పాక్‌ ఎన్నికల బరిలో హిందూ మహిళ

Hindu Woman Contests In Pakistan Election - Sakshi

కరాచీ : ముస్లింలు మెజారిటీ వర్గంగా ఉన్న పాకిస్తాన్‌లో ఓ హిందూ మహిళ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీలో నిలిచి చరిత్ర సృష్టించారు. సింధ్‌ ప్రావిన్స్‌కు చెందిన 31 ఏళ్ల సునీత పర్మార్‌ జూలై 25న జరిగే అసెంబ్లీ ఎన్నికలకు తార్పర్కర్‌ జిల్లాలోని సింధ్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. మైనార్టీ వర్గాల నుంచి అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేస్తున్న తొలి మహిళ సునీతనే కావడం విశేషం. ఏ పార్టీ మద్దతు లేకున్న ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోరాండేందుకు సిద్ధమయ్యారు. ఈ ఏడాది మార్చిలో కూడా హిందూ దళిత మహిళ కృష్ణకుమారి కోల్హీని పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ) ఆ దేశ సెనెట్‌కు నామినేట్‌ చేసిన సంగతి తెలిసిందే.

ఈ ఎన్నికల్లో పోటీ చేయడంపై సునీత మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయినందు వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. 21 శతాబ్ధంలో కూడా ఈ ప్రాంతంలో మహిళలకు కనీస విద్య, వైద్య వసతులు లేకపోవడం దారుణమని మండిపడ్డారు. మహిళలు బలహీనులు, భయస్థులు అనే రోజులు పోయాయన్నారు. గెలుపుపై తనకు పూర్తి విశ్వాసం ఉందని స్పష్టం చేశారు.

తాను గెలిస్తే నియోజవర్గంలోని మహిళలకు మెరుగైన విద్య, వైద్య సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. స్త్రీలకు మెరుగైన విద్యను అందించడం ద్వారా వారు శక్తివంతంగా తయారవుతారని ఆమె అభిప్రాయపడ్డారు. కాగా 2017 లెక్కల ప్రకారం తార్పర్కర్‌ జిల్లాలోని 16 లక్షల జనాభాలో దాదాపు సగం మంది హిందువులే. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top