పరీక్షలకే పరీక్ష!

False positive and negative cases in Corona tests - Sakshi

కోవిడ్‌ టెస్టు ఫలితాల్లో భారీగా తేడాలు 

ఫాల్స్‌ పాజిటివ్, ఫాల్స్‌ నెగిటివ్‌తో సమస్యలు

ముంబై/వాషింగ్టన్‌: ఆమె పేరు వందన షా. ముంబైలో ప్రముఖ న్యాయవాది. సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఉండడంతో ముందస్తుగా కోవిడ్‌ పరీక్షలు చేశారు. ఆ పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆమెని క్వారంటైన్‌ చేశారు. మూడు రోజుల తర్వాత ప్రభుత్వం పరీక్షలు చేస్తే ఆమెకి నెగిటివ్‌ అని తేలింది. ఈ మధ్యలో ఆమె అనుభవించిన వేదన వర్ణనాతీతం. ముంబ్రాలో నివసించే సమీర్‌ ఖాన్‌ అనే వ్యక్తి వేరే అనారోగ్యంతో ఆస్పత్రికి వెళితే ఎందుకైనా మంచిదని కరోనా పరీక్ష చేస్తే పాజిటివ్‌ అని తేలింది. అదే రోజు థానె మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరీక్షలో  (టీఎంసీ) నెగిటివ్‌ వచ్చింది. ఈ సమస్య కేవలం వీరిద్దరిదే కాదు. ఎన్నో రాష్ట్రాల్లో ప్రైవేటు ల్యాబ్స్‌లో ఇదే పరిస్థితి. నోయిడాలో ప్రైవేటు ల్యాబొరేటరీల్లో కూడా ఇలా ఫాల్స్‌ పాజిటివ్‌ కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయి. మూడు రోజుల క్రితం ఇలా 19 మంది కోవిడ్‌ ప్రభుత్వ ఆస్పత్రుల్లో జాయిన్‌ అయ్యారు. అక్కడ పరీక్షలు చేస్తే వారికి నెగిటివ్‌ వచ్చింది. దీంతో వారినందరినీ శనివారమే ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ చేశారు.  

అమెరికాలో ఫాల్స్‌ నెగిటివ్‌ సమస్య  
దక్షిణకొరియా, రష్యా వంటి దేశాల్లో ఫాల్స్‌ పాజిటివ్‌ ఫలితాలు వస్తే, అగ్రరాజ్యం అమెరికాలో దానికి విరుద్ధంగా ఫాల్స్‌ నెగిటివ్‌ వస్తున్నాయి. వాస్తవానికి ఒక వ్యక్తికి కరోనా వైరస్‌ సోకి ఉంటుంది కానీ, పరీక్షల్లో బయటపడదు. నెగిటివ్‌ వచ్చింది కదాని హాయిగా తిరిగేయడం వల్ల ఆ వ్యక్తి నుంచి మరికొందరికి సంక్రమించే ప్రమాదం ఉంటుంది. అమెరికాలో ఇలా 15% మందికి ఫాల్స్‌ నెగిటివ్‌ ఫలితాలు వచ్చాయి.  

సమస్యలివీ..
► కోవిడ్‌–19 ఫాల్స్‌ పాజిటివ్‌ రావడం వల్ల ప్రభుత్వాలపై భారం పడుతోంది. వారిని క్వారంటైన్‌ చేయడం, వారు ఎవరెవరినీ కలిశారో వెతికి పట్టుకోవడం, మళ్లీ వారికి పరీక్షలు ఇదంతా ప్రభుత్వాలపై ఆర్థిక భారం మోపుతోంది.

► మహారాష్ట్ర ప్రైవేటు ల్యాబ్స్‌లో ఫాల్స్‌ పాజిటివ్‌ వస్తూ ఉండడంతో రోగుల సంఖ్య ఎక్కువై పో యి ఆస్పత్రులు నిండిపోతున్నాయి. నిజమైన రోగులకు చికిత్స ఆలస్యం కూడా అవుతోంది.  

► కరోనాపై చాలా భయాందోళనలు నెలకొన్నా యి. ఫాల్స్‌ పాజిటివ్‌ రావడం వల్ల సున్నిత మనస్కులు మానసికంగా కుంగిపోతున్నారు. కొందరైతే ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేస్తున్నారు.  

► ఫాల్స్‌ నెగిటివ్‌ సమాజానికి అత్యంత ప్రమాదకరం. ప్రపంచదేశాల్లో సగటున 29% వరకు ఇలాంటి కేసులు నమోదవుతున్నాయి. వారిలో వైరస్‌ ఉంటుంది కానీ లేదని నిర్ధారణ కావడంతో క్వారంటైన్‌ చేయరు. దీంతో వాళ్ల ద్వారా చాలా మందికి సంక్రమిస్తోంది. అమెరికాలో ఇబ్బడిముబ్బడిగా కేసులు పెరిగిపోవడానికి ఫాల్స్‌ నెగిటివ్‌ కూడా కారణమే.

► ఏ లక్షణాలు లేకపోయినా పరీక్షలు చేయడంపై కూడా భిన్నాభిప్రాయాలున్నాయి. పరీక్షల్లో కచ్చితమైన ఫలితాలు వస్తాయని ఎవరూ గ్యారంటీ ఇవ్వలేరు. తప్పుడు ఫలితం ఏదైనా ప్రభుత్వంపైనా, ప్రజలపైనా భారాన్ని మోపుతోంది. అందుకే అవసరమైతేనే పరీక్షలు చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.   

కారణాలివీ..
► కరోనా అనుమానితుడి నుంచి శాంపిల్స్‌ సేకరించి ల్యాబ్‌కు అత్యంత జాగ్రత్తగా పంపించాలి. అలా పంపే క్రమంలో ఆ బాటిల్‌ విరిగినా, ఇతర శాంపిల్స్‌తో కలిసిపోయినా, కలుషితమైనా ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంది.

► కరోనా కిట్స్‌లో లోపాలు కూడా తప్పుడు ఫలితాలకు కారణమవుతున్నాయి. రాపిడ్‌ యాంటీబాడీ టెస్ట్‌ కిట్స్‌ ఫలితాల్లో తేడా 15–20% ఉంటోంది. ఇది చాలా ఎక్కువని వైద్య నిపుణుల భావన.  

► మానవ తప్పిదం కూడా మరో కారణమే. పరీక్షలు చేసినప్పుడు ల్యాబ్‌ టెక్నీషియన్లు అప్రమత్తంగా లేకపోయినా, వారిలో నైపుణ్యం కొరవడినా ఫలితాలు తప్పుగా వెలువడే అవకాశాలున్నాయి.

► శాంపిల్స్‌ తీసుకునే సమయం కూడా ఒక్కోసారి ఫలితాల్ని గందరగోళంలో పడేస్తుంది. వైరస్‌ మన శరీరంలో ప్రవేశించిన వెంటనే పరీక్షలు చేస్తే 50శాతం మందికి నెగిటివ్‌ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కొద్ది రోజులకి పరీక్ష చేస్తే పాజిటివ్‌ వస్తుంది.

శస్త్రచికిత్స కోసమో, మరేదైనా బాధతోనో ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లేవారికి విధిగా కోవిడ్‌ పరీక్షలు చేస్తున్నారు. వారికి పాజిటివ్‌ వస్తూ ఉండడంతో ప్రభుత్వ ఆస్పత్రులకు పంపేస్తున్నారు. ఇక్కడ పరీక్షలు చేస్తే నెగిటివ్‌ వస్తోంది. దీంతో అసలైన రోగులకు చికిత్స ఆలస్యమవుతోంది. వ్యాధిలేని వారు కూడా ఆస్పత్రిలో చేరడం వారికి కూడా ప్రమాదమే
–విజయ్‌ సింఘాల్, థానే మున్సిపల్‌ కమిషనర్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top