్విన ఆరు నెలలలోపు ప్యాచ్‌ వర్క్‌ పనులు పూర్తిచేయాల్సి ఉండగా ఏడేళ్లు గడిచినా వాటిని పట్టించుకున్న నాధుడే కరువయ్యాడు. ఇదిలా ఉంటే నగర రోడ్ల కోసం కోట్లాది రూపాయలు ఖర్చుపెడుతున్నామని చెబుతున్న నగరపాలక సంస్థ సైతం ప్యాచ్‌వర్క్‌లపై స్పందించడం లేదు. ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోకపోవడంతో స్థానికులు పాలకుల తీరుపై అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు.

కనెక్షన్ల కోసం టెండర్లు పూర్తిచేశాం..
ఇళ్ల నుంచి కనెక్షన్లు ఇచ్చే క్రమంలో ఇన్‌స్పెక్షన్‌ చాంబర్ల నిర్మాణానికి టెండర్లు పూర్తిచేశాం. గతంలో ఇన్‌స్పెక్షన్‌ చాంబర్ల నిర్మించిన రాంకీ సంస్థకే పనులు దక్కాయి. రూ.25 కోట్లతో దాదాపుగా పనులు పూర్తవుతాయి. యూజీడీ వినియోగంలోకి వస్తుంది. పూర్తిస్థాయి వినియోగంలోకి వచ్చిన తర్వాత మున్సిపాలిటీకి అప్పగిస్తాం.  – ఎం.భద్రయ్య, ఎస్‌ఈ, ప్రజారోగ్యశాఖ

Read latest Karimnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top