భారత రాష్ట్రం.. జమ్మూ కశ్మీర్‌ : పాకిస్తాన్‌

Pak Minister Qureshi Mentions Kashmir As Indian State In Geneva - Sakshi

జెనీవా : జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు, రాష్ట్ర విభజన నేపథ్యంలో దాయాది దేశం పాకిస్తాన్‌ వీలు చిక్కినప్పుడల్లా భారత్‌ను దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ సమాజం మద్దతు కూడగట్టేందుకు అన్ని ప్రయత్నాలు విఫలమైన వేళ పాక్‌ మరోసారి ఐక్యరాజ్య సమితి ఎదుట కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తేందుకు సిద్ధమైంది. జెనీవాలో జరుగుతున్న యూఎన్‌ మానవ హక్కుల కమిషన్‌ మండలి సమావేశానికి పాక్‌ విదేశాంగ మంత్రి మహ్మద్‌ ఖురేషి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని చెప్పే క్రమంలో భారత దేశంలోని రాష్ట్రమైన జమ్మూ కశ్మీర్‌ అంటూ సంబోధించారు. ‘ కశ్మీర్‌లో పరిస్థితులను సమీక్షించేందుకు యూఎన్‌ ఆధ్వర్యంలో కమిటీ నియమించాలి. కమిటీ సభ్యులకు మేము పూర్తి మద్దతునిస్తాం అని పేర్కొన్నారు. అదే విధంగా కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు ఉన్నాయంటూ భారత్‌ చెప్పడం విడ్డూరంగా ఉంది’ అని ఖురేషి విమర్శలు గుప్పించారు. 

కాగా పాక్‌ ఆరోపణలకు ధీటుగా సమాధానమిచ్చేందుకు భారత ప్రతినిధులు కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కశ్మీర్‌ అంశంపై పాక్‌ వాదనలను తిప్పికొట్టేందుకు ప్రణాళికను సిద్ధం చేశామని.. తమకు అవకాశం వచ్చినపుడు వాళ్లకు సరైన సమాధానం చెబుతామని వెల్లడించారు. కాగా కశ్మీర్‌ భారత అంతర్గత అంశమని ఐక్యరాజ్యసమితి శాశ్వత సభ్యదేశాలైన రష్యా, యూకే, అమెరికా సహా ఫ్రాన్స్‌ వంటి ఇతర దేశాలు ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి అంతర్జాతీయ సమాజం ముందు భారత్‌ పరువు తీయాలని భావించిన పాక్‌ మంత్రి... కశ్మీర్‌ భారత రాష్ట్రం అని సంబోధించి నాలుక కరుచుకున్నారు. దీంతో దేశ విభజన నాటి నుంచి ఇప్పటిదాకా దాయాది దేశం వెంట ఈ మాట వినాలని ఎదురు చూస్తున్న వాళ్లకు ఖురేషి మాటలు హాయినిస్తాయంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తద్వారా కశ్మీర్‌ భారత అంతర్గత అంశమని పాక్‌ కూడా ఒప్పుకున్నదంటూ తమదైన శైలిలో పాక్‌ తీరును ఎండగడుతున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top