ఏడేళ్లయినా తీరని దాహం | Thirsty For Seven Years | Sakshi
Sakshi News home page

ఏడేళ్లయినా తీరని దాహం

Mar 7 2019 4:20 PM | Updated on Mar 7 2019 4:22 PM

Thirsty For Seven Years - Sakshi

గ్రామంలో నిరుపయోగంగా ఉన్న వాటర్‌ట్యాంక్, శివారులో పగిలిపోయిన పైప్‌లైన్లు  

సాక్షి, కోనరావుపేట: గ్రామస్తుల దాహార్తి తీర్చి, తాగునీటి ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం కల్పించడానికి ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు చర్యల మూలంగా నిరుపయోగంగా మారుతున్నాయి. పనులు చేసినా.. అవి ఫలితాలు ఇవ్వడంలేదు. ఫలితంగా లక్షలాది రూపాయల నిధులు ఎందుకూ పనికి రాకుండా పోయాయని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. 


ట్యాంకుతోపాటు నిధులు వృథా
వేములవాడ నియోజకవర్గంలోని కోనరావుపేట మండలం మరిమడ్లలో శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారానికి ఐఏపీ పథకంలో 2012లో రూ.19.60 లక్షలు నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో వట్టిమల్లలోని అజ్మీరాతండాలోని మూలవాగులో ఉన్న మంచినీటి బావినుంచి మరిమడ్ల వరకు పైప్‌లైన్‌ నిర్మించారు. పైప్‌లైన్‌ నిర్మించి సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు ఒక్క చుక్క నీరు కూడా మరిమడ్లకు చేరలేదు. దీంతో మూలవాగు నుంచి మరిమడ్ల వరకు నీరు రావడంలేదు. పైపుల గుండా నీరెందుకు రావడంలేదో ఇంజనీరింగ్‌ అధికారులు కూడా తెలుసుకోలేకపోతున్నారు. అసలు కారణం తెలు సుకోకపోగా పైప్‌లైన్‌ మధ్యలో రూ.11 లక్షలతో సంప్‌ నిర్మించాలంటూ ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు తెలిపారు. ఇవే నిధులు మరో రూ.13 లక్షలతో వాటర్‌ ట్యాంక్‌ నిర్మించారు. వాటర్‌ ట్యాంక్‌ పనులు పూర్తయినా ఇంతవరకు చుక్క నీరు అందులోకి ఎక్కలేదు. ట్యాంకుతో పాటు నిధులు కూడా వృథా అయ్యాయి.  
 

నిధులన్నీ పైపుల పాలు 
మండలంలోని మరిమడ్లలో నిర్మించిన పనులన్నీ వృథాగా మారాయి. పైప్‌లైన్లు నిర్మించినా పనిచేయడం లేదు. మంచినీటి బావినుంచి  మరిమడ్లలో నిర్మించిన వాటర్‌ ట్యాంక్‌ సుమారు వంద మీటర్ల ఎత్తులో ఉంటుంది. అంత ఎత్తులో ఉన్న ట్యాంకులోకి నీరు ఎక్కాలంటే నాలుగు ఇంచుల పైపులతో లైన్లు వేయాలి. కాంట్రాక్టర్లు వేసిన పైపులు మూడు ఇంచులే ఉండడం, అవి కూడా నాణ్యత లేనివి వేయడంతో నీరు పారకముందే అవి పగిలిపోతున్నాయి. బావి నుంచి ట్యాంకు వరకు వేసిన పైపుల్లో నాణ్యత లేక అనేక  చోట్ల పైపులు పగిలిపోయాయి. ఇంజనీరింగ్‌ అధికారుల అనాలోచిత నిర్ణయం, నిర్లక్ష్యం మూలంగా అవన్నీ వృథాగా మారాయి. దీంతో గ్రామస్తులకు తిప్పలు తప్పడంలేదు. 
 

మరుగున పడుతున్న పథకం
మరిమడ్లలో కొన్నేళ్ల క్రితం పైపులు వేసి వాటిని మర్చిపోవడంతో లక్ష్యం నెరవేరలేదు. అప్పటినుంచి దీన్ని పట్టించుకునే వారే కరువయ్యారు. కాంట్రాక్టర్ల కోసం అంచనాలనే మార్చారని, ఇందువల్ల  నిర్మాణం పూర్తయినా ఫలితం కలగడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. 

నిధులన్నీ వృథా 
గ్రామంలో లక్షల వ్యయం తో నిర్వహించ తలపెట్టిన పైప్‌లైన్‌ ప్రాజెక్ట్‌ మధ్యలో నే వదిలేశారు. గ్రామంలో తాగునీటి కోసం అనేక ఇ బ్బంది పడుతున్నాం. దూ రప్రాంతాలకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. అధికారులు స్పందించి నిధులు సద్వినియో గం అయ్యే లా చూడాలి.  
– సింగం రాములు 


అధికారులు స్పందించాలి 
గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్వహించతలపెట్టిన పైప్‌లైన్‌ పనులు పూర్తి చేస్తే బాగుండేది. పైప్‌లైన్‌ వేసినా ఇంతవరకు ఒక్క చుక్క నీరు రా లేదు. నిర్మించిన వాటర్‌ ట్యాంకులోకి నీరు చే రలేదు. ఈ పథకం ప్రారంభిస్తే గ్రామస్తుల నీ టి సమస్య తీరేది. అధికారులు స్పందించి నీ టి సమస్యను తొలగించాలని కోరుతున్నాం.      
– మాట్ల అశోక్, సర్పంచ్, మరిమడ్ల   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement