పరిశోధన అంతంతే..!

పరిశోధన అంతంతే..! - Sakshi

తెలంగాణ 11వ స్థానం

ఆంధ్రప్రదేశ్‌ 15వ స్థానం

 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు పరిశోధనలకు దూరమవుతున్నాయి. అధ్యాపకుల ఖాళీలతో నాణ్యమైన విద్య అంతంతగానే అందుతుండంతో డాక్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీలో (పీహెచ్‌డీ) ప్రవేశాలకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో ఏటా పీహెచ్‌డీల్లో చేరే వారి సంఖ్య తగ్గుతోంది. 2015–16 నాటి లెక్కలతో ‘ఆలిండియా సర్వే ఆన్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌’ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం.. తమిళనాడు 22,221 మంది పీహెచ్‌డీ విద్యార్థులతో దేశంలో తొలి స్థానంలో ఉండగా, 11,777 మందితో కర్ణాటక రెండో స్థానంలో ఉంది. ఇక తెలంగాణ 4,133 మందితో 11, ఏపీ 3,106 మందితో 15వ స్థానాల్లో ఉన్నాయి.

 

మహిళలు తక్కువే...

పీహెచ్‌డీల్లో ప్రవేశాలు పొందుతున్న వారిలో పురుషులే అత్యధికంగా ఉన్నారు. పరిశోధనల పట్ల మహిళలు ఆసక్తి చూపడం లేదన్న దానికి ఇదే నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలోనే కాదు... దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి. 

 

ఎంఫిల్‌ ప్రవేశాలూ అంతంతే... 

పీహెచ్‌డీ ప్రవేశాల్లో ప్రవేశ పరీక్షలో అర్హత సాధించడంతోపాటు మాస్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ (ఎంఫిల్‌) చేసిన వారికి తొలి ప్రాధాన్యం ఉంటుంది. అందుకే ఎంఫిల్‌లో చేరేందుకు కూడా ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి చూపుతుంటారు. అయితే ఎంఫిల్‌లో కూడా ఎక్కువ మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నది తమిళనాడు రాష్ట్రమే. 2015–16 లెక్కల ప్రకారం 19,509 మందికి ఎంఫిల్‌కు అవకాశం కల్పించింది. ఆ తరువాతి స్థానాల్లో వరుసగా... ఢిల్లీ (5,915 మంది), మహారాష్ట్ర (2,900) ఉన్నాయి. మిగిలిన రాష్ట్రాల్లో 1,500 కంటే తక్కువ మంది ఎంఫిల్‌ చేస్తున్నారు. తెలంగాణ, కర్ణాటక, ఏపీల్లో ఈ సంఖ్య 630 మంది లోపే ఉంటుంది. ఇవే కాకుండా ఇతర డిగ్రీ, పీజీ, డిప్లొమా, వృత్తి విద్యా కోర్సుల్లో దాదాపు అదే పరిస్థితి. 2015–16లో రాష్ట్రంలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో 11,60,673 మంది చేరగా, మొత్తంగా అన్ని కోర్సుల్లో కలిపి 14,74,235 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 

 

2015–16లో దేశ వ్యాప్తంగా

పీహెచ్‌డీ చేస్తున్న వారి సంఖ్య 1,26,451

ఇందులో పురుషుల సంఖ్య 74,547 

మహిళల సంఖ్య 51,904

దేశ వ్యాప్త పీహెచ్‌డీ విద్యార్థుల్లో తెలంగాణ

పురుషుల సంఖ్య 2,710

మహిళల సంఖ్య 1,423
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top