ప్రపంచవ్యాప్తంగా సగానికి పైగా శరణార్థులకు పది దేశాలు మాత్రమే ఆశ్రయమిస్తున్నాయని అమ్నెస్టీ తెలిపింది.
లండన్: ప్రపంచవ్యాప్తంగా సగానికి పైగా శరణార్థులకు కేవలం పది దేశాలు మాత్రమే ఆశ్రయమిస్తున్నాయని అంతర్జాతీయ సంస్థ అమ్నెస్టీ తెలిపింది. చాలా ధనిక దేశాలు శరణార్థులను అక్కున చేర్చుకునేందుకు ముందుకు రావట్లేదని, ఇది సిగ్గుపడాల్సిన విషయమని పేర్కొంది. ఇప్పటికైనా దీని పరిష్కారం కోసం దేశాల అధినేతలంతా చర్చించాలని కోరింది. ప్రతి ఏటా 10 శాతం మంది శరణార్థులకి నివాసం చూపించడం ద్వారా ఈ సమస్యను అధిగమించగలమని అమ్నెస్టీ తెలిపింది.
శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి నియమించిన కమిషన్(యూఎన్‌హెచ్‌సీఆర్) గణాంకాల ఆధారంగా ఈ అధ్యయనం నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా 2.1 కోట్ల శరణార్థులుండగా వీరిలో 56 శాతం మంది ఈ పది దేశాల్లోనే ఉన్నారని వెల్లడించింది. శరణార్థులకు ఆశ్రయమిచ్చే దేశాలుగా జోర్డాన్, టర్కీ, పాకిస్తాన్, లెబనా, ఇరాన్, ఇథియోపియా, కెన్యా, ఉగాండా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కోంగో, చాడ్‌లు ఉన్నాయి.