అమెరికా మాజీ అధ్యక్షుడిపై నటి సంచలన ఆరోపణలు | Actress Heather Lind claims George HW Bush sexually assaulted her | Sakshi
Sakshi News home page

అమెరికా మాజీ అధ్యక్షుడిపై నటి సంచలన ఆరోపణలు

Oct 25 2017 5:04 PM | Updated on Jul 23 2018 9:15 PM

Actress Heather Lind claims George HW Bush sexually assaulted her - Sakshi

వీల్‌చైర్‌లో సీనియర్‌ బుష్‌, ఆయనకు ఎడమవైపు(బ్లాక్‌ డ్రెస్‌లో) నటి హెయిథర్‌ లిండ్‌.

వాషిగ్టన్‌ : అమెరికా మాజీ అధ్యక్షడు జార్జ్‌ హెచ్‌డబ్ల్యూ బుష్‌(సీనియర్‌)పై ప్రముఖ నటి హెయిథర్‌ లిండ్‌ సంచలన ఆరోపణలు చేశారు. బుష్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ఆ సమయంలో ఆయన భార్య కూడా పక్కనే ఉన్నారని లిండ్‌ వెల్లడించారు. #meetoo ట్యాగ్‌ను జోడించి మంగళవారం ఆమె చేసిన ట్విట్‌.. నిమిషాల్లోనే సినీ, రాజకీయ వర్గాల్లో దావానలాన్ని రేపింది.

నటి ఏం చెప్పారంటే.. : ‘‘నేను నటించిన ఓ టీవీ షో ప్రమోషన్‌లో భాగంగా యూనిట్‌  ముఖ్యులతో కలిసి మాజీ అధ్యక్షుడు జార్జిబుష్ నివాసానికి వెళ్లాం. ఆ సమయంలో బుష్‌ వెంట ఆయన భార్య బార్బరా కూడా ఉన్నారు. కొన్ని మాటల అనంతరం ఫొటో దిగేందుకు దగ్గరికి జరగ్గా.. బుష్‌ తన చేతితో నా వెనుకభాగాన్ని నిమిరారు. బుష్‌ చర్యను ఆయన భార్య గమనించినా, మిన్నకుండిపోయారు. తర్వాత ఇంకా దగ్గరికి పిలిచి, నా చెవిలో ఒక బూతు జోక్‌ చెప్పారు’’ అని నటి హెయిథర్‌ లిండ్‌ రాసుకొచ్చారు.

అంత దగ్గరగా ఎందుకు నిల్చున్నావ్‌? : నేటికి సరిగ్గా నాలుగేళ్ల కిందట ఈ సంఘనట జరిగిందని లిండ్‌ పేర్కొన్నారు. బుష్‌ ప్రవర్తనపై అప్పటికప్పుడే ఆయన సెక్యూరిటీకి ఫిర్యాదు చేయగా, ‘మీరు అనవసరంగా ఆయనకు దగ్గరిగా వెళ్లారు’ అని వాళ్లు సమాధానమిచ్చినట్లు నటి తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రభంజనంలా మారిన ‘మీ టూ’  క్యాంపెయిన్‌లో భాగంగా లిండ్‌ తాన చేదు అనుభవాన్ని పంచుకున్నారు.

సరదాగా చేశా.. క్షమించు : నటి లిండ్‌ చేసిన ఆరోపణలపై మాజీ ప్రెజిడెంట్‌ బుష్‌ గంటల వ్యవధిలోనే స్పందించారు. తాను కేవలం సరదాగానే చెయ్యివేశానని, మనసులో ఎలాంటి దురుద్దేశం లేదని, జరిగిన తప్పుకు క్షమాపణలు చెప్పుకుంటున్నానని అధికారిక ప్రకటన చేశారు.

#meetoo : ప్రముఖ హాలీవుడ్ నటి అలిసా మిలానో ‘మీ టూ’ అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హాలీవుడ్ నిర్మాత హార్వే వైన్‌స్టీన్ లైంగిక వేధింపులను ప్రస్తావిస్తూ చేసిన ట్వీట్‌కి అనూహ్యమైన స్పందన లభించింది. మహిళలపై జరుగుతున్న వేధింపులు, అత్యాచారాలకు వ్యతిరేకంగా గళమెత్తాలని ఆమె ఇచ్చిన పిలుపును అందుకుని సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు లక్షలాది మంది స్పందిస్తున్నారు. దాదాపు అన్ని దేశాల మహిళలు #meetoo ద్వారా చేదు అనుభవాలను పంచుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement