చుట్టూ పొలాలు.. మధ్యలో డెస్క్‌టాప్‌

world food building in sweden - Sakshi

నగరాలు పెరిగిపోతున్నాయి. దీంతోపాటే అవసరాలూ! అందుకే కాయగూరల్ని ఎక్కడో పల్లెల్లో పండించి నగరాల వరకూ వాటిని తీసుకొచ్చి తద్వారా ఖర్చులు తడిసి మోపెడు చేసుకోవడం ఎందుకని ప్రపంచవ్యాప్తంగా వర్టికల్‌ ఫార్మింగ్‌పై ఆసక్తి పెరుగుతోంది. అపార్ట్‌మెంట్ల మాదిరిగా నిట్టనిలువు వరుసల్లో అతితక్కువ నీరు, ఎరువులు, క్రిమి కీటకనాశినులతో చేసే సాగును వర్టికల్‌ ఫార్మింగ్‌ అంటారన్నది తెలిసిందే. అమెరికాతోపాటు, యూరప్‌లోనూ చాలా చోట్ల వర్టికల్‌ ఫార్మింగ్‌ ద్వారా టన్నులకు టన్నుల కాయగూరలు పండిస్తున్నారు. ఫొటోలో కనిపిస్తున్నది కూడా అలాంటి వర్టికల్‌ ఫార్మింగ్‌ కేంద్రమే. ఇది ఒకొక్కటీ ఏడాదికి 500 టన్నుల కాయగూరలు పండిస్తుందని అంటోంది స్వీడిష్‌ కంపెనీ ప్లాంటగాన్‌! అంతేకాదు. దీంట్లో ఇంకో విశేషం ఏమిటంటే.. దాదాపు 60 మీటర్ల ఎత్తుండే ఈ వ్యవసాయ క్షేత్రం 16 అంతస్తుల ఆఫీసు బిల్డింగ్‌గా కూడా ఉపయోగపడుతుంది.

భారీ గోళాకారంలో ఉన్న అద్దాల మేడలో బయటివైపున పచ్చగా ఉన్న ప్రాంతమంతా వ్యవసాయ క్షేత్రంగా ఉంటే, మధ్యలో ఉన్న తెల్లటి స్తంభం లాంటి నిర్మాణంలో కార్యాలయాలు ఏర్పాటవుతాయన్నమాట. అంతేకాదు. వ్యవసాయ క్షేత్రం అవసరాలకు కావాల్సిన విద్యుత్తులో కనీసం సగం.. బిల్డింగ్‌ శోషించుకునే వేడి ద్వారానే ఉత్పత్తి చేస్తారు. ఒక్కసారి దీని నిర్మాణం పూర్తయితే ఏటా దాదాపు వెయ్యి టన్నుల కార్బన్‌ డైయాక్సైడ్‌ వాతావరణంలోకి చేరకుండా అడ్డుకుంటుంది. అలాగే ఏడాదికి దాదాపు 5 కోట్ల లీటర్ల నీటిని ఆదా చేస్తుంది. ప్రస్తుతానికి డిజైన్ల స్థాయిలో ఉన్న ఈ ‘వరల్డ్‌ ఫుడ్‌ బిల్డింగ్‌’ను వాస్తవ రూపంలోకి తీసుకొచ్చేందుకు ప్లాంటగాన్‌ నిధుల సేకరణ పనిలో ఉంది. తమ ఆలోచనకు దాదాపు లక్ష మంది మద్దతుందని, అందరూ తలా ఒక చేయి వేస్తే దీన్ని పూర్తి చేయడం పెద్ద కష్టమేమీ కాదని అంటోంది ప్లాంటగాన్‌. 

- సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top