నాడు చంద్రుడి యాత్ర విఫలమైతే....

NASA Celebrates 50th Anniversary Of The Moon Landing - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సరిగ్గా 50 సంవత్సరాల క్రితం అంటే, 1969, జూలై 16వ తేదీన అమెరికా, ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి ప్రముఖ హ్యోమగామి మైఖేల్‌ కాలిన్స్‌ తన ఇద్దరు సహచరులైన నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్‌ ఆల్డ్రిన్‌తో కలిసి ‘అపోలో11’లో చంద్ర మండల యాత్ర సాగించారు. చంద్రుడిపై తొలి అడుగు పెట్టిన తొలి మానవుడిగా చరిత్రలోకి ఎక్కిన నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ నేడు లేరు. ఆయన 2012లో అనారోగ్య కారణాల వల్ల మరణించారు. ఆయన వెనకాలే చంద్రుడిపై అడుగుపెట్టిన బజ్‌ ఆల్డ్రిన్‌ ఇప్పటికీ జీవించే ఉన్నారు. వారితో చంద్రుడిపైకి దిగని కాలిన్స్‌ ‘అపోలో 11’ మిషన్‌లో ఉండిపోయారు. చంద్ర మండలానికి మహత్తరమైన మానవుడి యాత్రను విజయవంతంగా పూర్తి చేసి నిన్నటికి యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా నాసా మంగళవారం కెన్నడ స్పేస్‌ సెంటర్‌లో స్వర్నోత్సవాలను నిర్వహించింది.

ఈ సందర్భంగా ప్రత్యేకంగా మైఖేల్‌ కాలిన్స్‌ను ఆహ్వానించింది. ఈ కార్యక్రమంలో తనతో పాటు బజ్‌ ఆల్డ్రిన్, నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌లు కూడా పాల్గొంటారని ఆశించానని, ఇప్పుడు ఆర్మ్‌స్ట్రాంగ్‌ తమ మధ్య లేకపోవడం దురదష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఇక బజ్‌ ఆల్డ్రిన్‌ ఈ కార్యక్రమానికి ఎందుకు హాజరుకాలేదో తెలీదని అన్నారు. ఆనాడు ‘అపోలో 11’ పేరిట చంద్రమండలానికి చేపట్టిన సాహస యాత్ర ఎనిమిది రోజుల్లో విజయవంతంగా ముగిసింది. ఒక వేళ ఆ యాత్ర విజయవంతంగా ముగియకపోతే, చంద్రుడిపై అడుగుపెట్టిన వారు తిరిగి రాకపోతే ? అదే జరిగితే అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌ తాను చదవాల్సిన ఉపన్యాసాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. 

‘ఇన్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ మూన్‌ డిజాస్టర్‌’
అమెరికా అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌ ఉపన్యాసాన్ని విలియం సఫైర్‌ జూలై 18, 1969న రాశారు. ‘చంద్ర మండలానికి వెళ్లిన నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్, ఎడ్విన్‌ ఆల్డ్రిన్‌ అనే సాహసికులకు గడ్డు రోజులు దాపురించాయి. వారు తిరిగి కోలుకుంటారని నమ్మకం కూడా లేదు. వారి ప్రాణత్యాగాలకు ఓ అర్థం ఉందని వారికి తెలుసు. నిజం తెలుసుకోవడం, వాస్తవాలను గ్రహించడంలో భాగంగా ఓ సమున్నత లక్ష్యం కోసం వీరిద్దరు ప్రాణాలను వొదిలారు. వారి కోసం వారి కుటుంబాలు, స్నేహితులు, దేశ జాతి, యావత్‌ ప్రపంచం, మొత్తం భూగోళమే నివాళుర్పిస్తుంది...’ అన్న దోరణిలో ఆయన ఉపన్యాసం సాగుతుంది. మైఖేల్‌ రాకెట్‌లో కక్ష్య తిరుగుతుండడం వల్ల ఆయన ప్రాణాలకు వచ్చే ముప్పేమి లేదని, చంద్రుడి మీద అడుగు పెట్టిన ఇద్దరికే ప్రమాదం ఉంటుందని నాడు భావించారు. అదష్టవశాత్తు అలాంటి ప్రమాదం ఏదీ జరగక పోవడంతో నిక్సన్, వ్యోమగాములకు ఫోన్‌లో మాట్లాడారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top