టెక్నాలజీ ఫ్యూషన్‌ సెంటర్‌ ప్రారంభించిన డీజీపీ | Sakshi
Sakshi News home page

టెక్నాలజీ ఫ్యూషన్‌ సెంటర్‌ ప్రారంభించిన డీజీపీ

Published Wed, Jan 3 2018 12:44 PM

TS DGP Mahender reddy inaugurates technology fusion center - Sakshi

హైదరాబాద్ : హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో టెక్నాలజీ ఫ్యూషన్ సెంటర్‌ను డీజీపీ మహేందర్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం ప్రారంభించారు. కొత్త టెక్నాలజీతో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ యూనిట్‌, సీసీ కెమెరాల కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌, ట్రాఫిక్‌ కమాండ్‌ సెంటర్‌, సోషల్‌ మీడియా ల్యాబ్‌, డయల్‌ హాక్‌ ఐ సెంటర్లను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. నూతన సాంకేతికతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. అన్ని వ్యవహారాలను ఫ్యూషన్ సెంటర్‌తో అనుసంధానం చేయవచ్చన్నారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ యూనిట్, సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్‌ను అనుసంధానించవచ్చు అని పేర్కొన్నారు. ఈ ఫ్యూషన్ సెంటర్ నేర శాతాన్ని తగ్గించడానికి దోహదపడుతుందని స్పష్టం చేశారు.

బంజారాహిల్స్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం కాగానే ఈ టెక్నాలజీ సెంటర్‌ను అక్కడికి తరలిస్తామని వెల్లడించారు. పోలీసు శాఖ టెక్నాలజీకి మారుపేరుగా మారుతుందని డీజీపీ అన్నారు. జిల్లాల్లో ఉన్న మినీ కమాండ్ కంట్రోల్‌తో ఈ ఫ్యూషన్ సెంటర్‌ను అనుసంధానం చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్న విధంగా శాంతి భద్రతలను కాపాడుతామని తెలిపారు.  టెక్నాలజీకి మారుపేరుగా మారిన హైదరాబాద్‌కు పెట్టుబడులను ఆకర్షించే విధంగా తమ వంతు కృషి చేస్తామని డీజీపీ పేర్కొన్నారు.

Advertisement
Advertisement