కరోనా భయం: నా సోదరి శవాన్ని తీసుకువెళ్లండి..

Man Trapped With Sister Dead Body Says Italy Abandoned Them Covid 19 - Sakshi

నేపుల్స్‌/ఇటలీ: ‘‘నా సోదరి చనిపోయింది. ఇక్కడే ఈ మంచంపై విగతజీవిగా పడి ఉంది. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. తనకు నేను అంత్యక్రియలు నిర్వహించలేకపోతున్నాను. ఇటలీ మమ్మల్ని వదిలేసింది. మేం పూర్తిగా నాశనమయ్యాం. దయచేసి నా సోదరి శవాన్ని తీసుకువెళ్లండి’అంటూ ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. తన సోదరిని కాపాడుకునేందుకు ఎంతగానో ప్రయత్నించానని అయినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఉద్వేగానికి గురయ్యాడు. ప్రాణాంతక వైరస్‌ కోవిడ్‌-19 భయం కారణంగా తనకు ఎదురైన దుస్థితి గురించి సోషల్‌ మీడియాలో వీడియో షేర్‌ చేశాడు. శరవేగంగా విస్తరిస్తున్న మహమ్మారి కోవిడ్‌-19(కరోనా వైరస్‌) ధాటికి ప్రపంచదేశాలు వణికిపోతున్న విషయం తెలిసిందే. చైనాను బెంబేలెత్తించిన ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ముఖ్యంగా ఇటలీలో నిన్నటి వరకు 189గా ఉన్న కరోనా మృతుల సంఖ్య 24గంటల్లోనే 1,016కు చేరింది. దాదాపు 15వేల మంది కరోనా వైరస్‌తో బాధపడుతున్నారు. దీంతో ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.(ప్రపంచంపై కరోనా పడగ

ఈ నేపథ్యంలో ఇటలీలోని నేపుల్స్‌లో నివసించే థెరిసా ఫ్రాంజెస్‌(47)కు గతవారం కరోనా లక్షణాలు బయటపడ్డాయి. ఈ క్రమంలో ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో శనివారం ఆమె మృతి చెందారు. కరోనా టెస్టు ఫలితాలు వెల్లడికాకముందే ఆమె కన్నుమూశారు. అయితే కరోనా భయం కారణంగా థెరిసా శవాన్ని తీసుకువెళ్లేందుకు స్థానిక ఆస్పత్రులు నిరాకరించాయి. దీంతో తమకు సహాయం చేయాల్సిందిగా ఆమె సోదరుడు లుకా ఫ్రాంజెస్‌ ఫేస్‌బుక్‌లో వీడియో షేర్‌ చేశాడు. ఈ క్రమంలో దాదాపు 36 గంటల తర్వాత వైద్య సిబ్బంది వచ్చి స్థానిక శ్మశాన వాటికలో ఆమె శవాన్ని ఖననం చేశారు. ఈ విషయం గురించి లుకా చెబుతూ... తన సోదరి నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతోందని... అదే సమయంలో తనకు కరోనా సోకిందని పేర్కొన్నాడు. ఈ క్రమంలో సరైన చికిత్స అందక తను మరణించిందని... ఆవేదన వ్యక్తం చేశాడు. అదే విధంగా తమ ఇంట్లో వాళ్లకు కూడా కరోనా లక్షణాలు బయటపడ్డాయని.. తమను తాము ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదని వాపోయాడు. కరోనాను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు.(ఆ ప్రయోగం వికటించి కరోనా పుట్టుకొచ్చిందట!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top