
ఇతని పేరు వేన్ వింటర్స్.. ఈ ఫొటో చూశాక ఈపాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది.. ఇతని భార్యకు అత్యవసరంగా కిడ్నీ అవసరమైంది. అందుకే ఇలా బోర్డు వేసుకుని రోడ్డుపై పడ్డాడు. 74 ఏళ్ల వింటర్స్‌కి 26 ఏళ్ల క్రితం డీనె అనే మహిళతో వివాహమైంది. ఇప్పటివరకు అంతా భాగానే ఉంది.. కానీ రెండేళ్ల క్రితం డీనెకి రెండు మూత్రపిండాలు చెడిపోయాయని తెలిపాడు. మూత్రపిండాల మార్పిడి ఒక్కటే మార్గమని డాక్టర్లు తేల్చి చెప్పేశారు.
అయితే కిడ్నీ కొనేందుకు వింటర్స్ దగ్గర డబ్బు ఉన్నప్పటికీ దాత దొరకట్లేదు.. నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ గణాంకాల ప్రకారం ప్రతి నెలా కిడ్నీ దాతల కోసం వేచి చూసే రోగుల సంఖ్య మూడు వేలకు చేరుతోంది. కిడ్నీ దాతల కోసం వేచిచూస్తూ ప్రతిరోజూ 13 మంది రోగులు చనిపోతున్నారు. అయితే తన భార్యకు ఆ పరిస్థితి రాకూడదని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఒక బోర్డుపై ‘నా భార్య కోసం ఏ నెగటివ్ రక్తం కలిగిన కిడ్నీ దాత కావాలి’ అని రాసి పెట్టి రోడ్డుపై పడ్డాడు.
ప్రతిరోజూ ఆ బోర్డు వేసుకుని కొన్ని కిలోమీటర్లు నడిచేవాడు. ఆ బోర్డును చూసి రోజుకి 700 నుంచి 800 ఫోన్ కాల్స్ దాతల నుంచి వచ్చాయంట.. అలా ఒకానొక సుముహూర్తాన ఒక దాత నుంచి సేకరించిన కిడ్నీ సహాయంతో డీనెకి విజయవంతంగా డాక్టర్లు ఆపరేషన్ చేశారు. అనంతరం సంతోషంగా ఇంటికి చేరుకున్నారు. అయినా ఆ తర్వాత కూడా ఇప్పటికీ వింటర్స్ అదే బోర్డును వేసుకుని తిరిగి రోడ్డుపైకి వెళుతున్నాడు. తన భార్య పరిస్థితి ఎవరికీ రాకూడదని నిర్ణయించుకుని ఇతర రోగుల కోసం మూత్రపిండాల సేకరణలో పడ్డాడు.