‘క్షమాభిక్ష’ కార్మికులకు టికెట్ల భారం

Ticket burden to workers - Sakshi

చార్జీలను పెంచిన విమానయాన సంస్థలు

‘కువైట్‌ ఆమ్నెస్టీ’ని కాసులపంటగా మార్చుకుంటున్న వైనం

రూ.8 వేలు ఉన్న టికెట్‌ ధర ఒకేసారి రూ.18 వేలకు పెంపు

మోర్తాడ్‌(బాల్కొండ): మూలిగే నక్కపై తాటికాయ పడిందన్న చందంగా తయారైంది కువైట్‌ లోని మన కార్మికుల పరిస్థితి. ఆ దేశంలో ఖల్లివెల్లి (నిబంధనలకు విరుద్ధంగా) కార్మికులుగా ఉంటున్న వారు కువైట్‌ విడిచి వెళ్లేందుకు అక్కడి ప్రభుత్వం క్షమాభిక్ష ద్వారా అవకాశం కల్పించింది. దీంతో భారత కార్మికులు పెద్ద సంఖ్యలో స్వదేశానికి వస్తున్నారు. ఫలితంగా విమాన టికెట్లకు డిమాండ్‌ పెరగడంతో విమానయాన సంస్థలు ఇష్టారాజ్యంగా ధరలు పెంచేస్తున్నాయి.

సాధారణంగా రూ.8 వేలు ఉన్న విమాన చార్జీ ఇప్పుడు ఏకంగా రూ.18 వేలకు పెంచడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కువైట్‌ ప్రభుత్వ క్షమాభిక్షలో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్న కార్మికులు ఈ నెల 22 లోపు ఆ దేశాన్ని వదలి వెళ్లాలి. జనవరి 29 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. క్షమాభిక్షను వినియోగించుకునే వారిలో తెలుగు రాష్ట్రాల కార్మికులు వేల సంఖ్యలో ఉన్నారు. గడువు నాలుగు రోజులే ఉండటం, ప్రయాణికులు ఎక్కువగా ఉండటంతో విమానయాన సంస్థలు టికెట్ల ధరలను భారీగా పెంచాయి.  

ప్రత్యేక విమానాల ఊసే లేదు..
కువైట్‌లో ఆమ్నెస్టీ కారణంగా మన దేశం నుంచి ఎక్కువ విమానాలను నడపాలి. అయితే, కువైట్‌ నుంచి మన దేశానికి ప్రధానంగా శంషాబాద్‌ విమానాశ్రయానికి రావడానికి ప్రత్యేక విమానాలను నడపడం లేదు. దీనివల్ల అందుబాటులో ఉన్న విమానాల టికెట్లను కార్మికులు కొనుగోలు చేయాల్సి వస్తోంది. కాగా, అనేకమందికి విమాన చార్జీలకు సరిపడా చేతిలో డబ్బులు లేవు. దీంతో ప్రభుత్వం లేదా స్వచ్ఛంద సంస్థల సహకారం కోసం వారు ఎదురు చూస్తున్నారు.   విమాన చార్జీల పెంపుపై కేంద్రం దృష్టి సారించాలని, క్షమాభిక్షపై తిరిగి వస్తున్న కార్మికులకు టికెట్‌ రాయితీ సౌకర్యం కల్పించాలని కార్మికులు కోరుతున్నారు.

కువైట్‌లో పరిస్థితి దారుణం
కువైట్‌లో క్షమాభిక్ష వల్ల స్వదేశానికి వచ్చే కార్మికులకు సహకారం అందించడానికి ఏఐసీసీ నేత రామచంద్ర కుంతి యా బృందంలో సభ్యుడిగా నేను కువైట్‌లో పర్యటిస్తున్నాను. ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. దీనికి తోడు విమాన సంస్థలు చార్జీలను పెంచడం వల్ల కార్మికులపై మరింత భారం పడుతోంది. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలి. – డాక్టర్‌ జేఎన్‌ వెంకట్,కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top