
కోహ్లీ వీరాభిమానిని పాక్‌లో అరెస్టు చేశారు
భారత టాప్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి వీరాభిమానిని పాకిస్థాన్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
లాహోర్: భారత టాప్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి వీరాభిమానిని పాకిస్థాన్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన ఉమర్ ద్రాజ్ కోహ్లిపై తన అభిమానాన్ని చాటుకుంటూ తన ఇంటిపై భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. లాహోర్‌కు 200 కిలోమీటర్ల దూరంలోని ఒకారా జిల్లాలోని నివసిస్తున్నఅతడు మంగళవారం తన ఇంటిపైకప్పు భారత జాతీయజెండాను ఎగురవేయడంపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో అతని ఇంటిపై తాము దాడి చేసి.. ఇంటిపైకప్పుమీద ఎగురుతున్న భారత జెండాను స్వాధీనం చేసుకున్నామని పోలీసు అధికారి మహ్మద్ జమిల్ బుధవారం తెలిపాడు. అతన్ని అరెస్టు చేసి.. అదే రోజున కోర్టులో ప్రవేశపెట్టామని, కోర్టు అతనికి కస్టడీ విధించిందని ఆయన వివరించాడు. భారత టెస్టు జట్టు కెప్టెన్ కోహ్లికి తాను వీరాభిమానినని, అతనిపై అభిమానం చాటుకునేందుకే భారత జెండాను తన ఇంటి పైకప్పు మీద ఎగురవేశానని ఉమర్ ద్రాజ్ విలేకరులకు తెలిపాడు. తాను చేసింది తప్పు అనే విషయం తనకు తెలియదని, తనను క్షమించి వదిలిపెట్టాలని ఆయన పోలీసులను కోరారు.