ప్రణబ్‌ ఫొటోపై రెచ్చిపోయిన బంగ్లా సోషల్‌ మీడియా

pranab mukherjee visit bangla, viral photo - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బంగ్లాదేశ్‌లోని భారత హై కమిషన్‌ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతోపాటు బంగ్లాదేశ్‌కు చెందిన రాజకీయ నాయకులు, దౌత్యవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికార లాంఛనం ప్రకారం ప్రణబ్‌ ముఖర్జీతోపాటు బంగ్లాదేశ్‌ ఆహ్వానితులు కలిసి ఫొటోలు దిగారు. అందులో ఓ ఫొటోను భారత హై కమిషన్‌ కార్యాలయం తన ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్‌ చేయడంతో బంగ్లాదేశ్‌ సోషల్‌ మీడియాలో పెద్ద దుమారం రేగింది. 

అందుకు కారణం ప్రణబ్‌ ముఖర్జీ కుర్చీలో కూర్చొని ఉండడం, బంగ్లాదేశ్‌ ఆహ్వానితులు ఆయన వెనకాల నిలబడి ఉండడం. అందులోనూ బంగ్లాదేశ్‌ మాజీ అధ్యక్షుడు హెచ్‌ఎం ఇర్షాద్‌ నిలబడి ఉండడం, ఆయన పక్కన బంగ్లాదేశ్‌ ప్రస్తుత స్పీకర్‌ శిరిని చార్మిన్‌ చౌధురి నిలబడడం. ఇది భారత ముందు బంగ్లాదేశ్‌కు తలవంపులేనంటూ బంగ్లా సోషల్‌ మీడియా గోల చేసింది. బంగ్లాదేశీయులు హోదాలకన్నా పెద్ద వయస్కులను ఎక్కువగా గౌరవిస్తారు. ఆ లెక్కన ప్రణబ్‌ ముఖర్జీని గౌరవించాలనుకున్నా ప్రణబ్‌కు 82 ఏళ్లుకాగా, ఇర్షాద్‌కు 89 ఏళ్లు. ఈ లెక్కనైనా ఇర్షాద్, ప్రణబ్‌ పక్కన కూర్చోవాలీ లేదా ఇర్షాద్‌ గౌరవార్థం ప్రణబ్‌ కూడా లేచి నిలబడాలికదా! అని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. 

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి చెందిన ప్రణబ్‌కు ఈ మాత్రం సంస్కతి తెలియకపోతే బంగ్లాదేశ్‌ సంస్కతి గురించి బాగా తెల్సిన ఆయన భార్య నుంచైనా ఆ సంస్కతిని ఆయన గౌరవించలేదా? అని ప్రశ్నిస్తున్నారు. 

తరతరాలపాటు విదేశీయుల పాలనలో మగ్గిన బంగ్లాదేశీయులకు ఇప్పుడు వారి పాలకులు ఎవరు, ఎవరి పాదాలను తాకారు? ఎవరు, ఎవరి చెంతన నిలబడ్డారు? ఎక్కడ నిలబడ్డారు? ఎవరు కూర్చున్నారు, ఎవరు నిలబడ్డారు? ఏ స్థానంలో నిలబడ్డారు? ఇత్యాది వివరాలన్నీ వారికి పట్టింపుగా మారాయి. కానీ బంగ్లాదేశ్‌ పాలకులు మాత్రం ఎప్పుడూ భారత్‌ పాలకులను గౌరవిస్తారు. 1971లో వారి విముక్తి పోరాటానికి భారత దేశం సాయం చేయడమే అందుకు కారణం. ప్రైవేటు పర్యటనపై ఇటీవల బంగ్లాదేశ్‌కు వచ్చిన ప్రణబ్‌ ముఖర్జీ బంగ్లాలో వారం రోజుల పాటు పర్యటì ంచారు. ఈ సందర్భంగా ఆయనకు భారత్‌ హైకమిషన్‌ ఆతిథ్యం లభించింది. ఈ సందర్భంగానే ఇర్షాద్, బంగ్లా స్పీకర్, దౌత్యవేత్తలతో ఆయన ఫొటో దిగడం, అది వివాదాస్పదం అవడం జరిగింది. సకాలంలో స్పందిచిన భారత్‌ దౌత్యకార్యాలయం ఫొటోను తొలగించింది. 

బంగ్లా ప్రధాన మీడియా ఈ ఫొటో వ్యవహారాన్ని పట్టించుకోలేదు. ప్రణబ్‌ ముఖర్జీ రాసిన తన జ్ఞాపకాల పుస్తకం ఇటీవల విడుదలవడం, అందులోని అంశాలు బంగ్లా సోషల్‌ మీడియాలో ప్రాచుర్యం పొందిన కారణంగా సోషల్‌ మీడియాకు కోపం వచ్చి ఉంటుంది. 2008లో జైల్లో మగ్గుతున్న బంగ్లాదేశ్‌ రాజకీయ నాయకులను తాను ఎలా విడిపించిందీ, బంగ్లా మాజీ ఆర్మీ చీఫ్‌ మొయున్‌ యూ అహ్మద్‌కు ఉద్యోగ భద్రత ఎలా కల్పించేందుకు ఎలా కషి చేసిందీ ఆయన తన జ్ఞాపకాల్లో వివరించారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top