సౌదీ మహిళలు కారు ఎందుకు నడపాలంటే..!

Why Women Drive To Car In Saudi Arabia? - Sakshi

రియాద్‌: అత్యంత మత ఛాందసవాద దేశమైన సౌదీ అరేబియాలో మహిళల కారు డ్రైవింగ్‌పై ఇంతకాలం ఉన్న నిషేధాన్ని అక్కడి రాచరిక ప్రభుత్వం ఎందుకు ఎత్తివేసింది? నిన్నటి వరకు ఈ నిషేధాన్ని ఉల్లంఘించి కారు నడిపిన మహిళలను కఠినంగా శిక్షించిన ప్రభుత్వమే ఇప్పుడు వారిని కనికరించింది? అందుకు దారితీసిన పరిస్థితులేమిటీ ? సౌదీ అరేబియా గత 60 ఏళ్లుగా చమురు అమ్మకాల ద్వారా వచ్చిన సొమ్ముతో ధనిక దేశంగా విరాజిల్లుతూ వచ్చిన విషయం తెల్సిందే.
 
ధనవంతమైన దేశం అవడం వల్ల సౌదీ ప్రజలకు ప్రభుత్వం ఉచితంగా ఇళ్ల సౌకర్యం ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలకు ఎక్కువ వేతనాలు ఇస్తూ వచ్చింది. దీర్ఘకాల సెలవుల సౌకర్యంతోపాటు త్వరగా పదవి విరమణ చేసి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకునే సౌకర్యాన్ని కూడా కల్పించింది. మత సంప్రదాయాలు, సంస్కతి కారణంగా అన్ని రంగాల్లోకి మహిళలను అనుమతించలేదు. అందుకని ప్రభుత్వ ఉద్యోగాల్లో నలుగురు మగాళ్లకుగాను ఒక్క మహిళనే ఉద్యోగంలో ఉన్నారు. ప్రస్తుత ప్రభుత్వరంగంలో 1.20 కోట్ల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, వారిలో 50 లక్షల మంది మాత్రమే సౌదీలు ఉన్నారు. మిగతా వారంతా వలసవచ్చిన వారే. వారిలో సౌదీ మహిళలు 15 లక్షల మందే ఉన్నారు. 

2014 సంవత్సరం నుంచి అంతర్జాతీయంగా చమురు ఉత్పత్తుల ధరలు దారుణంగా పడిపోవడం, దేశంలో జనాభా పెరగడంతో సౌదీ ఆర్థిక పరిస్థితి బాగానే దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో దేశాభివద్ధికి ‘2030 సౌదీ విజన్‌’ అంటూ సౌదీ యువరాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ తీసుకొచ్చారు. అందులో మగవాళ్ల కన్న కాస్త ఎక్కువ తెలివితేటలు, అక్షరాస్యత కలిగిన మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు. అయితే సౌదీ మహిళలు నర్సు ఉద్యోగాల లాంటివి చేయడానికి ఎందుకో ఎక్కువగా ఇష్టపడరు. సంప్రదాయపరంగా, ఉద్యోగాల పరంగా మహిళా డ్రైవర్లు అవసరం అవడం వల్ల వారి డ్రైవింగ్‌పై సౌదీ రాజు నిషేధం ఎత్తేశారు.
 
సౌదీ ప్రభుత్వ రవాణా వ్యవస్థగానీ, టాక్సీ వ్యవస్థగాని బలంగా లేదు. మగవారి తోడు లేకుండా మహిళలు మార్కెట్‌కు వెళ్లాలన్నా, ఆస్పత్రికి వెళ్లాలన్నా ఇప్పటి వరకు కష్టంగా ఉంటూ వచ్చింది. టాక్సీ డ్రైవర్‌ మగవాడైతే అందులో ఒక మహిళ వెళ్లరాదు. ఇద్దరు, ముగ్గురు కలిసి వెళ్లాల్సి ఉంటుంది. సొంతకారులో మహిళలు వెళ్లాలంటే ఆ కారును భర్తనో అతి సమీప బంధువో నడపాలి. వారు డ్రైవర్‌ను పెట్టుకున్నా మొగతోడు తప్పనిసరి. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలు ఒంటరిగా వెళ్లాలంటే, పిల్లలను తీసుకొని బడికో, బయటకో వెళ్లాలంటే తానే కారు నడపాల్సిన అవసరం ఏర్పడింది.
 
ఇక అమెరికాలో లాగానే సౌదీలో కూడా ఇంటికి, పనిచేసే చోటుకు చాలా దూరం ఉంటుంది. ప్రభుత్వ రవాణా అంతంత మాత్రమే కనుక మహిళలు కారులోనే వెళ్లాల్సిన çపరిస్థితి ఏర్పడింది. మగ డ్రైవర్‌ వెంట ఒంటరిగా వెళ్లడానికి సంప్రదాయం ఒప్పుకోదు కనుక మహిళలు సొంతంగా కారును నడపాల్సిన అవసరం వచ్చింది. మహిళలు కూడా టాక్సీలు నడిపితే మహిళలు వాటిల్లో ఒంటరిగా ప్రయాణించవచ్చు. ఇన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని మహిళలు డ్రైవింగ్‌ చేయరాదంటూ ఉన్న నిషేధాన్ని సౌదీ రాజు ఎత్తివేశారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top