‘టిక్‌టాక్‌’కు ప్రమాదకరమైన ‘వైరస్‌’

ISIS Trying to Spread Propaganda on TikTok - Sakshi

న్యూఢిల్లీ : ప్రపంచంలో అత్యధికంగా ప్రాచుర్యం పొందిన మూడు వీడియో యాప్స్‌లో ‘టిక్‌టాక్‌’ ఒకటి. దీన్ని వినియోగిస్తున్న వినియోగదారుల్లో 30 శాతం మంది 18 ఏళ్ల లోపు వారే.  వారికింకా సొంత వ్యక్తిత్వం అబ్బనితరం. అంటే పలు ప్రభావాలకు లోనయ్యే అవకాశం ఉన్న ప్రాయం వారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలనే అత్యంత ప్రమాదరకరమైన వైరస్‌ టిక్‌టాక్‌కు సోకింది. అదే ‘ఐసిస్‌ (ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్‌ సిరియా)’ ఐసిస్‌ టెర్రరిస్టులు తమ బంధీలను పలు రకాలుగా హింసిస్తున్న, గొంతులు కోసి చంపేస్తున్న వీడియో క్లిప్పులను ఇందులో పోస్ట్‌ చేస్తున్నారు. గత మూడు వారాల నుంచే ఈ వైరస్‌ ప్రారంభమైంది.

వీటిని చూసి ఉలిక్కిపడిన ‘టిక్‌టాక్‌’ కంపెనీ యాజమాన్యం ఎప్పటికప్పుడు వాటిని తొలగించేస్తోంది. గత వారం ఐసిస్‌ టెర్రరిస్టుల ప్రచార వీడియోలను యాప్‌ నుంచి యాజమాన్యం తొలగించే లోగానే అవి డజన్‌ ఖాతాలకు షేర్‌ అయ్యాయి. ఐసిస్‌ వీడియో క్లిప్పింగ్స్‌లో ఎక్కువగా బందీల చేతులు వెనక్కి విరిచి కట్టేసి మొకాళ్లపై కూర్చోబెట్టి వారి మెడ రక్తనాళాలను చాకుతో తెగ నరకడం, అతి దగ్గరి నుంచి బందీల తలలకు తుపాకులు ఎక్కుపెట్టి కాల్చివేసే దృశ్యాలే ఎక్కువగా ఉన్నాయి. 175 నుంచి వెయ్యి మంది వరకు ఫాలోవర్లు ఉన్న ఓ ముగ్గురు యూజర్ల నుంచే ఇప్పటి వరకు ఈ వీడియోలు పోస్ట్‌ అయిన విషయాన్ని యాప్‌ యాజమాన్యం గుర్తించింది. వారిలో ఒక యూజర్‌ మహిళ కావడం గమనార్హం. వారి పోస్టింగ్‌లకు 25 నుంచి 125 వరకు లైక్స్‌ కూడా రావడం ఆందోళనకరమైన విషయం. మూడు వారాల క్రితం ఈ వీడియో క్లిప్పింగ్‌ల పోస్టింగ్‌లు మొదలు కాగా, తాజాగా ఒకటి రెండు రోజుల క్రితం పోస్ట్‌ అయింది. వాటిల్లో టెర్రరిస్టులు తుపాకులు గాల్లోకి ఎత్తి పాటలు పాడుతున్న దృశ్యాలు కూడా ఉన్నాయి.

ఐసిస్‌ టెర్రరిస్టులు తమ ప్రచారం కోసం సోషల్‌ మీడియాలోని ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్, అల్ఫాబెట్‌లను ఉపయోగించుకోగా, పాటలు, డ్యాన్సుల షేరింగ్‌లతో ఎక్కువ పాపులర్‌ అయిన ‘టిక్‌టాక్‌’లోకి ప్రవేశించారు. టెర్రరిస్టు సంస్థలను నిషేధించినట్లు టిక్‌టాక్‌ యాజమాన్యం తన కంపెనీ మార్గదర్శకాల్లోనే పేర్కొంది. టెర్రరిస్టుల పోస్టింగ్‌లను ఎవరు షేర్‌ చేయరాదని, ప్రోత్సహించరాదని యాజమాన్యం తాజాగా పిలుపునిచ్చింది. బీజింగ్‌లోని ‘బైటెండెన్స్‌ లిమిటెడ్‌’ కంపెనీ టిక్‌టాక్‌ను నిర్వహిస్తోంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top