
గాభరా గుండెలకు స్మార్ట్ టచ్
ఈ కాలంలో స్ట్రెస్ లేనిదెవరికి చెప్పండి? వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారికే కాదు.. దాదాపు అందరిలోనూ ఒత్తిడే ఒత్తిడి.
ఈ కాలంలో స్ట్రెస్ లేనిదెవరికి చెప్పండి? వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారికే కాదు.. దాదాపు అందరిలోనూ ఒత్తిడే ఒత్తిడి. దీన్ని తగ్గించుకునేందుకే గదా.. కొంతమంది యోగా, వ్యాయామం బాటపడుతున్నారు.. ఇంకొందరు సంగీతం, కళారూపాలను ఎంచుకునేది. ఇప్పుడు వీటి అవసరం అస్సలు లేదంటోంది యూకే కేంద్రంగా పనిచేస్తున్న బయోసెల్ఫ్ టెక్నాలజీ అనే సంస్థ. మరి స్ట్రెస్‌కు విరుగుడు ఎలా అంటే.. ఫొటోలో ఈ ఉన్న గాడ్జెట్‌ను వాడితే చాలంటుంది. ఛాతీకి కట్టేసుకునే ఈ పరికరం పేరు సెన్సేట్! దీంట్లోని రకరకాల సెన్సర్లు గుండెకొట్టుకునే ఉచ్ఛ్వాస నిశ్వాసల వేగాలతోపాటు మనం కూర్చునే తీరు, శరీర ఉష్ణోగ్రత వంటి అనేక అంశాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూంటాయి. ఈ సమాచారాన్ని వైర్‌లెస్ పద్ధతిలో స్మార్ట్‌ఫోన్‌కు చేరవేస్తూంటాయి.
ఈ అప్లికేషన్‌లోని సాఫ్ట్‌వేర్.. వచ్చిన సమాచారం మొత్తాన్ని విశ్లేషించి.. మనిషి ఒత్తిడికి గురవుతున్నాడా? లేదా? అన్నది నిర్ధారించుకుంటుంది. అందుకు తగ్గట్టుగా ఛాతీపై గాడ్జెట్ స్పందిస్తుంది. చెవికి వినిపించని స్థాయిలో కొన్ని ధ్వని తరంగాలను శరీరంలోకి పంపడం మొదలుపెడుతుంది. ఈ కంపనలు కాస్తా వాగస్ నాడిని ప్రేరేపించి మనసు కుదుటపడేలా చేస్తుందన్నది కంపెనీ అంటున్న మాట. ఇదే సమయంలో స్మార్ట్‌ఫోన్ తనవంతుగా మనసుకు హాయి కలిగించే ప్రత్యేకమైన సంగీతాన్ని వినిపిస్తుందట. ప్రత్యేకమైన ఫ్రీక్వెన్సీల్లో ఉండే ఈ సంగీతం కూడా స్ట్రెస్‌ను తగ్గించేందుకు ఉపయోగపడుతుందని కంపెనీ అంటోంది.
ప్రస్తుతానికి సెన్సేట్ అన్నది నమూనాల దశలోనే ఉంది. వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు బయో సెల్ఫ్ కంపెనీ నిధులు సేకరించే ప్రయత్నాల్లో ఉంది. ఒక్కో సెన్సేట్‌ను రూ.14 వేలకు విక్రయించాలన్నది కంపెనీ ఆలోచన. ఒక్క మాటలో చెప్పాలంటే.. సెన్సేట్ ఉదయం వేళల్లో మీకు ధ్యానం చేయించే గురువుగా.. ఒత్తిడి పెరినప్పుడు సంగీతం వినిపించే స్నేహితుడిగానూ ఉంటుందని అంటున్నారు కంపెనీ సీఈవో స్టెఫాన్ చిమ్లిక్. – సాక్షి నాలెడ్జ్ సెంటర్