
గ్రేటర్‌లో టీఆర్‌ఎస్‌కు 70 సీట్లు!
జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే ఏయే పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందనే ఊహాగానాలు జోరందుకుంటున్నాయి.
ఓ ఏజెన్సీ ముందస్తు సర్వే ఫలితాల్లో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే ఏయే పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందనే ఊహాగానాలు జోరందుకుంటున్నాయి. ‘ఇప్పటికే మూడు నాలుగు సర్వేలు జరిగాయి.. సిటీ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. అన్ని వర్గాలు మాకు అనుకూలంగా ఉన్నాయి...’అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవలే వ్యాఖ్యానించారు. తాజాగా ఓ ఏజెన్సీ నిర్వహించిన సర్వేలో వెల్లడైన అంచనా ఫలితాలను ఆదివారం ఆయన ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
జీహెచ్‌ఎంసీ ప్రిలిమినరీ ఒపీనియన్ పోల్ పేరుతో ఉన్న ఈ సర్వే ఫలితాల ప్రకారం.. మొత్తం 150 సీట్లలో అత్యధికంగా టీఆర్‌ఎస్ 70 స్థానాలు గెలుచుకుంటుంది. 42 సీట్లతో ఎంఐఎం రెండో స్థానంలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ 16, టీడీపీ 11, బీజేపీ 8 స్థానాలు గెలుచుకుంటాయి. ఇతర పార్టీలు మూడు సీట్లకు పరిమితమవుతాయి. వీడీపీ అసోసియేట్స్ పేరుతో ఉన్న ఈ ట్వీట్‌ను కేటీఆర్ రీట్వీట్ చేశారు.