అమెరికా గ్రీన్‌ కార్డు జీవితకాలం లేటు

American Green Cards Going To Be More Delay - Sakshi

4 లక్షలకు మందికి పైగా భారతీయులకు 151 ఏళ్ల వెయిటింగ్‌ 

అమెరికాలో శాశ్వత నివాసం అంటే ఇక పగటి కలేనా ? వర్క్‌ పర్మిట్‌ వీసాలతో ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది వస్తుందో తెలీక ఆందోళనతో గడపాల్సిందేనా ? వాషింగ్టన్‌కు చెందిన కాటో ఇనిస్టిట్యూట్‌ అంచనాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. అడ్వాన్స్‌డ్‌ డిగ్రీలు కలిగిన ఇబీ–2 కేటగిరీలో  భారతీయులకు గ్రీన్‌ కార్డు రావాలంటే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 151 సంవత్సరాలు వేచి చూడాలట. అంటే ఇంక వాళ్లు తమ జీవితకాలంలో గ్రీన్‌ కార్డుని పొందలేరన్న మాట. ఈ కేటగిరిలో గ్రీన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న భారతీయులు 4 లక్షల మందికిపైగా ఉన్నారు. అమెరికా సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) వెల్లడించిన గ్రీన్‌ కార్డు దరఖాస్తు దారుల వివరాలను, గత ఏడాది గ్రీన్‌ కార్డు మంజూరు అయిన తీరుని పరిశీలించి చూసిన కాటో ఇనిస్టిట్యూట్‌ తాజా అంచనాలనువెల్లడించింది. ఏప్రిల్‌ 20, 2018 నాటికి 6లక్షల 32 వేల 219 మంది భారతీయులు, వారి జీవిత భాగస్వామ్యులు, మైనర్‌ పిల్లలు గ్రీన్‌ కార్డు కోసం వేచి చూస్తున్న వారిలో ఉన్నారు. అయితే అత్యంత నైపుణ్యం కలిగిన కేటగిరీలో ఉన్న వలసదారులకు (ఇబీ–1, ఎక్సట్రార్డనరీ ఎబిలిటీ) మాత్రం ఆరేళ్లలోనే గ్రీన్‌ కార్డు లభిస్తుందని ఆ సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది.

ఏ కేటగిరీలో ఎంతమంది వెయిటింగ్‌
అమెరికాలో చేస్తున్న ఉద్యోగాల ఆధారంగా గ్రీన్‌కార్డు దరఖాస్తుదారుల్ని ఇబీ–1, ఇబీ–2, ఇబీ–3 అని మూడు భాగాలుగా విభజించారు. ఇబీ–1 కేటగిరీలో 34,824 మంది భారతీయులు, జీవిత భాగస్వాములు 48,754, ఇక పిల్లల్లో83,578 మంది గ్రీన్‌ కార్డు కోసం వేచిచూస్తున్నారు. బ్యాచిలర్‌ డిగ్రీ కలిగిన ఇబీ–3 కేటగిరీలో దరఖాస్తు దారులు  గ్రీన్‌కార్డు కోసం 17 ఏళ్లు వేచి చూడాలి. ఈ కేటగిరీలో మొత్తం లక్షా 15 వేల 273 మంది భారతీయులు గ్రీన్‌ కార్డు కోసం క్యూలో ఉన్నారు. ఇక సమస్యల్లా అడ్వాన్స్‌ డిగ్రీ కలిగిన  ఇబీ–2 కేటగిరీలోనే.. ప్రస్తుతం గ్రీన కార్డులు మంజూరైన విధానాలను పరిశీలిస్తే ఈ కేటగిరీలో వారు 151 ఏళ్లు వేచి చూడాలి. ఈ కేటగిరిలో ఏకంగా 2,16,684 మంది భారతీయులు, వారి జీవితభాగస్వాములు, పిల్లలు 2,16,684 మంది గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేశారు. అంటే మొత్తంగా ఈ కేటగిరీలో 4 లక్షల 33 వేల 368 మంది శాశ్వత నివాసం కోసం ఎదురు చూస్తున్నారు.

ఎందుకింత ఆలస్యం 
ప్రస్తుతం అమెరికాలో ఉన్న చట్టాల ప్రకారం ఒక ఏడాది మొత్తం జారీ చేసే గ్రీన్‌ కార్డుల్లో ఒక్కో దేశానికి ఏడు శాతానికి మించి ఉండకూడదన్న నిబంధనలున్నాయి. ఒక్కో కేటగిరీలో మొత్తంగా 40 వేలవరకు గ్రీన్‌ కార్డులు మంజూరు అవుతాయి. అందులో ఒక్కో దేశానికి అన్న పరిమితి ఆధారంగా వీటిని కేటాయిస్తారు. అలాగే ఒక కేటగిరీలో తక్కువ మంది దరఖాస్తు దారులు ఉండి, మరో కేటగిరీలో ఎక్కువ మంది ఉంటే వాటిని అటూ ఇటూ మార్చుకోవడానికి కూడా నిబంధనలు అంగీకరించవు. ఇబీ–2 కేటగిరీలో పరిమితికి మించి దరఖాస్తులు ఉండడంతో వాళ్లు వేచి చూడాల్సిన సమయం కూడా విపరీతంగా పెరిగిపోతోంది. ఒక్కో ఏడాది కొన్ని కేటగిరీలో సరిపడా దరఖాస్తులు లేక గ్రీన్‌ కార్డులు వృథాఅయిన సందర్భాలు కూడా ఉన్నాయని కాటో ఇనిస్టిట్యూట్‌ తన నివేదికలో వెల్లడించింది. అమెరికా ప్రభుత్వం వలస చట్టాలను మార్చకపోతే పరిస్థితి ఇలాగే ఉంటుందని వివరించింది. గత ఏడాది కేవలం 22,602 మంది భారతీయులకు మాత్రమే గ్రీన్‌ కార్డు మంజూరైంది. 
(సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top