బుర్ర తక్కువ మనిషి; అయినా పర్లేదు..!

Russian Man With Half Brain By Birth - Sakshi

బుర్ర తక్కువ మనిషి అని మీరెవరినైనా తిట్టారనుకోండి. అవతలి వాళ్లు.. వెంటనే ఇంతెత్తున ఎగురుతారు. నన్ను అంతమాట అంటావా? అని కయ్యానికి దిగుతారు! కానీ.. రష్యాలోని ఓ 60 ఏళ్ల వ్యక్తిని ఈ మాట అంటే మాత్రం పెద్దగా ఇబ్బందేమీ ఉండకపోవచ్చు! ఎందుకంటారా? తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే ఇతనికి మెదడులో సగం లేదు కాబట్టి! 

ఆశ్చర్యంగా ఉందా? అసలు ఎలా బతికాడన్న అనుమానం వస్తోందా? చదివేయండి. మరి.. మాస్కోలోని బుర్నాసియాన్‌ ఫెడరల్‌ మెడికల్, బయో ఫిజికల్‌ సెంటర్‌లో కొన్ని రోజుల క్రితం 60 ఏళ్ల వృద్ధుడు చేరాడు. ఒక కాలు, చేయి కదపలేకపోతున్నా అని అంటే.. డాక్టర్లు స్కాన్‌ చేయించారు. తీరా ఆ మెదడు స్కాన్‌ను చూసిన డాక్టర్లు షాక్‌ అయ్యారు. ఎడమ వైపు భాగం అసలు లేనే లేదు. నల్లటి ఖాళీ మాత్రమే కనిపిస్తోంది. ఇలా సగం మెదడు మాత్రమే ఉంటే.. ఏదో ఒక సమస్య ఉండి తీరాలనుకున్న డాక్టర్లు.. అతడి గురించి వాకబు చేస్తే మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి.

ఆ వ్యక్తి ఇంజనీరింగ్‌ చదవడమే కాకుండా.. రెడ్‌ ఆర్మీలో కూడా పనిచేశాడు. ఏరకమైన ఇబ్బందులూ లేకుండా ఎంచక్కా కుటుంబాన్ని కూడా నడుపుకొచ్చారు. పిండంలో ఉన్న సమయంలోనే అతడి మెదడు సగమే పెరిగి ఉంటుందని.. స్కాన్ల వంటి టెక్నాలజీ అప్పట్లో అందుబాటులో లేని కారణంగా అతడు భూమ్మీదకు రాగలిగాడని న్యూరాలజిస్ట్‌ మరీనా అనికినా చెప్పారు. చెడిపోయిన మెదడు భాగాలను అతి అరుదైన శస్త్రచికిత్స ద్వారా తొలగించే అవకాశమున్నా దుష్పరిణామాలకు దారితీయొచ్చని.. ఈ వ్యక్తి విషయంలో సగం మెదడు లేకపోయినా ఏరకమైన ఇబ్బంది లేకపోవడం అద్భుతమనే చెప్పాలని అంటున్నారు అనికినా. సాధారణంగా మెదడు కుడివైపు భాగం సృజనాత్మకమైన అంశాలకు ఉపయోగపడితే.. ఎడమవైపు భాగం సైన్స్, మ్యాథమెటిక్స్, లాజిక్స్‌ వంటి అంశాలకు పనికొస్తుంది. కానీ ఈ వ్యక్తిలో ఎడమ భాగం లేకున్నా సమస్యలు లేకపోవడం గమనార్హం. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top