వీఎస్‌ నైపాల్‌ కన్నుమూత

V S Naipaul, Nobel prize winning author, passes away - Sakshi

అనారోగ్యంతో మరణించిన భారత సంతతి రచయిత

నోబెల్, మ్యాన్‌ బుకర్‌ సహా పలు అవార్డుల గ్రహీత

సంతాపం తెలిపిన కోవింద్, మోదీ  

లండన్‌: భారత సంతతికి చెందిన ప్రముఖ రచయిత, ప్రఖ్యాత నోబెల్, మ్యాన్‌ బుకర్‌ బహుమతుల గ్రహీత విద్యాధర్‌ సూరజ్‌ప్రసాద్‌ (వీఎస్‌) నైపాల్‌ (85) అనారోగ్యంతో లండన్‌లో కన్నుమూశారు. శనివారం తమ ఇంట్లోనే వీఎస్‌ నైపాల్‌ తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబసభ్యులు ఆదివారం తెలిపారు. ‘అద్భుత సృజనాత్మకతతో, నిరంతర కృషితో విజయవంతమైన జీవితాన్ని గడిపిన నైపాల్‌ తనకు ప్రీతిపాత్రమైన మనుషుల మధ్య తనువు చాలించారు’ అంటూ నైపాల్‌ భార్య నదీరా ఓ ప్రకటన విడుదల చేశారు. 1932 ఆగస్టు 17న ట్రినిడాడ్‌లో భారతీయ హిందూ కుటుంబంలో జన్మించినప్పటికీ ఇంగ్లండ్‌లోనే ఆయన ఎక్కువ కాలం గడిపారు.

ఇంగ్లిష్‌ భాషలో అత్యంత ప్రవీణుడిగా పేరు తెచ్చుకున్న నైపాల్‌ తన కెరీర్‌లో ముప్పైకి పైగా పుస్తకాలను రాశారు. మతాన్ని, రాజకీయ నాయకులను, వలసవాదాన్ని విమర్శిస్తూ ఆయన చేసిన రచనలు అత్యంత ప్రజాదరణ పొందాయి. నైపాల్‌ తొలి పుస్తకం ‘ద మిస్టిక్‌ మాస్యూర్‌’ 1951లో ప్రచురితం కాగా, ఆయన రాసిన వాటిలో అత్యంత ప్రజాదరణ పొందిన ‘ఎ హౌస్‌ ఫర్‌ మిస్టర్‌ విశ్వాస్‌’ 1961లో మార్కెట్లోకి వచ్చింది. తన తండ్రి శ్రీప్రసాద్‌ నైపాల్‌ జీవితం ఆధారంగా తీసుకుని ఈ పుస్తకాన్ని వీఎస్‌ నైపాల్‌ రాశారు. 2001లో నోబెల్‌ సాహిత్య పురస్కారాన్ని నైపాల్‌ అందుకున్నారు. 1971లోనే ‘ఇన్‌ ఎ ఫ్రీ స్టేట్‌’ పుస్తకానికి ఆయనకు మ్యాన్‌బుకర్‌ ప్రైజ్‌ లభించింది. సాహిత్య రంగానికి నైపాల్‌ చేసిన సేవలను గుర్తిస్తూ 1990లో బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ –2 ఆయనకు నైట్‌హుడ్‌ను ప్రదానం చేశారు. ఇస్లాం మతవాదంపై ఆయన రాసిన అమాంగ్‌ ద బిలీవర్స్, బియాండ్‌ బిలీఫ్‌ పుస్తకాలు కూడా బాగా ప్రాచుర్యం పొందాయి. గెరిల్లాస్, ఎ బెండ్‌ ఇన్‌ ద రివర్, ఎ వే ఇన్‌ ద వరల్డ్, ద మైమిక్‌ మెన్, ది ఎనిగ్మా ఆఫ్‌ అరైవల్, హాఫ్‌ ఎ లైఫ్‌ తదితర పుస్తకాలు నైపాల్‌కు రచయితగా మంచి పేరు తెచ్చిపెట్టాయి.

అక్షర ప్రపంచానికి లోటు: కోవింద్‌
వీఎస్‌ నైపాల్‌ మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, రాజస్తాన్, మధ్యప్రదేశ్‌ల సీఎంలు సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. కోవింద్‌ ఓ ట్వీట్‌ చేస్తూ ‘మానవ స్థితి గతులు, వలస వాదం, మత విశ్వాసాలపై అద్భుతమైన పుస్తకాలు రాసిన వీఎస్‌ నైపాల్‌ మృతి బాధాకరం. ఇండో–ఆంగ్లియన్‌ సాహిత్యానికేగాక, మొత్తం సాహిత్య ప్రపంచానికే ఆయన మరణం తీరని లోటు’ అని పేర్కొన్నారు. మోదీ ట్వీట్‌ చేస్తూ ‘చరిత్ర, సంస్కృతి, వలసవాదం, రాజకీయాలు, ఇంకా అనేక అంశాలపై అద్భుత రచనలు చేసిన వీఎస్‌ నైపాల్‌ను ప్రపంచం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఆయన కుటుంబానికి నా సానుభూతి’ అని అన్నారు. నైపాల్‌ శిష్యుడు, అమెరికాకు చెందిన పర్యాటక పుస్తకాల రచయిత పాల్‌ థెరాక్స్, మ్యాన్‌ బుకర్‌ ప్రైజ్‌ గెలిచిన భారత సంతతి రచయిత సల్మాన్‌ రష్దీ, మరో భారత సంతతి నవలా రచయిత హరి కుంజు తదితరులు కూడా నైపాల్‌ మృతికి సంతాపం తెలిపారు.  

పేదరికంలో పుట్టినా ఉన్నత శిఖరాలకు..
వీఎస్‌ నైపాల్‌ తండ్రి శ్రీప్రసాద్‌ ట్రినిడాడ్‌ గార్డియన్‌ పత్రికకు విలేకరిగా పనిచేసేవారు. చిన్నతనంలో పేదరికంలో బతికిన నైపాల్‌కు 18 ఏళ్ల వయసులో ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో చదివేందుకు ఉపకార వేతనం లభించింది. అప్పుడు ట్రినిడాడ్‌ నుంచి లండన్‌ వచ్చిన ఆయన.. ఇక తన మిగిలిన జీవితంలో ఎక్కువ కాలం అక్కడే గడిపారు. చదువుకునే రోజుల్లోనే ఓ నవల రాయగా అది ప్రచురితమవ్వక పోవడంతో ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. 1955లో పాట్రీసియా ఆన్‌ హేల్‌ను పెళ్లాడిన ఆయన.. 1996లో ఆమె చనిపోవడంతో వయసులో తనకంటే ఎన్నో ఏళ్లు చిన్నదైన, అప్పటికే పెళ్లయ్యి విడాకులు తీసుకున్న పాకిస్తానీ జర్నలిస్ట్‌ నదీరాను రెండో పెళ్లి చేసుకున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top