ఉప్పు తియ్యనౌతుంది.. నిప్పు నిల్వ ఉంటుంది!

ఉప్పు తియ్యనౌతుంది.. నిప్పు నిల్వ ఉంటుంది!


సముద్రపు నీళ్లను తాగునీరుగా మార్చేందుకు, విద్యుత్తును భారీ స్ధాయిలో నిల్వ చేసేందుకు శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం ఫలించింది!



గ్రాఫీన్‌ పేరెప్పుడైనా విన్నారా? విని ఉండరుగానీ... ఇంట్లో పిల్లలు వాడే పెన్సిల్‌ మాత్రం మీకు తెలిసే ఉంటుంది. దాంట్లో ఉండే గ్రాఫైట్‌ను ఒక పలుచటి పొరగా పరిస్తే దాన్ని గ్రాఫీన్‌ అంటారు. శాస్త్ర ప్రపంచంలో చాలాకాలంగా సూపర్‌ మెటీరియల్‌గా పేరు పొందింది ఈ మూలకం. పేరుకు తగ్గట్టుగానే ఇటీవలి కాలంలో ఈ అద్భుత మూలకం తాలూకూ ఉపయోగాలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి.  వాతావరణ మార్పులు కానివ్వండి, ఇంకో కారణం కానివ్వండి.. ప్రపంచవ్యాప్తంగా తాగునీటికి కొరత ఏర్పడుతోందన్నది మాత్రం వాస్తవం.



సముద్రంలోని నీటిని మంచినీటిగా మార్చుకుంటే ఈ కొరతను అధిగమించవచ్చుగానీ.. ఇది ఇప్పటికీ చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. ఇక్కడే గ్రాఫీన్‌ గురించి చెప్పుకోవాలి. మామూలుగానైతే గ్రాఫీన్‌ ద్వారా లవణాలను వేరు చేయడం, చౌక, సులువు కూడా. అయితే గ్రాఫీన్‌ను పెద్ద ఎత్తున తయారు చేయడం కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో మాంచెస్టర్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త రాహుల్‌ నాయర్‌ గ్రాఫీన్‌ స్థానంలో గ్రాఫీన్‌ ఆక్సైడ్‌ను పెద్ద ఎత్తున తయారు చేయడంలో విజయం సాధించారు. దీన్ని ఒక పూతగా వాడితే చాలు.. సముద్రపు ఉప్పునీటిలోని లవణాలు చాలా తేలికగా వేరుపడతాయి. ఈ పదార్థాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిర్లవణీకరణ యంత్రాల్లో ఉపయోగించి చూస్తామని, వచ్చే ఫలితాలను బట్టి మరింత అభివృద్ధి చేస్తామని రాహుల్‌ నాయర్‌ తెలిపారు. ఇక రెండో విషయానికి వద్దాం.



తాగునీరు.. జీవితానికి ఎంత అవసరమో, కావాల్సినంత విద్యుత్తు మన జీవనశైలికి అంతే అవసరం. అయితే సూర్యుడి శక్తిని నిల్వ చేసుకోవడంలో కొన్ని ఇబ్బందులున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఆస్ట్రేలియాలోని ఆర్‌ఎంఐటీ విశ్వవిద్యాలయం ఓ వినూత్న ఆవిష్కరణ చేసింది. గ్రాఫీన్‌తో తయారు చేసిన ఎలక్ట్రోడ్‌ను అభివృద్ధి చేయడం ద్వారా విద్యుత్తును బ్యాటరీల్లో నిల్వ చేసుకోగల సామర్థ్యం కొన్ని వందల రెట్లు ఎక్కువ కానుంది. అంతేకాదు, ఓ చెట్టు ఆకుల ఆకారాన్ని స్ఫూర్తిగా తీసుకుని అభివృద్ధి చేసిన ఈ ఎలక్ట్రోడ్‌  ద్వారా శక్తిమంతమైన సూపర్‌ కెపాసిటర్లను తయారు చేయవచ్చునని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలు అంటున్నారు.


– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top