రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింపజేస్తున్న పదవీ విరమణ వయస్సు పెంపు ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు తదితర చోట్ల పనిచేసే వారికి వర్తించదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు నివేదించింది.
- కార్పొరేషన్ల ఉద్యోగులకు వయసు పెంపు వర్తించదు
- హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింపజేస్తున్న పదవీ విరమణ వయస్సు పెంపు ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు తదితర చోట్ల పనిచేసే వారికి వర్తించదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు నివేదించింది. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న వారికి ప్రభుత్వ సంచిత నిధి (కన్సాలిడేటెడ్ ఫండ్) నుంచి జీతాలు చెల్లించడం లేదని, వారు ప్రభుత్వ ఉద్యోగుల నిర్వచన పరిధిలోకి రారంది.
దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. ఒకవేళ ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న వారికి కూడా 60 ఏళ్ల పదవీ విరమణ వయసు వర్తింపజేయాలని తాము ఆదేశాలిస్తే వారి ఆర్థిక ప్రయోజనాలన్నింటికీ పూర్తి బకాయిలతో సహా చెల్లిస్తారో లేదో చెప్పాలని అడ్వొకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌కు సూచించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక సీజే జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.