తేలియాడే ఇళ్లు.. | Sakshi
Sakshi News home page

తేలియాడే ఇళ్లు..

Published Sun, Feb 19 2017 12:17 AM

తేలియాడే ఇళ్లు..

నీటిపైన తేలియాడే ఇళ్లు నిర్మించుకుంటే ఎలా ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా..! చుట్టూ నీరు మధ్యలో ఇల్లు... ఆ అనుభూతే వేరు కదా..! ఇదే ఆలోచన హంగేరీలోని ఓ గ్రామ ప్రజలకు వచ్చింది. వెంటనే నీటిపై సుందరమైన ఇళ్లను నిర్మించుకున్నారు. హంగేరీ దేశ రాజధాని బుడాపెస్ట్‌ నగరానికి పశ్చిమ భాగాన 80 కిలోమీటర్ల దూరంలో బాకద్‌ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలోని ఆరోస్జ్‌లెనీ థర్మల్‌ కేంద్రం.. అవసరాల నిమిత్తం ఓ కృత్రిమ సరస్సు(బాకోది)ను 1961లో ఏర్పాటు చేసింది. థర్మల్‌ కేంద్రంలోని బాయిలర్‌ల నిర్వహణకు ఆ సరస్సులోని చల్లటి నీటిని వినియోగించేవారు.

అనంతరం అదే సరస్సులోకి వేడి నీటిని పంపేవారు. దీంతో అక్కడ వాతావరణం ఎంత చల్లగా ఉన్నా... సరస్సులోని నీరు గడ్డ కట్టేది కాదు. ఇదిలా ఉంటే సరస్సు నిర్మించిన ఏడాదిలోపే ఆ ప్రదేశం పర్యాటక ప్రాంతంగా మారి పోయింది. అక్కడికి ఆహ్లాదం కోసం, ఫిషింగ్‌ కోసం వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరిగి పోయింది. దీంతో అక్కడే ఇళ్లను నిర్మించుకోవాలని గ్రామస్తులు భావించారు. వెంటనే నీటిపై ఇళ్లను నిర్మించేందుకు వీలుగా చెక్కతో కూడిన నివా సాలను నిర్మించుకున్నారు. దీంతో ఆ ప్రదేశా నికి ఎంతో ప్రాధాన్యం సంతరించుకుని ఓ పర్యాటక ప్రాంతంగా మారింది.

Advertisement
Advertisement