ఆటో డ్రైవర్‌ అకౌంట్‌లో రూ.300 కోట్లు!

Auto Driver Stumped by Rs 300 Crore Transactions Via His Account In Pakistan - Sakshi

కరాచీ : ఆయన ఓ ఆటో డ్రైవర్‌ కానీ ఆయన బ్యాంకు అకౌంట్‌లో రూ.300 కోట్ల రూపాయలు ఉన్నాయి. అదేంటీ అన్ని కోట్ల రూపాయలు ఉండి ఆటో తోలాల్సిన అవసమేముంది అనుకుంటున్నారా..? అంత డబ్బు తన దగ్గర ఉందని ఆయనకే తెలియదు పాపం. దర్యాప్తు సంస్థ అధికారులు నుంచి ఫోన్‌కాల్‌ రావడంతో అసలు విషయం తెలిసి ఆశ్చర్యానికి గురయ్యారు.

పాకిస్తాన్‌లోని కరాచీ పట్టణానికి చెందిన ముహమ్మద్‌ రషీద్‌ ఆటో డ్రైవింగ్‌ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇటీవల రషీద్‌ బ్యాంకు అకౌంట్‌ నుంచి రూ.300 కోట్ల లావాదేవీలు జరిగినట్లు పాకిస్తాన్‌ దర్యాప్తు సంస్థ అధికారులు గుర్తించారు. రషీద్‌ను తమ కార్యాలయానికి పిలిపించిన ఫెడరల్ దర్యాప్తు సంస్థ (ఎఫ్‌ఐఏ) ఈ విషయంపై ఆరా తీసింది. అయితే, తన ఖాతాలోకి అంత డబ్బు ఎలా వచ్చిందో తెలియదని ఆ డ్రైవర్ అంటున్నాడు.

విచారణ అనంతరం రషీద్‌ మీడియాతో మాట్లాడుతూ..‘నన్ను ఎఫ్‌ఐఏ కార్యాలయానికి రమ్మంటే వెళ్లాను. నేను చాలా భయపడిపోయాను. అధికారులు నా అకౌంట్‌ వివరాలు చూపెడుతూ దాని ద్వారా రూ.300 కోట్ల లావాదేవీలు జరిగాయని చెప్పారు.అది విని ఆశ్చర్యానికి గురయ్యాను. నేను 2005లో  ఓ ప్రైవేట్‌ సంస్థలో పనిచేశాను. ఆ సమయంలో బ్యాంకు ఖాతా తెరిచాను. నా జీతం డబ్బులు అందులో వేసేవారు. కొద్ది నెలల తర్వాత నేను ఆ ఉద్యోగం మానేసి ఆటో తోలుకుంటున్నాను. నా జీవితంలో ఇంత వరకు లక్ష రూపాయలు కూడా చూడలేదు. అలాంటిది మూడువందల కోట్ల రూపాయలు నా అకౌంట్లో ఉందనడం నా ఊహకు కూడా అందని విషయం. ఇప్పటికీ నేను అద్దె ఇంట్లోనే ఉంటున్నాను.  నా ఖాతాను ఎవరో ఉపయోగించుకుని లావాదేవీలు జరిపారు. ఈ విషయాలన్నింటినీ అధికారులకు చెప్పాను’  అని రషీద్‌ తెలిపారు. 

కాగా, కొన్ని రోజుల క్రితమే పాకిస్తాన్‌లో ఇటువంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. కరాచీలో ఉన్న ఓటిఫిన్‌ సెంటర్‌ యనమానీ అకౌంట్‌లో ఆయనకు తెలియకుండానే రూ.200 కోట్లు వచ్చి పడ్డాయి. ఈ లావాదేవీలు ఎవరు జరిపారనే అంశంపై ఎఫ్‌ఐఏ అధికారులు విచారణ చేపట్టారు.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top