మృత్యుశకటం.. భీతావహ వాతావరణం

Pakistan Plane Crash: Bodies From The Sky Shocking Footage Captures - Sakshi

కరాచీ: రాజు అమ్జద్‌ అనే వ్యక్తి కరాచీలో తన కారులో ప్రయాణిస్తున్నాడు. అయితే ఉన్నట్టుండి తన కారుపై ఓ మృతదేహం పడింది. దీంతో ఒక్కసారిగా రాజా షాక్‌కు గురై కారు నుంచి బయటకి వచ్చి పరుగులు తీశాడు. ఓ కుటుంబం రంజాన్‌ పండగ దగ్గరకి వస్తుండటంతో వారి ఇంటి డాబాపై పిండి పదార్ధాలు చేసుకుంటున్నారు. ఇంతలో రెండు మృతదేహాలు వారి ఇంటి డాబాపై పడ్డాయి. దీంతో భయానికి గురైన వారు ఇంట్లోకి పరుగులు తీశారు. కొద్దిసేపటి వరకు ఎవరికీ అర్థం కాలేదు ఈ మృతదేహాలు ఎక్కడివి? ఆకాశం నుంచి ఊడిపడుతున్నాయి అని? కానీ తర్వాత అర్థమైంది పాకిస్తాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌(పీఐఏ)కు చెందిన ఓ విమానం కరాచీలోని జనావాస ప్రాంతాల్లో కుప్పకూలిందని. 

విమానం కుప్పకూలిన ధాటికి మృతదేహాలు గాల్లోకి ఎగిరి కొన్ని మీటర్ల దూరంలో చెల్లాచెదురుగా పడిపోయాయి. దీనికి సంబంధించి ఎంతో భయానకంగా ఉన్న వీడియో ఒకటి నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. ఈద్‌ సమయంలో ఇలాంటి ఘోర ప్రమాదం జరగడం చాలా బాధకరమని అక్కడి ప్రజలు పేర్కొంటున్నారు. ఈ విమానంలో 99 మంది ప్రయాణిస్తున్నారని, ఘటనాస్థలం నుంచి 57 మృతదేహాలను వెలికితీశామని అధికారులు తెలిపారు. మిగతావాటి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.  ఈ ఘటనపై పాకిస్తాన్‌ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ, ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఖమర్‌ జావేద్‌ బజ్వా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ దుర్ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ప్రధాని ఇమ్రాన్‌ అధికారులను ఆదేశించారు. కాగా ఈ ప్రమాదం నుంచి ఇద్దరు ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

ఇంతకీ ఏమైందంటే?
లాహోర్‌ నుంచి వస్తున్న పీకే–8303 విమానం మరికొద్ది క్షణాల్లో కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్‌ కానుండగా, విమానాశ్రయం పక్కనే ఉన్న జిన్నా గార్డెన్‌ ప్రాంతంలో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ పీఐఏ ఎయిర్‌బస్‌ ఏ320 విమానంలో 91 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 31 మంది మహిళలు, 9మంది చిన్నారులు ఉన్నారని అధికారులు తెలిపారు. ల్యాండింగ్‌ గేర్‌లో సమస్య ఏర్పడిందని కూలిపోవడానికి కాసేపటి ముందు పైలట్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌కు సమాచారమిచ్చారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top