లంక ఎన్నికల్లో రాజపక్స విజయం

Gotabaya Rajapaksa Wins Sri Lanka Presidential Election - Sakshi

నేడు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న గొటబాయ రాజపక్స

కొలంబో: శ్రీలంక అధ్యక్షుడిగా గొటబాయ రాజపక్స (70) విజయం సాధించారు. తన ప్రత్యర్థి ప్రేమదాస రణసింఘేపై దాదాపు 13 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. లంకకు ఏడో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న గొటబాయ ఆ పదవిలో అయిదేళ్ల పాటు కొనసాగనున్నారు. లంకలోని ప్రాచీన నగరం అనురాధపురంలో ఆయన సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజపక్స కుటుంబం నుంచి 2005–15 మధ్య మహింద రాజపక్స అధ్యక్షుడిగా పని చేశారు. ఆయన తమ్ముడే ఇప్పుడీ ఎన్నికల్లో గెలుపొందిన గొటబాయ. వివాదాస్పదుడిగానూ, ఎల్‌టీటీఈ తీవ్రవాదులను అణచివేసిన మిలిటరీ వార్‌ హీరోగానూ గొటబాయకు పేరుంది.  

నమ్మకాన్ని నిలబెడతా: గొటబాయ
ఆదివారం వెలువడిన ఫలితాల్లో గొటబాయ 52.25 శాతం ఓట్లను (6,924,255) సాధించగా, ఆయన ప్రత్యర్థి ప్రేమదాస 41.99 శాతం ఓట్లను (5,564,239) సాధించారని ఎన్నికల కమిషన్‌ చైర్మన్‌ మహింద దేశప్రియ చెప్పారు.  విజయం ఖరారు కాగానే గొటబాయ రాజపక్స.. ‘శ్రీలంక కోసం చేసే కొత్త ప్రయాణంలో దేశ ప్రజలూ భాగస్తులే. ఎన్నికల ప్రచారంలో మెలిగినట్లే శాంతియుతంగా సంబరాలు చేసుకుందాం. నన్ను ఎన్నుకున్న ప్రజలకు కృతజ్ఞుడినై ఉంటాను. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతాను’ అంటూ ట్వీట్‌ చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రధాని రణిల్‌ విక్రమ సింఘే రాజీనామా చేసే అవకాశం ఉంది. ప్రధాన మంత్రిగా మాజీ అధ్యక్షుడు, గొటబాయ సోదరుడు మహింద రాజపక్స నియమితులు అయ్యే అవకాశం కనిపిస్తోంది.

అభినందనలు తెలిపిన మోదీ..
అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన గొటబాయ రాజపక్సకు భారత ప్రధాని మోదీ అభినందనలు చెప్పారు. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలపరిచేందుకు ఎదురుచూస్తున్నానని చెప్పారు. దీనిపై గొటబాయ స్పందించారు. మోదీకి, భారత ప్రజలకు కృతజ్ఙతలు చెప్పారు. త్వరలోనే మోదీని కలుస్తానని ట్వీట్‌ చేశారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top