ఆపదొస్తే అంతేనా..!

no 108 vehicles in jangaon district - Sakshi

జిల్లాలో 108 వాహనాల కొరత

అంతంత మాత్రంగా ఎమర్జెన్సీ సేవలు

13 మండలాలకు 6 వాహనాలే దిక్కు

కాగితాలకే పరిమితమవుతున్నప్రతిపాదనలు

పట్టించుకోని ఉన్నతాధికారులు

సాక్షి, జనగామ: ప్రాణపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న క్షతగాత్రులను కాపాడి వారికి పునర్జన్మ ప్రసాదిస్తున్న 108 వాహనాలు జిల్లాలో కనిపించడం లేదు. మొత్తం 13 మండలాల్లో కేవలం 5 వాహనాలు మాత్రమే అందుబాటులో ఉండడంతో అత్యవసర సేవలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని సందర్భాల్లో పొరుగు మండలాల నుంచి వాహనాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.

108 వాహనాలు లేని మండలాలు ఇవే..
ఆపద సమయంలో ఉన్న బాధితులను సకాలంలో ఆస్పత్రిలో చేర్పించి వారికి వైద్యసేవలందించేందుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 2008 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 108 వాహన సేవలను ప్రారంభించారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జనగామ జిల్లా పరిధిలో 13 మండలాలు ఉన్నాయి. ఇందులో జనగామ, పాలకుర్తి, దేవరుప్పుల, స్టేషన్‌ఘన్‌పూర్, రఘునాథపల్లి, నర్మెట మండలాలకు మాత్రమే వాహ నాలు ఉన్నాయి. లింగాలఘణపురం, జఫర్‌గఢ్, చిల్పూరు, తరిగొప్పుల, బచ్చన్నపేట, గుండాల, కొడకండ్ల మండలాలకు లేవు. దీంతో ఆయా మండలాల్లో అత్యవసర సమయంలో సమీపంలో ఉన్న మండలాల నుంచి 108 వాహనాలను రప్పించి అధికారులు సేవలు అందిస్తున్నారు.

ఎమర్జెన్సీ సేవలు అంతంతే..
జిల్లాలో 108 వాహనాల కొరత కారణంగా ఎమర్జెన్సీ సేవల కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని, గర్భిణులను, పాము, తేలు కాటు, క్రిమిసంహారక మందు తాగిన వారిని, పరస్పర దాడుల్లో గా యపడిన వారిని, అగ్ని ప్రమాద బాధితులకు 108 వాహన సిబ్బంది ప్రథమ చికిత్స అందించి తక్షణమే సమీపంలో పెద్ద ఆస్పత్రిలో చేర్పిస్తారు. అయితే స్టేషన్‌ఘన్‌పూర్‌లోని 108 వాహనం ఇటు చిల్పూరు, అటు జఫర్‌గఢ్‌ మండలాలకు, దేవరుప్పులలోని వాహనం లింగాలఘణపురం, గుండాల మండలాల పరిధి లో సేవలు అందిస్తోంది. కాగా, జిల్లాలో 55 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి విస్తరించి ఉండడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వాహనాల కొరత కారణంగా జనగామ, రఘునాథపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలాల్లోనే సేవలు అందిస్తుండగా.. మిగతా మండలాలకు కష్టంగా మారింది. జిల్లా ఏర్పడిన తర్వాత 7 మండలాలకు 108 వాహనాలు కావాలని అప్పటి డీఎంహెచ్‌ఓ హరీష్‌రాజు ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించారు. ఏడాది గడిచిపోయినప్పటికి కొత్త వాహనాలను కేటాయించకపోవడంతో ఎమర్జెన్సీ సేవలకు అంతరాయం కలుగుతోంది. ఇప్పటికైన ఆయా మండలాలకు 108 వాహనాలను కేటాయించి అత్యవసర సేవలు అందించాలని కోరుతున్నారు. 

108 వాహనాలు కేటాయించాలి
ప్రమాదాల నుంచి ప్రజలను కాపాడే 108 వాహనాలను సమకూర్చాలి. ఏడు మండలాలకు వాహనాలు వచ్చే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలి. ఉచితంగా సేవలందించే వాహనాలు లేక చాలామంది ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారు. 
–ఎండీ దస్తగిరి, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి 

రెండు మండలాలకే ప్రతిపాదనలు పంపాం
జిల్లా నుంచి కొడకండ్ల, జఫర్‌గఢ్‌ మండలాలకు 108 వాహనాలు కావాలని ప్రతిపాదనలు పంపించాం. ప్రభుత్వం కేటాయిస్తే అందుబాటులోకి సేవలను తీసుకొస్తాం. ప్రస్తుతం ఉన్న వాహనాలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సేవలను అందిస్తున్నాం. 
–అన్న ప్రసన్నకుమారి, డీఎంహెచ్‌ఓ 

Read latest Jangaon News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top