
సియోల్ : వచ్చే నెలలో ఉత్తర కొరియా మరిన్ని కవ్వింపుచర్యలకు పాల్పడవచ్చని దక్షిణ కొరియా ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు అణు క్షిపణి పరీక్షలు నిర్వహించినట్లుగానే అక్టోబర్‌లో కూడా అలాంటి పరంపరనే కొనసాగించే అవకాశం ఉందన్నారు. వచ్చే నెలలో కమ్యూనిస్టు పార్టీ వార్షికోత్సవం నేపథ్యంలో దానికి సమాంతరంగా ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు గురువారం దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్‌తో ఆ దేశ రక్షణశాఖ సలహాదారు సమావేశం అయిన సందర్భంగా ఈ విషయం చెప్పారు.
అక్టోబర్ 10 నుంచి 18 వరకు వరుసగా ఉత్తర కొరియా ఏదో ఒక చర్యలకు దిగబోతోందని తమ వద్ద సమాచారం ఉందన్నారు. పూర్తి వివరాలు అందించేందుకు నిరాకరించారు. అయితే, సైనిక చర్యలు, దౌత్యం ద్వారా ఉత్తర కొరియాతో సమస్యను పరిష్కరించుకోవాలని చూస్తోందని, అయితే, మరోసారి యుద్ధానికి వెళ్లడం తమకు ఇష్టం లేదని పేర్కొన్నారు. ఇటీవల వరుసగా అణు కార్యక్రమాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఉభయ కొరియా ప్రాంతాలతోపాటు అటు ప్రపంచ అగ్ర దేశాల్లో కూడా గుబులు బయలుదేరిన విషయం తెలిసిందే.