
కొత్తపల్లి : మండలంలోని ఆసిఫ్‌నగర్‌లోగల ప్రధాన రహదారి ప్రమాదకరంగా తయారైంది. రోడ్లపైనే మురికి నీరు ప్రవహిస్తుండటంతో పాటు జానెడు లోతు గుంతలతో ప్రయాణం ప్రాణసంకటంగా మారింది. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు మాత్రం మరమ్మతులు చేపట్టడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక, గ్రానైట్, మొరం వంటి ఖనిజ సంపదకు నిలయమైన ఆసిఫ్‌నగర్, ఖాజీపూర్, ఎలగందుల పారిశ్రామిక ప్రాంత గ్రామాల నుంచి వేలాది వాహనాలు ఇతర ప్రాంతాలకు వెళ్తుంటాయి. డ్రెయినేజీ వ్యవస్థలేక గ్రానైట్ పరిశ్రమలు, ఇండ్లలోని మురికి నీరంతా రోడ్డుపైకి వస్తోంది. ఈ రోడ్డును చూసిన ప్రయాణికులు భయాందోళనలు వ్యక్తం చేస్తూ ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టి మురికి నీటి కాలువలు నిర్మించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.