ప్రయాణికుడి నడ్డి విరిగేలా ఆర్టీసీ చార్జిలు పెంచిన చంద్రబాబు సర్కార్ తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది.
హైదరాబాద్: ప్రయాణికుడి నడ్డి విరిగేలా ఆర్టీసీ చార్జిలు పెంచిన చంద్రబాబు సర్కార్ తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. చార్జిల పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకించింది. పెంచిన చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వ చర్యను దుర్మార్గంగా పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది.
ఎడాపెడా పన్నులతో ఆర్టీసీని దివాలా తీయించిన ఘనత చంద్రబాబుదేనని, ఇప్పుడు మళ్లీ ఒకేసారి 10 శాతం ధరలు పెంచడం దారుణమని వైఎస్సార్ సీపీ విమర్శించింది. ఓ వైపు అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు సగానికి తగ్గినా, ఆర్టీసీ చార్జిలు పెంచడం ఏమిటని ప్రశ్నించింది. ప్రైవేట్ రవాణాను అరికట్టి డీజిల్ పై వ్యాట్ ఎత్తివేయాలని, ఒక్కపైసా చార్జీ పెంచకుండా సంస్థను నష్టాల నుంచి గట్టెక్కించాలని సూచించింది.